ఈమె పేరు పార్వతమ్మ. గాలివీడు మండలం రెడ్డివారిపల్లె. కుటుంబ జీవనాధారం కోసం కువైట్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లాక ఈమెకు తిప్పలు తప్పలేదు. కనీసం షేట్‌లు ఇంటికి ఫోన్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు. మూడేళ్ల క్రితం వెళ్లిన ఆమె ఒకట్రెండు సార్లు మాత్రమే ఫోన్ చేసింది. అక్కడ పెట్టిన ఇబ్బందులు అన్ని.. ఇన్నీ కావు. కుటుంబ పోషణ కోసం అక్కడికి వెళ్లిన పార్వతమ్మ అక్కడి కష్టాలు భరించలేక ఇంటికి వచ్చేందుకు ఆస్కారం లేక నరకయాతన అనుభవించింది. వారం రోజుల క్రితం ఆమె ఇంటికి చేరింది.
సాక్షి కడప : జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వేళ్లే వారికి అడుగడుగునా గండాలు తప్పడం లేదు. ఎన్నో ఆశలతో అక్కడికి వెళితే చిత్ర హింసలు, వేధింపులు, చీదరింపులు, బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది కాదు.. అది కాదని చెప్పడానికి దేశం కానీ దేశం. భాష, యాస, కట్టుబాట్లు అన్ని మారుతాయి. అక్కడ చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదు. షేట్‌లు చెప్పిందే వేదం.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి జీతం పంపలేక.. అక్కడి పరిస్థితులు ఇక్కడి వారికి చెప్పే అవకాశం లేక వెళ్లిన వలస జీవులు పడుతున్న వేదన వర్ణణాతీతం. వీసా కోసం భారీగా ఖర్చు చేసుకుని ఇక్కడి ఏజెంట్ల ద్వారా వెళుతున్నా..మధ్యలో ఏమి జరుగుతుందో తెలియక అవస్థలు పడుతున్నారు.
చెప్పేదొకటి.. చేసేదొకటి..
జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బద్వేల్ తదితర ప్రాంతాలనుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారు అధికంగా ఉన్నారు. పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం ప్రాంతాల్లో ఇతర దేశాలకు జీవనాధారం కోసం వెళ్లిన వారు తక్కువే. ఇక్కడ నుంచి వెళ్లే వారికి ఏజెంట్లు చెప్పే మాటలు వేరుగా ఉంటున్నాయి. ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి పంపిస్తే అంతో.. ఇంతో వస్తుందని అవతలి వారి సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు. తమ ఆదాయం కోసం ‘ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు’చెప్పి సరిహద్దులు దాటిస్తున్నారు. ఇంట్లో పని. తోట పని, డ్రైవర్, గొర్రెల కాపరి, ఫ్యాక్టరీలో ఉద్యోగాలంటూ అక్కడికి పంపుతున్నా.. అక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏజెంట్ల మోసాన్ని బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోయేవారు కొందరైతే..తప్పని పరిస్థితిలో మళ్లీ స్వదేశానికి రావడం కోసం కష్టాలు ఎదుర్కొంటూ అడుగు ముందుకేస్తున్నారు. ఏజెంట్ల చేతిలో దెబ్బతిన్న చాలామంది బాధితులు ఇప్పటికి మన కళ్లముందే కనిపిస్తున్నారు.
జిల్లాలో పేదలను టార్గెట్ చేసుకుని వల విసురుతున్నారు. రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేల్, రాయచోటి నియోజకవర్గాలలోని పల్లె సీమలలో నిరుపేదలను ఎంచుకుంటున్నారు. కుటుంబ పరిస్థితులు బాగలేక.. ఆర్థికంగా ఎదగాలంటే అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు వెళితే ఎంతో కొంత వెనుకేసుకోవచ్చున్న ఆశ కల్పించి ఏజెంట్లు వల విసురుతున్నారు. వారి ఆశలకు రూపం ఇస్తే ఫర్వాలేదు కానీ.. ఇక్కడి నుంచి పంపితే చాలు.. అక్కడ ఎలా ఉంటే మనకెందుకని వదిలేయటం ఏజెంట్లకు మంచిది కాదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉపాధి కల్పించని ప్రభుత్వాలు..
పట్టణ, పల్లెలు అనే తేడా లేకుండా బాగా చదువుకున్న వారు ఉన్నప్పటికీ అనుకున్న మేర ఉపాధి అవకాశాలు లభించడంలేదు. ఈ కారణంగా కూడా ఇతర దేశాలకు వెళితే ఎక్కువ సంపాదించవచ్చని చాలామంది సిద్ధపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గగనంగా మారుతున్నాయి. రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకోకపోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విదేశాలకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ
జీవనోపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏజెంట్ల మోసం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ గుర్తింపు కలిగిన వారి ద్వారా వెళ్లడం ఉత్తమం. అంతేకాకుండా పోలీసులకు కూడా జీవనోపాధి నిమిత్తం వెళుతున్న వారి వివరాలు తెలియజేయాలి. వెళ్లిన తర్వాత బాధపడటం కంటే ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచన చేయాలి. ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతూ ఇక్కడికి రాలేక నలిగిపోతున్న 72మందిని బంధం యాప్ ద్వారా రప్పించాం. మరికొంతమంది కోసం ప్రయత్నిస్తున్నాం. – బాబుజీ అట్టాడ, జిల్లా ఎస్పీ, కడప
Comments
Please login to add a commentAdd a comment