సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామం
ఇంటి పనిలో నిమగ్నమై ఉన్న ఈ వృద్ధురాలి పేరు సానటి రాజవ్వ. ఆమె ఇద్దరు కొడుకులు ఎడారి దేశానికి వలసపోయారు. వాళ్లే కాదు.. గ్రామంలో ప్రతి యువకుడు అలాగే పోతున్నారని చెబుతోందామె. ‘ఇక్కడ చేసుకోనీకి పనిలేదు. అందరికీ దూరంగా పోయి దేశం కాని దేశంలో పొట్టనింపుకుంటున్నరు. అక్కడెన్ని రోజులున్నా సంపాదించేదేం లేదు. షేక్‌లు చెప్పిన పని చేయాలె. తెల్లవారుజామున 4 గంటలకు పనిలోకి వెళ్తే రాత్రి పది గంటలకు రూమ్‌కు పోతరంట’అని తన కొడుకుల వ్యథను చెప్పుకొచ్చింది. చెట్టంత కొడుకులున్నా.. ఇక్కడ తన తిండి తిప్పలు తనవేనని కళ్లనీళ్లు పెట్టుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లోని ఏ ఇంటి తలుపు తట్టినా వినిపించే ఆవేదన ఇది.
సాక్షి, సిద్దిపేట: 600 అడుగుల లోతుకు తవ్వినా జాడ లేని నీరు! సాగునీటి సౌకర్యం లేక పడావు పడిన భూములు.. స్థానికంగా లభించని ఉపాధి.. వెరసి సిద్దిపేట జిల్లా బస్వాపూర్ గ్రామం వలసల ఊరుగా మారింది. వలస పోయేందుకు వీలుగా 18 ఏళ్లు నిండగానే యువత పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్న దుస్థితి. 40 ఏళ్ల క్రితమే బస్వాపూర్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయని ‘సాక్షి’పరిశీలనలో తేలింది.
దాదాపు ఇంటికొకరు..
ఆరేపల్లి, చందునాయక్ తండా, జురాలిన్, మల్లన్నపేట, జ్యోతిరాం తండా, సింగరాయ తండా, గద్దల కాలనీ.. ఇవన్నీ కలిపి బస్వాపూర్ రెవెన్యూ గ్రామం ఉంది. 1,200 కుటుంబాలు, 5,000 మంది జనాభా, 3,700 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో 10 వేల ఎకరాల సాగు భూమి ఉంది. గుట్టలు, చెట్లు, రాళ్లురప్పలు పోగా 6 వేల ఎకరాల విస్తీర్ణం మనుగడలో ఉంది. ఈ భూమికీ వర్షపు నీరే ఆధారం. ప్రాజెక్టులు, కాల్వలు లేవు. వానలొచ్చి చెరువులు నిండితేనే పంట పండేది. వందల అడుగుల లోతుకు బోర్లు తవ్వించి అప్పులపాలైన వారు ఈ గ్రామంలో ఇంటికొకరు ఉన్నారు.
ఈ క్రమంలో అప్పులు తీర్చుకునేందుకు, కుటుంబ బాధ్యతలు మోసేందుకు బస్వాపూర్ గ్రామ యువత ఎడారి దేశాలకు వలస పోతున్నారు. గడిచిన 40 ఏళ్లలో వెయ్యి మంది దుబాయ్, ఒమన్, మస్కట్, సౌదీ, కత్తర్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్ తదితర దేశాలకు వలస వెళ్లారు. గ్రామం నుంచి కనీసం ఇంటికొక్కరు చొప్పున వెళ్లిన దాదాపు 700 మంది ఇంకా ఎడారి దేశాల్లోనే ఉన్నారు. అప్పులు చేసి వెళ్లి అక్కడ చాలీచాలని జీతాలతో కొందరు బతుకు వెళ్లదీస్తుంటే.. అక్కడ కష్టాలపాలై తెలిసిన వారి వద్ద అప్పోసప్పో చేసి ఇక్కడకు చేరుకున్న వారు మరికొందరు ఉన్నారు.
18 ఏళ్లు దాటగానే..
యువత చదువు పూర్తి కాగానే ఉద్యోగాన్వేషణలో పడతారు. కానీ బస్వాపూర్ యువకులు మాత్రం 18 ఏళ్లు దాటగానే మొదట చేసే పని.. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయడం. ‘దరఖాస్తు చేసుకుని ఉంటే ఎప్పటికైనా గల్ఫ్ వెళ్లడానికి ఉపయోగపడుతుంది’అని గ్రామ యువకులు చెప్పారు. మరోవైపు గల్ఫ్ వెళ్తున్న యువకుల్లో చాలామంది ఏజెంట్ల మోసాలతో దగా పడుతున్నారు. సౌదీ వెళ్లేందుకు రూ.లక్ష వరకు ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. మంచి వేతనం, ఉద్యోగం అని చెప్పి ఎయిర్‌పోర్టులో వదలేసి తప్పుకుంటున్నారు. తీరా అక్కడకు వెళ్లాక యువకులు.. గొర్రెలు, ఒంటెలు కాసే పనులకు కుదురుతున్నారు. ‘అక్కడున్న సమయంలో వేల మైళ్ల ఎడారి ప్రాంతంలో ఒంటరిగా ఉంటూ పశువులను మేపే వాళ్లం. వారానికి ఒకసారి యజమాని రొట్టెలు ఇచ్చి వెళ్లే వాడు. చేసే పని నచ్చలేదనే ఉద్దేశం మాకు ఉన్నట్టు కనిపెట్టిన వెంటనే పాస్‌పోర్టు, వీసా లాక్కుంటారు’అని గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన కొందరు వాపోయారు.
జీవనోపాధి పథకం అమలు
సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక వలసలున్న ప్రాంతంగా బస్వాపూర్‌ను అధికారులు గుర్తించారు. చేపట్టాల్సిన ఉపాధి పథకాలు, వలసల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల చర్చించింది. వారి అనుభవాలు, ఏం చేస్తే వలసలు తగ్గుతాయో, సమస్యకు మూలమేమి టో అడిగి తెలుసుకుంది.త్వరలోనే గ్రామంలో జీవనోపాధి పథకం కింద వివిధ ఉపాధి మార్గాలు చూపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
చనిపోదామనుకున్నా..
ఇద్దరు ఆడపిల్లలకు మంచి చదువులు చెప్పిద్దామని, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే ఆశతో రూ.1.5 లక్షలు అప్పు చేసి సౌదీ వెళ్లా. డ్రైవర్ ఉద్యోగం, నెలకు రూ.30 వేలు జీతమని ఏజెంటు చెప్పిండు. కానీ అక్కడికి వెళ్లాక ఎడారిలో గొర్రెలను కాయబెట్టిర్రు. నెలకు రూ.8 వేలే వస్తుండె. వారానికోమారు యజమాని వచ్చి రొట్టెలు ఇచ్చేటోడు. చనిపోవాలనుకున్నా.. చివరికి రూ.2 లక్షలు అప్పు చేసి మిత్రుల సాయంతో ఇంటికి చేరా.
– మధుకర్
అరచేతిలో ప్రాణాలు..
మంచి పని దొరుకుతుందని, అప్పులు తీర్చవచ్చని, మంచి ఇళ్లు కట్టుకోవచ్చని ఇరాక్ వెళ్లా. అక్కడ యుద్ధ బంకర్లలో పని. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియదు. మిలటరీ సైరన్ మోగగానే సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టేటోడిని. భార్య, పిల్లలు గుర్తుకొచ్చేవారు. అక్కడి సంపాదన వద్దు.. ఆ దేశం అంతకన్నా వద్దనుకొని ఇంటికి చేరా. ఇక్కడ పనిలేదు. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తున్న పిల్లలను చూస్తే బాధవుతాంది.
– బండి బాలరాజు
రూ.3 లక్షల అప్పు
నా భర్త లింగల వెంకటయ్య 2013లో సౌదీ పోయిండు. అక్కడ గొర్రెల కాపరిగా పని చూపిచ్చిర్రు. ఆ పని నచ్చక రెండేళ్ల క్రితం కంపెనీ నుంచి బయటకొచ్చిండు. వేరే పని చేసుకుంటుంటే సౌదీ పోలీసులు పట్టుకోని జైల్లో ఏసిండ్రు. ఇద్దరు బిడ్డలు పెళ్లికి ఎదిగారు. ఇప్పటికే రూ.3 లక్షల అప్పు ఉంది. మా భవిష్యత్తు మంచిగుండాలని సంపాదనకు పోతే బతుకులు ఆగమైనయ్. ప్రభుత్వం స్పందించి నా భర్తను విడిపించాలె.
– లింగల పద్మ
ఉపాధి లేకే వలసలు
గ్రామంలో అంతా వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటోళ్లే. కానీ ఇక్కడ సాగునీరు లేదు. పంటలు పండవు. లక్షలు ఖర్చు చేసి బోర్లు వేసినా నీళ్లుపడవు. ఉపాధి లేకే యువత ఎడారి దేశాలకు వలస పోతుండ్రు.
– మాంకాలి అంజయ్య, ఉప సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment