
లాక్‌డౌన్ అమలుపై కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో లాక్‌డౌన్‌ను పగడ్బందీగా అమలు చేస్తున్నందుకు పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. లాక్‌డౌన్ కరీంనగర్ జిల్లాలో అమలవుతున్న విధంగా పక్కనున్న జిల్లాలు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పగడ్బందీగా అమలయ్యేందుకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా సీపీకి సీఎం సూచించారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా అదనపు ఎస్పీ రితిరాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలి..
లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా చికిత్స, లాక్‌డౌన్ అమలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై శుక్రవారం వరంగల్ నుంచి సీఎం జిల్లా కలెక్టర్లు, జిల్లా సీపీలు, ఎస్‌పీలు, జిల్లా వైద్యశాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా సమీక్షించారు. లాక్‌డౌన్ సమయంలో కొంత మంది యువకులు, ప్రజలు అనవసరంగా బయటకు వస్తున్నారని, దీని పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా చికిత్స పకడ్బందీగా అందిస్తున్నామని, అవసరమైన మందులు ఆక్సిజన్ సరఫరా, రెమిడెసివర్ ఇంజక్షన్లు, ఇతర మాత్రలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, రెండు రోజుల్లో ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటుకు ధీటుగా పారిశుధ్య జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నెలాఖరు వరకు పూర్తిచేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.