ఎడారి దేశాల్లోపూల జాతర | Bathukamma Celebrations in UAE | Sakshi
Sakshi News home page

ఎడారి దేశాల్లోపూల జాతర

Published Fri, Oct 4 2019 8:29 AM | Last Updated on Fri, Oct 4 2019 8:29 AM

Bathukamma Celebrations in UAE - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో... నా నోము పండింది ఉయ్యాలో... నీ నోము పండిందా ఉయ్యాలో... మా వారు వచ్చిరి ఉయ్యాలో... మీ వారు వచ్చిరా ఉయ్యాలో... అంటూ గల్ఫ్‌ గడ్డపై తెలంగాణ ఆడపడుచులు మన సంస్కృతిని చాటుతున్నారు. బతుకమ్మ పండుగను ప్రతి ఏటా గల్ఫ్‌ దేశాల్లో ఎంతో వైభంగా నిర్వహిస్తున్నారు. ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసులు అక్కడ కూడా మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఎడారి దేశాల్లో బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రవాసీ సంఘాలు ఏర్పాట్లు చేశాయి. సాధారణంగా తెలంగాణలో పితృ అమావాస్యతో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే, గల్ఫ్‌ దేశాల్లో మాత్రం మన వాళ్లు ఒక రోజును ఎంపిక చేసుకుని ఆ రోజు బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకొంటారు. ఈసారి దాదాపు అన్ని గల్ఫ్‌ దేశాల్లో 4వ తేదీన (శుక్రవారం) నిర్వహిస్తున్నారు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని దుబాయి, అబుదాబీలలో గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహిస్తున్నారు. షార్జాలో ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరుపుతున్నారు. ఖతార్‌లో తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి సంస్థలు వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. కువైట్‌లో తెలంగాణ చైతన్య స్రవంతి, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. గతంలో కువైట్‌ తెలంగాణ సమితి కూడా సంబరాలను నిర్వహించింది. బహ్రెయిన్‌లో తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్, తెలంగాణ జాగృతి సంస్థలు విడివిడిగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నాయి. ఒమాన్‌లోని మస్కట్‌లో ఒమాన్‌ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో సంబరాలను కొనసాగిస్తున్నారు. అలాగే ఇండియన్‌ సోషియల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలోనూ సోహార్‌ ప్రాంతంలో తెలుగు కమ్యునిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు.

ఐదేళ్లుగా నిర్వహిస్తున్నాం
ఒమాన్‌ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో మ స్కట్‌లో ఐదేళ్ల నుంచి బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నాం. గతేడాది ఐదు వేల మంది పాల్గొన్నారు.  విదేశాల్లో ఉన్నా మన సంస్కృతిని మరిచిపోకూడదు. సంబరాల కోసం పది రోజుల ముందు నుంచి రిహార్సల్స్‌ కూడా చేశాం. బతుకమ్మ  రోజు న అందరికీ ప్రసాదాలు అందిస్తాం.    – పన్నీరు వసుంధరా దేవి, ఒమాన్‌  (జగిత్యాల జిల్లా)

విదేశాల్లో జరుపుకోవడం సంతోషంగా ఉంది
మేము కొన్నేళ్ల నుంచి కువైట్‌లో నివాసం ఉంటున్నాం. విదేశంలో కూడా బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కువైట్‌లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ వాసులే కాకుండా మన దేశంలోని ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు కూడా పాల్గొనడం విశేషం.– అనిత గార్లపాటి,కువైట్‌ (మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా)

బతుకమ్మను మరువలేం...
పుట్టిన ఊరుకు  ఉన్నా ప్రతి ఏటా బతుకమ్మ పండుగ జరుపుకొంటున్నాం. మేము మస్కట్‌లో పదేళ్ల నుంచి ఉం టున్నాం. మొదట రెండు, మూడు కుటుంబాలే బతుకమ్మను నిర్వహించేవి. ఇప్పుడు వేలాది మంది ఈ ఉత్సవాలకు హాజరవుతుండటం విశేషం. చిన్నారులకు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడానికి బతుకమ్మ పండుగ ఎంతో దోహదపడుతుంది.– శానగొండ పద్మజ, మస్కట్‌ (వరంగల్‌ జిల్లా)

సంబరాల కోసం ఎదురుచూస్తుంటాం..
సంవత్సరానికి ఒకసారి నిర్వహించే బతుకమ్మ సంబరాల కోసం దోహా లోని తెలంగాణ ప్రాం తానికి చెందిన వారందరం ఎదురుచూస్తుం టాం. సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటాం. విదేశంలోనూ మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం హర్షించదగ్గ విషయం.– మారుతి వేలూర్, దోహా,ఖతార్‌ (హైదరాబాద్‌)

వేడుకల్లో..అందరూ పాల్గొంటారు
ఖతార్‌లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ ప్రాంతం వారంతా ఎంతో సంతోషంగా పా ల్గొంటారు. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ నిర్వహణ తేదీని నిర్ణయిస్తాం. పెద్దా, చిన్న తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. బతుకమ్మకు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తాం.  – అనుపమ సంగిశెట్టి, ఖతార్‌ (జనగామ జిల్లా)

తెలంగాణ ఉద్యమంతోమొదలైన సంబరాలు
కువైట్‌లో చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నాం. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కువైట్‌తో పాటు ఇతర గల్ఫ్‌ దేశాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో బతుకమ్మను ఎలా నిర్వహిస్తారో.. అదే తీరుగా కువైట్‌లోనూ నిర్వహిస్తున్నాం. నేను పలుమార్లు బతుకమ్మ పండుగ నిర్వహణకు ఆర్గనైజర్‌గా వ్యవహరించాను.– అభిలాష గొడిషాల, కువైట్‌ (వరంగల్‌ జిల్లా)

దశాబ్ద కాలంగా జరుపుకొంటున్నాం..
దశాబ్ద కాలంగా దుబాయిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. పుట్టి పెరిగిన ఊరికి దూరంగా ఉంటున్నా మన సంస్కృతిని మరిచిపోకుండా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ఆడబిడ్డల పండుగను ఇక్కడ ఆత్మీయుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. 12వ సారి ఇప్పుడు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం.– ఎలిశెట్టి శ్రీదేవి, మంథని.

మన పండుగను మర్చిపోకుండా...
మాది జగిత్యాల జిల్లా ధర్మపురి. దుబాయిలో స్థిరపడ్డాం. మన పండుగలను మర్చిపోకుండా మా పిల్లలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా బతుకమ్మ పండుగను జరుపుకొంటున్నాం. తెలంగాణ ఆడపడుచులంతా ఒక్క చోట చేరి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుంది.   – దీపిక, ధర్మపురి

సొంత ఊరిలో ఉన్నట్లుంది..
అబుదాబీలో ఉంటున్నా.. ఏటా బతుకమ్మ వేడుకలు జరుపుకొంటున్నాం. దీంతో సొంత ఊరిలోనే ఉన్నట్లనిపిస్తోంది. దేశం కాని దేశం వచ్చినా సంప్రదాయాలను మరువలేం. బతుకమ్మ నిర్వహించే రోజున అందరం ఎంతో ఉత్సాహంగా ముస్తాబై బతుకమ్మలను పేర్చుతాం. అందరం ఒకే చోటకు చేరి ఆడిపాడుతాం. తెలంగాణ పల్లెల్లో బతుకమ్మకు నైవేద్యం పెట్టినట్లుగానే ఇక్కడా చేస్తున్నాం.– రోజా, అబుదాబీ (ఆర్మూర్, నిజామాబాద్‌)

ఎక్కడ ఉన్నా మరచిపోం..
ఏ దేశంలో ఉన్నా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక గా నిలిచిన బతుకమ్మను మరచిపోం. బతుకమ్మ పండు గను అందరూ ఎంతో సంబరంగా జరు పుకొంటున్నారు. అబుదాబీలో ఇందుకోసం ఏటా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ గల్ఫ్‌ దేశంలోనే కాకుండా ఇతర పాశ్చాత్య దేశాల్లోను బతుకమ్మను సంబరంగా జరుపుకొంటున్నారు.– లత, అబుదాబీ(పడగల్, వేల్పూర్‌ మండలం, నిజామాబాద్‌)

ఊర్లో ఆడినట్టే...
మన ఊర్లో ఆడినట్టే ఇక్కడ కూడా బతుకమ్మ ఆడుతాం. దోహాలో ఉన్న తెలంగాణ మహిళలమంతా కలుస్తాం. బతుకమ్మ పేర్చేందుకు ఇండియన్‌ సూపర్‌ మార్కెట్లలో రకరకాల పూలు అందుబాటులో ఉంటాయి. వాటిని కొనుగోలు చేస్తాం. ఏటా జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతాయి.  – గట్టుపల్లి వాసవి,సిలాల్, దోహ (నల్లగొండ జిల్లా)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement