మహ్మద్ రఫీ వేములవాడ
సిరిసిల్ల: విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందేందుకు వెళ్లే వారు ఎవరైనా భారత ప్రభుత్వం ద్వారా లైసెన్స్ కలిగిన ఏజెన్సీల ద్వారానే వీసా పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఏఆర్‌ఆర్ మ్యాన్‌పవర్ కన్సల్టెంట్ మేనేజర్ మహ్మద్ రఫీ చెప్పారు. దేశ వ్యాప్తంగా 1419, తెలంగాణ రాష్ట్రంలో 64 లైసెన్స్‌డ్ ఏజెన్సీలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరుగుతున్న మోసాల నేపథ్యంలో.. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళ్లే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ విజిట్ వీసాలపై వెళ్లవద్దు. ఈ మధ్య కాలంలో విజిటింగ్ కం, ఎంప్లాయ్‌మెంట్ అంటూ కొందరు మోసం చేస్తున్నారు. విజిట్ వీసా ఖరీదు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు, విమాన టిక్కెట్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. కానీ గ్రామీణుల వద్ద రూ.50వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. గల్ఫ్‌కు వెళ్లాక అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం. దీని మూలంగా గల్ఫ్‌కు వెళ్లే వ్యక్తికి భారత ప్రభుత్వం కల్పించే ప్రవాసీ భారతీయ బీమా యోజన(పీబీబీవై) వర్తించకుండా పోతుంది. అక్కడ జరిగే ఇంటర్వ్యూల మూలంగా కొందరికి ఎంప్లాయ్‌మెంట్ లభిస్తుండగా.. చాలా మందికి కంపెనీ వీసాలు లభించక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. తెలంగాణ నుంచి నెలకు 200 నుంచి 300 మంది విజిటింగ్ కం ఎంప్లాయ్‌మెంట్ వీసాలపై వెళ్తున్నట్లు సమాచారం. కంపెనీ వీసా పొందితే.. పని గంటలు, జీతం, ఇతర సదుపాయాలు ముందే చెబుతారు. నచ్చితేనే వెళ్లవచ్చు. వీసాకు ఇంత చెల్లించాలని నిర్ధిష్టంగా ఉంటుంది. ఇమిగ్రేషన్ ద్వారా రక్షణ లభిస్తుంది. బీమా సదుపాయాలు ఉంటాయి.
వీసాలు వెబ్‌సైట్‌లో ఉండవు..
ఎయిర్‌పోర్టులో క్లీనింగ్, పెట్రోల్ బంక్‌లో పని, హాస్పిటల్‌లో, హోటల్‌లో పని అని.. జీతం రూ.30వేలు రూ.50 వేలు అంటూ.. ఊరు పేరు లేని వారు వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు. దీన్ని నమ్మవద్దు. వీసాలు ఎప్పుడూ వెబ్‌సైట్‌లో ఉండవు. గ్రామీణులను నమ్మించేందుకు ఇలాంటి మోసాలు చేస్తారు. లైసెన్స్ ఉన్న ఏజన్సీల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి. లైసెన్స్ కలిగిన ఏజన్సీలు చాలా ఉన్నాయి. వారి ద్వారానే వీసా పొందితే రక్షణ ఉంటుంది. మోసాలకు ఆస్కారం ఉండదు. వీసాల సమాచారం హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పీవోఈ) ఆఫీస్‌లో లభిస్తుంది. వీసా నకిలీదా.. అసలైనదా.. అక్కడ తెలుసుకోవచ్చు. ఏదైనా ఒక్క పనిలో నైపుణ్యం సంపాదించి గల్ఫ్ దేశాలకు వెళ్తే మెరుగైన ఉపాధి ఉంటుంది. ఏ దేశం వెళ్తున్నామో.. ఆ దేశంలోని చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.
గల్ఫ్ ఏజంట్లను నిలదీయాలి
కోరుట్ల: అధిక లాభాల కోసం అడ్డదారిలో కార్మికులను దేశం దాటిస్తున్న గల్ఫ్ ఏజంట్లను నిలదీయాలి. విజిట్ కం ఎంప్లాయ్‌మెంట్ పద్ధతిలో కార్మికులను అక్రమంగా తరలిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే కార్మికులకు ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి. ఈ పాలసీని ఈ–మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు చేసుకుని క్లియరెన్స్ పొందాలి. ఈ బీమా పాలసీతో రూ.10లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కార్మికులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏజంట్లు అక్రమ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి గల్ఫ్‌కు పంపుతున్నారు. ముంబాయి ఏజంట్ల ద్వారా స్కైప్ పద్ధతిన రహస్య ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను పోలీసులు అడ్డుకోవాలి. ఎమిగ్రేషన్ చట్టంపై పోలీసులకు సరైన అవగాహన లేకపోవడంతో గల్ఫ్ ఏజంట్ల మోసాలు కొనసాగుతున్నాయి. కార్మికులు వలస వెళ్లే సమయంలో సాయం, సలహాలు కావాలన్నా 9866853116 నంబర్‌కు, ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబరు 1800113090కు కాల్ చేయవచ్చు.
ఏజెంట్లపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు
గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా వారి పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి కేసులు నమోదు చేస్తారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు ముందుగా వీసాలపై అవగాహన పెంచుకోవాలి. లైసెన్స్ కలిగిన ఏజెంట్ల ద్వారానే వీసా పొందాలి. సబ్ ఏజెంట్లు, గుర్తింపు లేని ఏజెంట్లను నమ్మవద్దు. ముందుగా అన్నీ నిర్ధారించుకోకుండా.. ఎవరికీ డబ్బులు కట్టవద్దు. పాస్‌పోర్టు ఇవ్వద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంతో పోలిస్తే గల్ఫ్ మోసాలు తగ్గాయి. గల్ఫ్ బాధితుల కోసం జిల్లా కేంద్రంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment