టెక్నికల్ లేబర్ కే భవిష్యత్ | special story on gulf workers | Sakshi
Sakshi News home page

టెక్నికల్ లేబర్ కే భవిష్యత్

Published Sat, Dec 30 2017 10:46 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

special story on gulf workers - Sakshi

దుబాయ్‌లోని ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీచర కిరణ్‌కుమార్‌

గల్ఫ్‌ దేశాలకు టెక్నికల్‌ లేబర్‌గా వస్తేనే బాగుంటుందని, మంచి జీతంతో పాటు రక్షణ ఉంటుందని దుబాయ్‌లోని ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీచర కిరణ్‌కుమార్‌ చెప్పారు. కామన్‌ లేబర్‌గా వస్తే జీతం తక్కువగా వస్తుందని, కష్టాలు కూడా ఎక్కువేనని అన్నారు. గల్ఫ్‌లో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- సాక్షిఇంటర్వ్యూ

పెద్దపల్లి: మన దగ్గర యువత పదో తరగతి, ఇంటర్‌ వరకు మాత్రమే చదువుకుని గల్ఫ్‌ బాట పడుతున్నారు. పాస్‌పోర్టు  తీసి ఏజెంటుకు ఇస్తారు. కొంత అడ్వాన్స్‌ కూడా ఇస్తారు. అప్పటి నుంచి వారికి టెన్షన్‌ మొదలవుతుంది. రోజూ ఏజెంట్‌ చుట్టూ తిరుగుతుంటారు.   పని వెతికే పనిలో ఏజెంటు ఉండగానే.. రోజులు గడుస్తున్నాయంటూ ఒత్తిడి చేస్తుంటారు. వారి ఒత్తిడి తట్టుకోలేక ఏజెంట్లు మూడు నెలల విజిట్‌ వీసా, ఎంప్లాయ్‌మెంట్‌ వీసా తీసి పుషింగ్‌ (అక్రమంగా దేశం దాటించడం)లో పంపిస్తున్నారు. అందులో ప్రొఫెషన్‌ మార్చి పంపుతున్నారు. గల్ఫ్‌కు తీసుకువచ్చి గదిలో వేసి మీరే పని చేసుకోవాలని ఏజెంట్లు చెప్తున్నారు. మూడు నెలల్లో ఏదో ఒక పనిచేసుకుంటారు. ఇంత ఖర్చు చేసి వచ్చాను.. ఉత్త చేతులతో తిరిగి ఎలా వెళ్లేదంటూ అక్కడే ఉంటారు.

అతనికి ఆ దేశ ‘గుర్తింపు’ ఉండదు కాబట్టి అక్రమ నివాసి అవుతాడు. దీంతో అతను పోలీసులకు దొరికినప్పుడు జైళ్లలో వేస్తారు. గల్ఫ్‌పై ఎన్నో ఆశలతో వచ్చిన వారు.. ఇక్కడి చట్టాలు తెలియక కష్టాలపాలవుతున్నారు. రిక్రూటింగ్‌ ఏజెంట్‌ అతను ఏ దేశం వెళ్తున్నాడో.. అక్కడి కంపెనీకి చెందిన అన్ని వివరాలు చెప్పాలి. జీతం, అక్కడ ఉండాల్సిన కాలం అన్నీ అగ్రిమెంట్‌లో ఉండేవిధంగా గల్ఫ్‌కు వచ్చే వారు చూసుకోవాలి. రిజిష్టర్డ్‌ ఏజెన్సీల నుంచి వెళితే ఏదైనా జరిగినప్పుడు కంపెనీని అడుగవచ్చు. కామన్‌ లేబర్‌గా గల్ఫ్‌ దేశాలకు రావడం దండగ. దుబాయ్‌లో అయితే కామన్‌ లేబర్‌కు 1000 దరమ్‌లే వస్తాయి. అందులో 300 దరమ్‌లు ఖర్చులకు పోతాయి. ఇక్కడికి రావడానికి రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఖర్చవుతాయి. వీసా అప్పు తీరడానికి ఒక సంవత్సరానికి పైగా పడుతుంది. టెక్నికల్‌ లేబర్‌గా వస్తే జీతం కూడా బాగుంటుంది.  

అవగాహన కల్పించాలి..
గల్ఫ్‌కు వెళ్లే వారికి అవగాహన శిబిరాలు నిర్వహించాలి. గల్ఫ్‌లో ఉన్న అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన చేసి యువతకు తెలియజేయాలి. గల్ఫ్‌లో అనుభవమున్న వారితో శిక్షణ ఇప్పించాలి.  కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్, ఏపీ, తెలంగాణ నుంచి కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కేరళలో ఇలాంటి శిక్షణలు నిర్వహిస్తారు. గల్ఫ్‌లో చిన్నచిన్న వ్యాపారాల్లో ఎక్కువగా కేరళ వారే ఉన్నారు. 
– గల్ఫ్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement