యోగా దినోత్సవం సందర్భంగా ఒమాన్‌లో నరేంద్ర పన్నీరు, ఆయన మిత్రబందం నరేంద్ర పన్నీరు
గల్ఫ్ డెస్క్: ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూనే సేవా రంగంలోనూ రాణిస్తున్నారు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన నరేంద్ర పన్నీరు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన తండ్రి ఎల్లయ్య బాటలోనే గల్ఫ్‌కు పయనమయ్యాడు. గల్ఫ్ దేశాల్లో టెలికం రంగం ప్రైవేటీకరణ ఆరంభమైన మొదట్లోనే సర్వీస్ ప్రొవైడర్‌గా సబ్ కాంట్రాక్టును దక్కించుకున్న ఎల్లయ్య తక్కువ సమయంలోనే ఖతార్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. టెలికం రంగంలో ఉపాధి పొందడానికి గల్ఫ్ దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ఎల్లయ్య తన కుమారునికి అదే రంగంలో శిక్షణ ఇప్పించి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దారు.
ఖతార్ మంత్రితో తండ్రికి స్నేహం..
నరేందర్ తండ్రి ఎల్లయ్య ఉపాధి కోసం ఖతార్‌కు 1980లో వెళ్లాడు. అక్కడ ఆయన వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. బట్టలు కుట్టి అమ్ముతున్న ఎల్లయ్య వద్దకు అప్పట్లో ఖతార్ సమాచార శాఖ మంత్రి వచ్చి వెళ్లేవారు. 1984లో ఖతర్ టెలికం రంగాన్ని ప్రైవేటీకరించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో సర్వీస్ ప్రొవైడర్(కాంట్రాక్టర్)ల సేవలు అవసరం అయ్యాయి. మంత్రి ప్రోత్సాహంతో ఎల్లయ్య కొత్తగా టెలికం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆయన 2010 వరకు ఖతార్‌లో టెలికం వ్యాపారాన్ని కొనసాగించారు.
ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం..
ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫైబర్ టెక్నాలజీని పూర్తిచేసిన నరేంద్ర మొదట ఉపాధి కోసం టెలికం రంగంలో పనిచేశారు. అయితే ఇక్కడ టెలికం రంగంలో పనిచేస్తే వేతనాలు తక్కువగా ఉండటంతో నరేందర్ ఖతార్‌లో ఉన్న తండ్రి వద్దకు 2002లో వెళ్లారు. తండ్రికి సొంతంగా వ్యాపారం ఉన్నా నరేందర్ మాత్రం ఖతార్‌లోని ఒరిడో అనే టెలికం కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. 2012లో స్వదేశానికి తిరిగివచ్చిన నరేందర్.. ఖతార్ కంటే ఒమాన్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయని గుర్తించి 2013లో ఒమాన్‌కు వెళ్లి అక్కడ టెలికం వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నరేందర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఒమాన్‌లోని అల్ కువైర్ పట్టణంలో టెలికం వ్యాపారాన్ని నిర్వహిస్తూ కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు.
సేవా కార్యక్రమాలు..
నరేంద్ర ఒమాన్‌లో వ్యాపారం నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి చేయూతనందిస్తున్నారు. ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే సంస్థను ఆరంభించి ఆ సంస్థ ద్వారా ఖల్లివెల్లి కార్మికులకు స్వదేశానికి వెళ్లడానికి టిక్కెట్‌లను సమకూర్చడం, ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి పంపించడం, కంపెనీ యజమానుల చేతుల్లో మోసపోయిన వారికి న్యాయ సహాయం అందించడం తదితర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఒమాన్‌లోని అధికారులతో ఉన్న సంబంధాలతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకు సహాయ సహకారాలను నరేంద్ర అందిస్తున్నారు.
కళలు, సాహస క్రీడలు..
ఒక వైపు వ్యాపారం, మరో వైపు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న నరేందర్ సమయం చిక్కినప్పుడు కళలు, సాహస క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ జానపద గాయకుడైన నరేంద్ర ఉత్సాహవంతులైన వారిని గుర్తించి వారిని మంచి గాయకులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ జానపద గీతాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున, ఉగాది పర్వదినం సందర్భంగా ఆలపించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబరాలను, అంతర్జాతీయ యోగా దినోత్సవాలను కూడా ఒమాన్‌లో నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కళల పట్ల ఎంత మక్కువ చూపుతున్నాడో.. సాహస క్రీడల పట్ల అంతే ఆసక్తిని కనబరుస్తున్నారు. స్విమ్మింగ్‌తో పాటు పారాగ్లైడింగ్ లాంటి సాహస క్రీడలో నరేందర్ ప్రత్యేకతే వేరు. పారాగ్లైడింగ్‌లో కమర్షియల్ లైసెన్స్ పొంది ఇటీవలే 3,700 ఫీట్ల ఎత్తు నుంచి దూకి తన సాహసాన్ని చాటాడు.
నాన్నే గురువు
ఒమాన్‌లో సొంతంగా టెలికం వ్యాపారం నిర్వహించడానికి నాకు మా నాన్నే మార్గదర్శి. నాన్న చెప్పినట్లు టెలికం రంగాన్ని ఎంచుకున్నా. సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా స్ఫూర్తి మా నాన్ననే. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మన సహాయం కోసం ఎదురు చూసేవారికి కచ్చితంగా తోడుగా ఉండాలని నాన్న ఎప్పుడు చెబుతుండేవారు. అందువల్లే సేవా కార్యక్రమాలను బాధ్యతగా కొనసాగిస్తున్నా.– నరేంద్ర పన్నీరు
Comments
Please login to add a commentAdd a comment