గల్ఫ్‌కు వెళ్లే ముందు.. | Awareness And Training For Gulf Labourers And Employees | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌కు వెళ్లే ముందు..

Published Fri, Aug 23 2019 7:04 AM | Last Updated on Fri, Aug 23 2019 7:04 AM

Awareness And Training For Gulf Labourers And Employees - Sakshi

వలస కార్మికులకు అవగాహన కల్పిస్తున్న ట్రైనర్‌

గల్ఫ్‌ డెస్క్‌: ప్రవాసీ కౌశల్‌ వికాస్‌ యోజన పథకంలో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అరబ్‌ గల్ఫ్‌ దేశాలు, మలేషియా తదితర 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లో తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టాంకాం) కార్యాలయంలోని శిక్షణ కేంద్రంలో ఒకరోజు శిక్షణ ఇస్తున్నారు. 18 ఇసీఆర్‌ (ఎమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ రిక్వైర్డ్‌ – విదేశీ ఉద్యోగానికి వెళ్లడానికి అనుమతి అవసరమైన) దేశాలకు ఉద్యోగానికి వెళ్లదలచిన వారి కోసం భారత ప్రభుత్వం ఒక రోజు ఉచిత పీడీఓటీ (ప్రీ డిపార్చర్‌ ఓరియెంటేషన్‌ ట్రైనింగ్‌) సదుపాయం కల్పిస్తోంది.

సురక్షితమైన, చట్టబద్ధమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు ఆయా దేశాల సం స్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనల గురించి వలస వెళ్లే కార్మికులకు అవగాహన కల్పించడం ఈ శిక్షణ ఉద్దేశం. రిక్రూట్‌మెంట్‌ నుంచి గల్ఫ్‌లో ఉద్యోగంలో చేరేంత వరకు వివిధ దశల్లో ఎలా మెలగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శిక్షకులు కార్మికులకు వివరిస్తారు. గల్ఫ్‌ దేశాల్లో చట్టాలు, వాటిని అతిక్రమిస్తే అక్కడి శిక్షలను కూడా తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ఏ రంగంలో పనిచేస్తే ఎంత జీతం వస్తుంది, దానిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేసిన డబ్బును కుటుంబ సభ్యులకు ఎలా చేరవేయాలి తదితర విషయలను వివరిస్తున్నారు. నాటకం, పాటల ద్వారా శిక్షకులతో బోధన అందిస్తున్నారు. ప్రతీ వారం హైదరాబాద్‌లో ఈ శిక్షణ ఇస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్‌లో కూడా అవసరాన్ని బట్టి క్లాసులు నిర్వహిస్తున్నారు.

18 ఇసీఆర్‌ దేశాలు ఇవీ..
ఎమిగ్రేషన్‌ యాక్టు–1983 ప్రకారం 18 దేశాలను ఈసీఆర్‌ కేటగిరీ దేశాలుగా గుర్తించారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్, యూఏఈ, ఆఫ్గనిస్తాన్, ఇరాక్,జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, నార్త్‌ సుడాన్,సౌత్‌ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌.

శిక్షణ ఎంతో అవసరం..
గల్ఫ్‌ దేశాలకు పని కోసం వెళ్లే వారికి శిక్షణ ఎంతో అవసరం. ముఖ్యంగా దళారుల చేతుల్లో పడి మోసపోకుండా.. ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీల ద్వారా వెళ్తేనే ప్రయోజనం ఉంటుంది. శిక్షణలో ప్రతి విషయాన్ని వివరిస్తాం. ఎలా వెళ్లాలి, ఆ దేశాల్లో ఎలా మసలుకోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం.     – మహ్మద్‌ బషీర్‌ అహ్మద్, ట్రైనర్‌     

జిల్లాల్లో శిక్షణ ఇవ్వాలి
ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో పీడీఓటీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లోనే శిక్షణ ఇవ్వాలి. ప్రైవేటు స్కిల్‌ టెస్టింగ్‌ సెంటర్లను కూడా ఇందుకు వినియోగించుకోవచ్చు. రిక్రూటింగ్‌ ఏజెన్సీల అసోసియేషన్‌ లను ఇందులో భాగస్వాములను చేయాలి. పీడీఓటీ శిక్షణను తప్పనిసరి చేస్తే ఈ పథకం ఉద్దేశం నెరవేరుతుంది. అవగాహనే అన్ని సమస్యలకు పరిష్కారం. – చౌటుపల్లి శ్రీను, ఎస్‌ఎల్‌ ఇంటర్నేషనల్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీ, మెట్‌పల్లి  
 
బతుకుదెరువు కోసం బహ్రెయిన్‌ వెళ్తున్నా..
నేను ఐదవ తరగతి వరకు చదువుకున్నా. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం బహ్రెయిన్‌ వెళ్తున్నా. అక్కడ కూలి పని చేయడానికి వీసా లభించింది. జీతం అక్కడి కరెన్సీలో 105 దినార్లు ఇస్తామన్నారు. మూడేళ్లు పనిచేసి మళ్లీ స్వదేశానికి వస్తా.– సుదర్శన్, నిజామాబాద్‌

విదేశాల్లో ఎలా నడుచుకోవాలో చెప్పారు
దేశంకాని దేశం వెళ్తున్నాం. అక్కడి భాష రాదు. ఆ దేశంలో ఎలా నడుచుకోవాలో మాకు శిక్షణలో వివరించారు. గల్ఫ్‌ దేశాల్లోని నియమ, నిబంధనలను వివరించారు. ఈ శిక్షణ నాకెంతో దోహదపడుతుందని భావిస్తున్నా.  – యు.శ్రీనివాస్, జన్నారం    

జాగ్రత్తలు తెలుసుకున్నాం..
ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి విదేశంలో కాలుమోపే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను శిక్షణలో తెలుసుకున్నాం. పాస్‌పోర్టు, వీసా వంటి విలువైన ధ్రువీకరణ పత్రాలు పోగొట్టుకుంటే ఎవరిని సంప్రదించాలి. మన దగ్గర ఉంచుకోవాల్సిన ఫోన్‌ నంబర్లు ఏమిటి.? రాయబార కార్యాలయంచిరునామా వంటి ప్రాథమిక సమాచారం గురించి బాగా విశ్లేషించారు. టామ్‌కామ్‌ అధికారులు ఇచ్చిన శిక్షణ మాకెంతో మేలు చేస్తుంది.     – రవి, సిద్దిపేట
 
ఇప్పటి వరకు 176 మందికి శిక్షణ ఇచ్చాం..
మే నెల నుంచి ఇప్పటి వరకు 176 మందికి శిక్షణ ఇచ్చాం. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి శిక్షణ ఇస్తున్నాం. ఏపీ, తెలంగాణతో పాటుగా ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువత శిక్షణకు వచ్చారు. నైపుణ్యంతో పాటు మెళకువలు నేర్పిస్తున్నాం. ఒక్కో బ్యాచ్‌లో కనీసం పది మంది ఉండేలా చూసుకుని శిక్షణ ఇస్తున్నాం.– నాగ భారతి, జనరల్‌ మేనేజర్, టాంకాం

పీడీఓటీ శిక్షణ పొందాలనుకునే వారు‘టాంకాం’ మొబైల్‌ నం. 7997973358,ఫోన్‌ నం. 04023342040, ఇ–మెయిల్‌: tomcom.gmts@gmail.com లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement