Employment drought
-
ఇంటింటికో వలస.. బస్వాపూర్ గోస!
ఇంటి పనిలో నిమగ్నమై ఉన్న ఈ వృద్ధురాలి పేరు సానటి రాజవ్వ. ఆమె ఇద్దరు కొడుకులు ఎడారి దేశానికి వలసపోయారు. వాళ్లే కాదు.. గ్రామంలో ప్రతి యువకుడు అలాగే పోతున్నారని చెబుతోందామె. ‘ఇక్కడ చేసుకోనీకి పనిలేదు. అందరికీ దూరంగా పోయి దేశం కాని దేశంలో పొట్టనింపుకుంటున్నరు. అక్కడెన్ని రోజులున్నా సంపాదించేదేం లేదు. షేక్‌లు చెప్పిన పని చేయాలె. తెల్లవారుజామున 4 గంటలకు పనిలోకి వెళ్తే రాత్రి పది గంటలకు రూమ్‌కు పోతరంట’అని తన కొడుకుల వ్యథను చెప్పుకొచ్చింది. చెట్టంత కొడుకులున్నా.. ఇక్కడ తన తిండి తిప్పలు తనవేనని కళ్లనీళ్లు పెట్టుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లోని ఏ ఇంటి తలుపు తట్టినా వినిపించే ఆవేదన ఇది. సాక్షి, సిద్దిపేట: 600 అడుగుల లోతుకు తవ్వినా జాడ లేని నీరు! సాగునీటి సౌకర్యం లేక పడావు పడిన భూములు.. స్థానికంగా లభించని ఉపాధి.. వెరసి సిద్దిపేట జిల్లా బస్వాపూర్ గ్రామం వలసల ఊరుగా మారింది. వలస పోయేందుకు వీలుగా 18 ఏళ్లు నిండగానే యువత పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్న దుస్థితి. 40 ఏళ్ల క్రితమే బస్వాపూర్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయని ‘సాక్షి’పరిశీలనలో తేలింది. దాదాపు ఇంటికొకరు.. ఆరేపల్లి, చందునాయక్ తండా, జురాలిన్, మల్లన్నపేట, జ్యోతిరాం తండా, సింగరాయ తండా, గద్దల కాలనీ.. ఇవన్నీ కలిపి బస్వాపూర్ రెవెన్యూ గ్రామం ఉంది. 1,200 కుటుంబాలు, 5,000 మంది జనాభా, 3,700 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో 10 వేల ఎకరాల సాగు భూమి ఉంది. గుట్టలు, చెట్లు, రాళ్లురప్పలు పోగా 6 వేల ఎకరాల విస్తీర్ణం మనుగడలో ఉంది. ఈ భూమికీ వర్షపు నీరే ఆధారం. ప్రాజెక్టులు, కాల్వలు లేవు. వానలొచ్చి చెరువులు నిండితేనే పంట పండేది. వందల అడుగుల లోతుకు బోర్లు తవ్వించి అప్పులపాలైన వారు ఈ గ్రామంలో ఇంటికొకరు ఉన్నారు. ఈ క్రమంలో అప్పులు తీర్చుకునేందుకు, కుటుంబ బాధ్యతలు మోసేందుకు బస్వాపూర్ గ్రామ యువత ఎడారి దేశాలకు వలస పోతున్నారు. గడిచిన 40 ఏళ్లలో వెయ్యి మంది దుబాయ్, ఒమన్, మస్కట్, సౌదీ, కత్తర్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్ తదితర దేశాలకు వలస వెళ్లారు. గ్రామం నుంచి కనీసం ఇంటికొక్కరు చొప్పున వెళ్లిన దాదాపు 700 మంది ఇంకా ఎడారి దేశాల్లోనే ఉన్నారు. అప్పులు చేసి వెళ్లి అక్కడ చాలీచాలని జీతాలతో కొందరు బతుకు వెళ్లదీస్తుంటే.. అక్కడ కష్టాలపాలై తెలిసిన వారి వద్ద అప్పోసప్పో చేసి ఇక్కడకు చేరుకున్న వారు మరికొందరు ఉన్నారు. 18 ఏళ్లు దాటగానే.. యువత చదువు పూర్తి కాగానే ఉద్యోగాన్వేషణలో పడతారు. కానీ బస్వాపూర్ యువకులు మాత్రం 18 ఏళ్లు దాటగానే మొదట చేసే పని.. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయడం. ‘దరఖాస్తు చేసుకుని ఉంటే ఎప్పటికైనా గల్ఫ్ వెళ్లడానికి ఉపయోగపడుతుంది’అని గ్రామ యువకులు చెప్పారు. మరోవైపు గల్ఫ్ వెళ్తున్న యువకుల్లో చాలామంది ఏజెంట్ల మోసాలతో దగా పడుతున్నారు. సౌదీ వెళ్లేందుకు రూ.లక్ష వరకు ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. మంచి వేతనం, ఉద్యోగం అని చెప్పి ఎయిర్‌పోర్టులో వదలేసి తప్పుకుంటున్నారు. తీరా అక్కడకు వెళ్లాక యువకులు.. గొర్రెలు, ఒంటెలు కాసే పనులకు కుదురుతున్నారు. ‘అక్కడున్న సమయంలో వేల మైళ్ల ఎడారి ప్రాంతంలో ఒంటరిగా ఉంటూ పశువులను మేపే వాళ్లం. వారానికి ఒకసారి యజమాని రొట్టెలు ఇచ్చి వెళ్లే వాడు. చేసే పని నచ్చలేదనే ఉద్దేశం మాకు ఉన్నట్టు కనిపెట్టిన వెంటనే పాస్‌పోర్టు, వీసా లాక్కుంటారు’అని గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన కొందరు వాపోయారు. జీవనోపాధి పథకం అమలు సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక వలసలున్న ప్రాంతంగా బస్వాపూర్‌ను అధికారులు గుర్తించారు. చేపట్టాల్సిన ఉపాధి పథకాలు, వలసల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల చర్చించింది. వారి అనుభవాలు, ఏం చేస్తే వలసలు తగ్గుతాయో, సమస్యకు మూలమేమి టో అడిగి తెలుసుకుంది.త్వరలోనే గ్రామంలో జీవనోపాధి పథకం కింద వివిధ ఉపాధి మార్గాలు చూపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. చనిపోదామనుకున్నా.. ఇద్దరు ఆడపిల్లలకు మంచి చదువులు చెప్పిద్దామని, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే ఆశతో రూ.1.5 లక్షలు అప్పు చేసి సౌదీ వెళ్లా. డ్రైవర్ ఉద్యోగం, నెలకు రూ.30 వేలు జీతమని ఏజెంటు చెప్పిండు. కానీ అక్కడికి వెళ్లాక ఎడారిలో గొర్రెలను కాయబెట్టిర్రు. నెలకు రూ.8 వేలే వస్తుండె. వారానికోమారు యజమాని వచ్చి రొట్టెలు ఇచ్చేటోడు. చనిపోవాలనుకున్నా.. చివరికి రూ.2 లక్షలు అప్పు చేసి మిత్రుల సాయంతో ఇంటికి చేరా. – మధుకర్ అరచేతిలో ప్రాణాలు.. మంచి పని దొరుకుతుందని, అప్పులు తీర్చవచ్చని, మంచి ఇళ్లు కట్టుకోవచ్చని ఇరాక్ వెళ్లా. అక్కడ యుద్ధ బంకర్లలో పని. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియదు. మిలటరీ సైరన్ మోగగానే సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టేటోడిని. భార్య, పిల్లలు గుర్తుకొచ్చేవారు. అక్కడి సంపాదన వద్దు.. ఆ దేశం అంతకన్నా వద్దనుకొని ఇంటికి చేరా. ఇక్కడ పనిలేదు. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తున్న పిల్లలను చూస్తే బాధవుతాంది. – బండి బాలరాజు రూ.3 లక్షల అప్పు నా భర్త లింగల వెంకటయ్య 2013లో సౌదీ పోయిండు. అక్కడ గొర్రెల కాపరిగా పని చూపిచ్చిర్రు. ఆ పని నచ్చక రెండేళ్ల క్రితం కంపెనీ నుంచి బయటకొచ్చిండు. వేరే పని చేసుకుంటుంటే సౌదీ పోలీసులు పట్టుకోని జైల్లో ఏసిండ్రు. ఇద్దరు బిడ్డలు పెళ్లికి ఎదిగారు. ఇప్పటికే రూ.3 లక్షల అప్పు ఉంది. మా భవిష్యత్తు మంచిగుండాలని సంపాదనకు పోతే బతుకులు ఆగమైనయ్. ప్రభుత్వం స్పందించి నా భర్తను విడిపించాలె. – లింగల పద్మ ఉపాధి లేకే వలసలు గ్రామంలో అంతా వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటోళ్లే. కానీ ఇక్కడ సాగునీరు లేదు. పంటలు పండవు. లక్షలు ఖర్చు చేసి బోర్లు వేసినా నీళ్లుపడవు. ఉపాధి లేకే యువత ఎడారి దేశాలకు వలస పోతుండ్రు. – మాంకాలి అంజయ్య, ఉప సర్పంచ్ -
నో ప్లేస్మెంట్
నిరుద్యోగ యువతకు ఉపాధి కరువు ఖరారు కానీ ఈజీఎంఎంకు విధివిధానాలు ఈఎస్టీలో శిక్షణ పూర్తి చేసుకున్న మూడు బ్యాచ్‌లు ఉద్యోగాలు చూపని అధికారులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉద్యోగం పురుష లక్షణం.. ఇది ఒకప్పటి మాట. ఉద్యోగం జీవనాధారం అనేది ప్రస్తుతం వాస్తవం. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వం ఉద్యోగం సాధించాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. ప్రైవేటు రంగంలోనైనా ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందామనుకున్నా అవసరమైన నైపుణ్యం, శిక్షణ అవసరం. గత ప్రభుత్వం రాజీవ్ యువకిరణాల పేరుతో వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధిని చూపించారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఈజీఎంఎం(ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మేనేజింగ్ మిషన్) ప్రారంభించారు. అయితే నేటికి దానికి సంబంధించిన విధివిధానాలు, లక్ష్యాలు ఖరారు కాలేదు. దీంతో జిల్లా అధికారులు చేతులెత్తాశారు. ఏడాది నుంచి ఒక్కరికీ ప్లేస్మెంట్ చూపించలేకపోయారు. ఫలితంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కరువైంది. ఒక్కరికీ ఉపాధి చూపని ఈజీఎంఎం ఈజీఎంఎంకు సంబంధించిన విధివిధానాలు, లక్ష్యాలేవి ఖరారు కాలేదు. దీంతో నిరుద్యోగ యువతకు శిక్షన ఇచ్చి ఉపాధిని చూపించేందుకు వీలుకావడం లేదని డీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు. జూన్, జూలై నెలల్లో విధివిధానాలు వచ్చే అవకాశం ఉంది. కాగా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో తాండ్రపాడులోని శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం 39 మంది నిరుద్యోగులతో ఒక బృందం శిక్షణ పొందుతోంది. వీరికి స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు ఇంగ్లిషు, కంప్యూటర్స్, వర్క్రెడీ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ తరగతులు మరో మూడు నెలల్లో పూర్తవ్వగానే స్థానికంగా లభించే ప్రైవేట్ ఉద్యోగాలను చూపిస్తామని జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రసాదుబాబు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో పట్టణ జీవనోపాధుల మిషన్‌లో అమలవుతోంది. ఇందులో భాగంగా ఈఎస్టీ(ఎంప్లాయ్మెంట్ త్రో స్కిల్ అండ్ ట్రైనింగ్) పథకంలో ఇప్పటి వరకు 16 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. అందులో మూడు బ్యాచ్‌లకు మాత్రమే శిక్షణ తరగతులు ఇటీవలే పూర్తయ్యాయి. మిగతావి మరో రెండు మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. శిక్షణ తరగతుల నిర్వహణలో పరుగులు పెట్టిన మెప్మా అధికారులు ప్లేస్మెంట్లు చూపడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఒక్కరికీ ఉపాధిని చూపిన దాఖలాలు కనిపించడంలేదు. శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు మరో రెండు, మూడు వారాల్లో ఉద్యోగాలు చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మెప్మా అధికారులు పేర్కొంటున్నారు. యువతకు ఉద్యోగ నైపుణ్యాలు నేర్పాలి ప్రైవేట్ ఉద్యోగల కోసం అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పించాలి. అందుకు సంబంధించిన శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు చూపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. రాజీవ్ యువ కిరణాల స్థానంలో వచ్చిన ఈజీఎంఎంకు విధివిధానాలను వెంటనే విడుదల చేయాలి. పథకం అమలయితే కొంతమందైనా శిక్షణ తీసుకొని ఉపాధిని పొందుతారు. స్థానికంగా ఉండే ప్రైవేట్ ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. - లెనిన్‌బాబు, ఏఐవైఎఫ్ నాయకులు 16 బ్యాచ్‌లకు శిక్షణ తరగతులు నడుస్తున్నాయి పట్టణ జీవనోపాధుల మిషన్‌లో యువతకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని నంద్యాల, ఆదోని, కర్నూలు నగరల్లోని యువతకు మెళకువలను నేర్పేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 16 బ్యాచ్‌లు ప్రారంభం కాగా మూడు పూర్తయ్యాయి. శిక్షణ పూర్తయిన బ్యాచ్‌లకు స్థానికంగా ఉండే ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - వెంకటేశ్, జిల్లా ఉపాధికల్పనాధికారి, మెప్మా కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలి ప్రభుత్వం ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలి. ఈ రోజు ఏ ఉద్యోగానికి వెళ్లిన కంప్యూటర్‌పై పట్టు ఉందా అని అడుగుతున్నారు. కనీసం బేసిక్స్పైనైనా శిక్షణ ఇవ్వాలి. గతంలో స్థానికంగానే కంప్యూటర్ ఉచితంగా నేర్పేవారు. ఇప్పుడు అలాంటి పద్ధతినే ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో కంప్యూటర్ కోర్సులకు వేలల్లో తీసుకుంటున్నారు. - అంజి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
ఏదీ నాటి దర్జా?
బెల్‌బాటమ్, స్కిన్‌టైట్ ప్యాంట్లు.. పొడవు కాలరుచొక్కాలు.. షార్ట మోడల్ షర్టులు.. రఫ్‌లుక్ డ్రెస్సులు.. ఒకటా.. రెండా.. మోడల్ఏదైనా, కుట్టు ఎలాగున్నా తమదైన శైలిలో దుస్తులు కుట్టిన దర్జీలు ఇప్పుడు ఆ దర్జా కోల్పోయారు. రెడీమేడ్ డ్రెస్సుల రాకతో వీరికాళ్ల కదలికలు ఆగిపోయాయి. టకటకమంటూ పని చేసిన వీరి మిషన్లు రంగురంగుల రెడీమేడ్ డ్రెస్సుల రాకతో మూలకు చేరిపోయాయి. పట్టణాల్లో మొదలై మెల్లగా పల్లె నడిబొడ్డుకు చేరిన రెడీమేడ్ హోరు దర్జీల ఉపాధిని గల్లంతు చేసింది. జీవితాలను ముక్కలు చేసింది. కుట్టు చప్పుడును ఆపేసింది. దర్జీ వృత్తికి వన్నెతెచ్చిన కుట్టు మిషన్‌ను ఆవిష్కరించిన విలియమ్స్హో, విలీఫ్జోన్స్ల స్మారకార్థం ఏటా ఫిబ్రవరి 28న ‘టైలర్స్ డే’ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.. నేడు టైలర్స్ డే ⇒ కష్టాల్లో కత్తెర పట్టిన చేతులు ⇒ టైలర్ల జీవితాల్లో అంధకారం ⇒ గతమెంతో ఘనం .. ప్రస్తుతం దుర్భరం ⇒ రెడీమేడ్ దుస్తుల రాకతో ఉపాధి కరువు షాబాద్/ఘట్కేసర్ టౌన్: ఒకప్పుడు దర్జీ లేని ఊరు లేదంటే అతిశయోక్తి లేదు. మనిషికి హుందాతనాన్ని, అందాన్ని ఇచ్చే దుస్తుల కోసం పట్టణాల నుంచి పల్లెల వరకు అందరూ దర్జీల వద్ద క్యూ కట్టేవారు. పండగలు,పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు దగ్గరుండి మరీ దుస్తులను కుట్టించుకునేవారు. ఇదంతా గతం. రెడీమేడ్ దుస్తుల వైభవం ముందు దర్జీలు కుదేలయ్యారు. యువతను ఆకర్షించే నూతన డిజైన్లలో షర్టులు, జీన్స్ ఫ్యాంటులు, చుడీదార్లు, పంజాబీ డ్రెస్‌లు మార్కెట్లో దిగడంతో కుట్టు చప్పుడు ఆగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత రెడీమేడ్ వైపు ఆకర్షితులవుతుండడంతో దర్జీలకు పని లేకుండా పోయింది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారంతా పని లేక ఖాళీగా దర్శనమిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పేరుమోసిన టైలర్లకు మాత్రమే కాసింత ఆదరణ లభిస్తోంది. అది కూడా కేవలం పండగ సీజన్లలో మాత్రమే. ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే వారికి కాసింతైనా పని దొరుకుతోంది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో కొత్తతరం ఇటువైపు రావడం మానేసింది. ఇదే వృత్తిలో ఉన్నవారు కూడా బతుకు వెతుక్కుంటూ మరోదారి వైపు మళ్లుతున్నారు. ఒకప్పుడు 24 గంటలు పనిచేసిన చేతులకు నేడు పనులు లేకుండా పోయాయి. చేతిలోఉన్న పనిని నమ్ముకోలేక, ఇంకో పనిచేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. నేటి ఫ్యాషన్లు, మెళకువలు నేర్చినవారు మాత్రం కాస్తోకూస్తో నిలదొక్కుకుంటున్నారు. భారీగా పెరిగిన ముడి సరుకుల ధరలు పండుగ సీజన్లలో దొరికే కొద్దిపాటి పనిచేసేందుకు అవసరమయ్యే ముడి సరుకుల ధ రలు పెరగటం దర్జీలకు మరో దెబ్బ. ప్రధా నంగా ముడి సరుకులైన దారాలు, జిప్పులు, హుక్కులు, గుండీలు తదితర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు అదనపు భారంగా మారుతున్నాయి. దీంతో చిన్నపాటి షాపు పెట్టిన యజమానికి అందులో పనిచేసే కార్మికులకు ఇద్దరికీ గిట్టుబాటు కావటం లేదు. ప్రస్తుతం పేరు మోసిన టైలర్లు ఒక జత మగవారి బట్టలు కుట్టి ఇచ్చేందుకు గరిష్టంగా రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. ఇక సూట్లకు అయితే రూ.2వేలు, సఫారీ డ్రెస్‌లకు రూ.700 తీసుకుంటున్నారు. ఆడవారికి పంజాబీ డ్రెస్సులు కుట్టివ్వాలంటే రూ.250 నుంచి వివిధ డిజైన్ల బట్టి ధరలు వసూలు చేస్తున్నారు. అయితే ఇంత మొత్తంలో చెల్లించడానికి విని యోగదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో దర్జీలకు పని దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దర్జీల సంక్షేమానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించాలి.. పెళ్లి, పండుగలు ఇతర సీజన్లలో మాత్రమే పని దొరుకుతోంది. మాకు బ్యాంకుల ద్వారా రుణాలందిస్తే ఆధునిక కుట్టుమిషన్లు కొనుక్కుంటాం. మెరుగ్గా, ఫ్యాషన్‌గా కుట్టి జీవనోపాధి పొందుతాం. - బాల్‌రాజ్, ఘట్‌కేసర్‌టౌన్ పని కరువైంది.. మార్కెట్లోకి రెడీమెడ్ దుస్తులు రావడంతో టైలర్‌కు ఆదరణకు త గ్గింది. గతంలో ప్రతి ఒక్కరూ కుట్టిన దుస్తులే తొడిగేవారు. ప్రస్తుతం షోరూంలలోకి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మాకు పని ఉండడం లేదు. - రమేశ్, షాబాద్ ఆదరణ తగ్గింది.. గతంలో దర్జీ పని చేసే వాళ్ల కు మంచి ఆదరణ ఉండేది. ప్రస్తుతం కొత్తకొత్త షోరూం లు, రెడీమేడ్ దుస్తులు వస్తుండడంతో మాకు గిరాకీ తగ్గింది. కాలానుగుణంగా వస్తున్న వివిధ డిజైన్లను నేర్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. -సాజిత్, షాబాద్ పోటీని తట్టుకోలేకపోతున్నాం రెడీమేడ్ దుస్తులు తయారీదారుైలన బహుళజాతి సంస్థల పోటీని తట్టుకోలేకపోతున్నాం. రెడీమేడ్ దుస్తులను తక్కువ ధరల్లో అందించడంతో కుట్టించుకోవడానికి ఎవరూ ముందుకురావడంలేదు. కుట్టుకూలి డబ్బులతో డ్రెస్‌లే లభిస్తుండడంతో మా దగ్గరికి రావడం లేదు. - తుల్జారాం, ఘట్‌కేసర్‌టౌన్ సీజన్లోనే గిరాకీ.. సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో ఇబ్బందులు పడుతున్నాం. గతంలో సొంతంగా టైలర్ షాపు నడుపుకునేవాడిని. ప్రస్తుతం వేరే షాపులో కూలీ పని చేస్తున్నాను. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడే గిరాకీ ఉంటుంది. - రామస్వామి, షాబాద్