రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు
గల్ఫ్ డెస్క్: ‘వలస అనేది అభివృద్ధికి మార్గం కావాలి. విషాదం, జీవన విధ్వంసానికి ప్రతీక కాకూడదు. ప్రభుత్వాలు చట్టబద్ధమైన, సురక్షితమైన వలసలను ప్రోత్సహిస్తూ, అక్రమ వలసలను నిరోధించాలి’ అని పలు సంఘాల ప్రతినిధులు కోరారు. వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ఉపాధికి అవకాశం ఇచ్చే విదేశీ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ‘వలస కార్మికుల హక్కులు, సంక్షేమం – ప్రభుత్వాల బాధ్యత’ అంశంపై జాగో తెలంగాణ, ప్రవాసీ మిత్ర సంయుక్తంగా జగిత్యాల పట్టణంలో ఇటీవల నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు గల్ఫ్ కార్మికుల సమస్యలపై తమ వాణి వినిపించారు. వలసలు అత్యధికంగా ఉన్న ప్రాంతమైన జగిత్యాల జిల్లా కేంద్రాన్ని తొలిసారిగా రౌండ్ టేబుల్ సమావేశ నిర్వహణకు వేదికగా ఎంపిక చేయడం విశేషం.
వలసల నేపథ్యం మొదలుకుని ఎమిగ్రేషన్ యాక్టు, వలస కార్మికుల గణాంకాలు, ఖల్లివెల్లి కార్మికుల కష్టాలు, ఆమ్నెస్టీ(క్షమాభిక్ష) పథకం, కేరళ తరహా ప్రవాసీ విధానం, గల్ఫ్ దేశాల్లో వైద్య సదుపాయాలు అందకపోవడంతో ఆరోగ్యం క్షీణించడం, చనిపోయిన వారి మృతదేహాలను తరలింపులో జాప్యం.. తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం గల్ఫ్‌లో ఉన్న రైతులకు అందించడం, రూ.5లక్షల బీమా వర్తింప చేయడం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా వలస కార్మికులు కోరుతున్న ప్రవాసీ విధానం(ఎన్‌ఆర్‌ఐ పాలసీ) అమలు చేయాలని వక్తలు రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు వలస కార్మికుల ప్రయోజనాల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలో సూచించారు.
అన్ని పథకాల్లో గల్ఫ్ కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి
గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అన్ని సంక్షేమ పథకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఇవి అమలైతేనే వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. – టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
గల్ఫ్ కార్మికుల సంఖ్యను తేల్చాలి
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సంఖ్యను మొదట తేల్చాలి. ఇప్పటి వరకు వలస వెళ్లిన కార్మికులకు సంబంధించి నిర్ధిష్టమైన సంఖ్య లేదు. క్షేత్ర స్థాయిలో సర్వేను పకడ్బందీగా నిర్వహించి వలస కార్మికుల సంఖ్యను తేలిస్తే వారి కోసం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ పుల్లూరి సంపత్‌రావు, గల్ఫ్ వలసల పరిశోధకుడు
రూ.500 కోట్లు కేటాయించాలి
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా రూ.500 కోట్లు కేటాయించాలి. వలస కార్మికులు తమ శ్రమతో ఏటా విదేశీ మారకద్రవ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నారు. అందువల్ల వారి సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సంక్షేమ పథకాలను అమలు చేయాలి.– స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర కార్మిక యూనియన్ అధ్యక్షుడు
తెలంగాణ ప్రవాసీ విధానం అమలు చేయాలి
తెలంగాణ ప్రవాసీ విధానం(ఎన్‌ఆర్‌ఐ పాలసీ) వెంటనే అమలు చేయాలి. ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేస్తేనే వలస కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. ముసాయిదా రూపొందించినా ఇంత వరకు ప్రభుత్వం అమలు చేయలేదు. వెంటనే తెలంగాణ ప్రవాసీ విధానం అమలు చేసి కార్మికులకు మేలు చేకూర్చాలి. – గుల్లె రాజేశ్వర్, జడ్పీటీసీ సభ్యుడు, ఏర్గట్ల
మృతిచెందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వాలి
గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఎంతో మంది గల్ఫ్ మృతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అలాగే గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఏడాదిలోపు ఏ కారణం చేతనైనా మరణించిన వారికి కూడా ఎక్స్‌గ్రేషియా వర్తింపజేయాలి. – గుగ్గిళ్ల రవిగౌడ్, తెలంగాణ గల్ఫ్ ఉద్యమ సమితి కన్వీనర్
వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకూడదు
గల్ఫ్ వలస కార్మికుల పేర్లను రేషన్‌కార్డులలో కొనసాగించాలి. ఉపాధి కోసం వెళ్లిన వారి పేర్లు కార్డుల నుంచి తొలగించడం అన్యాయం. అలాగే గల్ఫ్ వలస కార్మికులు అందరికీ ఆరోగ్యశ్రీతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.– నరేష్‌రెడ్డి, జగిత్యాల జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు
జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు న్యాయ సహాయం అందించాలి
గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు న్యాయ సహాయం అందించాలి. కార్మికులు జైళ్ల నుంచి విడుదలై ఇంటికి చేరుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్ దేశాల నుంచి స్వగ్రామానికి చేరుకున్న కార్మికులకు పునరావాసం, పునరేకీకరణ కార్యక్రమాలను అమలు చేయాలి. కార్మికులు మానసికంగా కృంగిపోకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలి.– చుక్క గంగారెడ్డి, టీజేఎఫ్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment