ఏదీ నాటి దర్జా? | Today tailors Day | Sakshi
Sakshi News home page

ఏదీ నాటి దర్జా?

Published Fri, Feb 27 2015 11:58 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

ఏదీ నాటి దర్జా? - Sakshi

ఏదీ నాటి దర్జా?

బెల్‌బాటమ్, స్కిన్‌టైట్ ప్యాంట్లు.. పొడవు కాలరుచొక్కాలు.. షార్‌‌ట మోడల్ షర్టులు.. రఫ్‌లుక్ డ్రెస్సులు.. ఒకటా.. రెండా.. మోడల్‌ఏదైనా, కుట్టు ఎలాగున్నా తమదైన శైలిలో దుస్తులు కుట్టిన దర్జీలు ఇప్పుడు ఆ దర్జా కోల్పోయారు. రెడీమేడ్ డ్రెస్సుల రాకతో వీరికాళ్ల కదలికలు ఆగిపోయాయి. టకటకమంటూ పని చేసిన వీరి మిషన్లు రంగురంగుల రెడీమేడ్ డ్రెస్సుల రాకతో మూలకు చేరిపోయాయి.

పట్టణాల్లో మొదలై మెల్లగా పల్లె నడిబొడ్డుకు చేరిన రెడీమేడ్ హోరు దర్జీల ఉపాధిని గల్లంతు చేసింది. జీవితాలను ముక్కలు చేసింది. కుట్టు చప్పుడును ఆపేసింది. దర్జీ వృత్తికి వన్నెతెచ్చిన కుట్టు మిషన్‌ను ఆవిష్కరించిన విలియమ్స్‌హో, విలీఫ్‌జోన్స్‌ల స్మారకార్థం ఏటా ఫిబ్రవరి 28న ‘టైలర్స్ డే’ను నిర్వహిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..  


నేడు టైలర్స్ డే
కష్టాల్లో కత్తెర పట్టిన చేతులు
 టైలర్ల జీవితాల్లో అంధకారం
గతమెంతో ఘనం .. ప్రస్తుతం దుర్భరం
రెడీమేడ్ దుస్తుల రాకతో ఉపాధి కరువు

షాబాద్/ఘట్‌కేసర్ టౌన్: ఒకప్పుడు దర్జీ లేని ఊరు లేదంటే  అతిశయోక్తి లేదు. మనిషికి హుందాతనాన్ని, అందాన్ని ఇచ్చే దుస్తుల కోసం పట్టణాల నుంచి పల్లెల వరకు అందరూ దర్జీల వద్ద క్యూ కట్టేవారు. పండగలు,పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు దగ్గరుండి మరీ దుస్తులను కుట్టించుకునేవారు. ఇదంతా గతం. రెడీమేడ్ దుస్తుల వైభవం ముందు దర్జీలు కుదేలయ్యారు. యువతను ఆకర్షించే నూతన డిజైన్లలో షర్టులు, జీన్స్ ఫ్యాంటులు, చుడీదార్లు, పంజాబీ డ్రెస్‌లు మార్కెట్‌లో దిగడంతో కుట్టు చప్పుడు ఆగిపోయింది.

గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత రెడీమేడ్ వైపు ఆకర్షితులవుతుండడంతో దర్జీలకు పని లేకుండా పోయింది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న  వారంతా పని లేక ఖాళీగా దర్శనమిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పేరుమోసిన టైలర్లకు మాత్రమే కాసింత ఆదరణ లభిస్తోంది. అది కూడా కేవలం పండగ సీజన్లలో మాత్రమే. ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే వారికి కాసింతైనా పని దొరుకుతోంది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో కొత్తతరం ఇటువైపు రావడం మానేసింది.

ఇదే వృత్తిలో ఉన్నవారు కూడా బతుకు వెతుక్కుంటూ మరోదారి వైపు మళ్లుతున్నారు. ఒకప్పుడు 24 గంటలు పనిచేసిన చేతులకు నేడు పనులు లేకుండా పోయాయి. చేతిలోఉన్న పనిని నమ్ముకోలేక, ఇంకో పనిచేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. నేటి ఫ్యాషన్లు, మెళకువలు నేర్చినవారు మాత్రం కాస్తోకూస్తో నిలదొక్కుకుంటున్నారు.

భారీగా పెరిగిన ముడి సరుకుల ధరలు
పండుగ సీజన్లలో దొరికే కొద్దిపాటి పనిచేసేందుకు అవసరమయ్యే ముడి సరుకుల ధ రలు పెరగటం దర్జీలకు మరో దెబ్బ. ప్రధా నంగా ముడి సరుకులైన దారాలు, జిప్పులు, హుక్కులు, గుండీలు తదితర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు అదనపు భారంగా మారుతున్నాయి. దీంతో చిన్నపాటి షాపు పెట్టిన యజమానికి అందులో పనిచేసే కార్మికులకు ఇద్దరికీ గిట్టుబాటు కావటం లేదు. ప్రస్తుతం పేరు మోసిన టైలర్లు ఒక జత మగవారి బట్టలు కుట్టి ఇచ్చేందుకు గరిష్టంగా రూ.600 వరకు వసూలు చేస్తున్నారు.

ఇక సూట్‌లకు అయితే రూ.2వేలు, సఫారీ డ్రెస్‌లకు రూ.700 తీసుకుంటున్నారు. ఆడవారికి పంజాబీ డ్రెస్సులు కుట్టివ్వాలంటే రూ.250 నుంచి వివిధ డిజైన్ల బట్టి ధరలు వసూలు చేస్తున్నారు. అయితే ఇంత మొత్తంలో చెల్లించడానికి విని యోగదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో దర్జీలకు పని దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దర్జీల సంక్షేమానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.  
 
ప్రభుత్వం ప్రోత్సహించాలి..
పెళ్లి, పండుగలు ఇతర సీజన్లలో మాత్రమే పని దొరుకుతోంది. మాకు బ్యాంకుల ద్వారా రుణాలందిస్తే ఆధునిక కుట్టుమిషన్లు కొనుక్కుంటాం. మెరుగ్గా, ఫ్యాషన్‌గా కుట్టి జీవనోపాధి పొందుతాం.
- బాల్‌రాజ్, ఘట్‌కేసర్‌టౌన్
 
పని కరువైంది..
మార్కెట్‌లోకి రెడీమెడ్ దుస్తులు రావడంతో టైలర్‌కు ఆదరణకు త గ్గింది. గతంలో ప్రతి ఒక్కరూ కుట్టిన దుస్తులే తొడిగేవారు. ప్రస్తుతం షోరూంలలోకి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మాకు పని ఉండడం లేదు.
- రమేశ్, షాబాద్
 
ఆదరణ తగ్గింది..
గతంలో దర్జీ పని చేసే వాళ్ల కు మంచి ఆదరణ ఉండేది. ప్రస్తుతం కొత్తకొత్త షోరూం లు, రెడీమేడ్ దుస్తులు వస్తుండడంతో మాకు గిరాకీ తగ్గింది. కాలానుగుణంగా వస్తున్న వివిధ డిజైన్లను నేర్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం.
-సాజిత్, షాబాద్
 
పోటీని తట్టుకోలేకపోతున్నాం
 రెడీమేడ్ దుస్తులు తయారీదారుైలన బహుళజాతి సంస్థల పోటీని  తట్టుకోలేకపోతున్నాం. రెడీమేడ్ దుస్తులను తక్కువ ధరల్లో అందించడంతో కుట్టించుకోవడానికి ఎవరూ ముందుకురావడంలేదు. కుట్టుకూలి డబ్బులతో డ్రెస్‌లే లభిస్తుండడంతో మా దగ్గరికి రావడం లేదు.
- తుల్జారాం, ఘట్‌కేసర్‌టౌన్
 
సీజన్‌లోనే గిరాకీ..
సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో ఇబ్బందులు పడుతున్నాం. గతంలో సొంతంగా టైలర్ షాపు నడుపుకునేవాడిని. ప్రస్తుతం వేరే షాపులో కూలీ పని చేస్తున్నాను. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడే గిరాకీ ఉంటుంది.
- రామస్వామి, షాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement