విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కుమారి, అప్పలకొండ తదితరలు
పెద్దాపురం: పొట్టకూటి కోసం స్వగ్రామాన్ని, అయిన వారిని వదులుకుని గల్ఫ్ దేశానికి వలస వెళ్లి అక్కడ ఏజంట్ చేతిలో చిత్రహింసలకు గురై నరకయాతన అనుభవిస్తున్న మహిళ మానవ హక్కుల సంఘం చొరవతో జిల్లాకు చేరింది. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన గోలి కుమారి ఆరు నెలల క్రితం కుటుంబ పోషణ కోసం భర్త, ఇరువురు కుమార్తెలను వదిలి మస్కట్ వెళ్లింది. పని కుదర్చుకున్న ఇంటి వద్ద అనారోగ్యంతో ఉండడంతో ఎవరైతే తీసుకువెళ్లారో ఆ కంపెనీకి కుమారిని పంపించేశారు. దీంతో ఒప్పందం ప్రకారం మస్కట్‌కు చెందిన వీసా కంపెనీ వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి కంపెనీ ఏజెంట్ నక్కా సీతా ఆమెను చిత్ర హింసలకు గురి చేస్తోంది. విషయాన్ని తన భర్త రత్నరాజుకు చెప్పడంతో ఆయన తన భార్యను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండను ఆశ్రయించారు.
ఆయన ఇండియన్ ఎంబసీ అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అక్కడి అధికారులు కుమారిని స్వగ్రామం పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయడంతో బుధవారం కుమారి స్వగ్రామం కట్టమూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా తను స్వగ్రామానికి రావడానికి కృషి చేసిన నూతలపాటి అప్పలకొండతో కలసి విలేకర్ల సమావేశంలో తన కష్టాలను వివరించి కన్నీటి పర్యంతమైంది. సుమారు 15 మంది మహిళలు అక్కడ సీత అనే మహిళ వేధింపులకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి తనలా ఇబ్బందులకు గురవుతున్న వారిని స్వగ్రామానికి తీసుకురావాలని ఆమె కోరింది. అప్పలకొండ మాట్లాడుతూ గల్ఫ్ వంటి దేశాల్లో వేధింపులకు గురవుతున్న పలువురు మహిళలను తమ సంఘం తరఫున నుంచి స్వగ్రామాలకు తీసుకువస్తున్నామన్నారు. దీనికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి, ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జుత్తుక అప్పారావు., కుంచే నానీబాబు, వల్లీభాషాతో కుమారి కుటుంబ సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment