Tailors
-
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు
లక్నో: అసభ్యకరంగా తాకుతూ దురుద్దేశంతో వ్యవహరించే పురుషుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికంటూ ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ పలు సంచలనాత్మక సిఫారసులను రూపొందించింది. వీటి ప్రకారం పురుషులు..టైలరింగ్ షాపుల్లో మహిళల కొలతల్ని తీసుకోరాదు.సెలూన్లలో మహిళల జుత్తు కత్తిరించరాదు. దుస్తుల దుకాణాలు, జిమ్‌లు, కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. స్కూల్ బస్సుల్లో భద్రత కోసం మహిళా సిబ్బందిని నియమించాలి..వంటివి ఉన్నాయి. అక్టోబర్ 28వ తేదీన సమావేశమైన కమిషన్ ఈ మేరకు నిబంధనలను ఆమోదించింది. బహిరంగ ప్రదేశాల్లో పురుషుల నుంచి మహిళలను వేరుగా ఉంచేందుకు, మహిళలకు భద్రతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ మార్గదర్శకాలను అమలు చేయాలంటూ అన్ని జిల్లాల మేజి్రస్టేట్లకు లేఖలు రాసింది. ‘చాలా చోట్ల జిమ్‌లలో మగ ట్రెయినర్లు, మహిళల బొటిక్‌లలో మగ దర్జీలు ఉంటున్నారు. వీరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఇటీవలి కాలంలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి’అని యూపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ తెలిపారు. ‘టైలర్లుగా మగవాళ్లుండటంపై మాకెలాంటి సమస్యా లేదు. మహిళల కొలతల్ని పురుషులు తీసుకోడంపైనే మా అభ్యంతరమంతా’అని ఆమె వివరించారు. ‘ఇలాంటి అన్ని చోట్లా శిక్షణ పొందిన మహిళల్ని నియమించుకోవాలి. ఇందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ, ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని ఆమె తెలిపారు.ఇదీ చదవండి: సీఎం సమోసాలు ఎవరు తీసుకున్నారు.. సీఐడీ దర్యాప్తు -
అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!
500 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇవాళే అయోధ్యలో కన్ను పండుగగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరగనుంది. మరికొద్దిసేపటిలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. అంతేగాదు దేశ విదేశాల నుంచి సైతం రామభక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ఆయోధ్య రాముడుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయన ధరించే బట్టలను అందంగా డిజైన్ చేసి ఎవరూ ఇస్తారు? వాళ్లేవరూ? వంటి విశేషాలు గురించి తెలుసుకుందాం! అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం బాబూ లాల్ టైలర్స్. దీన్ని ఇద్దరు అన్నదమ్ములు భగవత్, శంకర్ లాల్ నడుపుతున్నారు. వీళ్లే బాల రామయ్యకు వేసే బట్టలను అందంగా డిజైన్ చేస్తారు. మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్, శంకర్ల తండ్రి బాబూలాల్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు కుడుతోంది. రాముని విగ్రహానికి ఒక్కోరోజు ఒక్కోరంగుతో కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసి కుడతారు. అలా..సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం రంగు వస్త్రాలు వేస్తారు. వాళ్లు కేవలం రాముడికి మాత్రమే గాక లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమాన్, శాలిగ్రామాలకు కూడా బట్టలు కుట్టడం జరుగుతుంది. ఈ టైలర్లు అయోధ్యలోని బడి కుటియా ప్రాంతంలో శ్రీ బాబులాల్ టైలర్ పేరుతో ఎనిమిది అడుగుల గదిలో దుకాణం నడుపుతున్నారు. ఈ అయోధ్య రామమందిరం భూమిపూజ రోజు రామునికి ఆకుపచ్చరంగు దుస్తులను కుట్టారు. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలర్ దుస్తులను డిజైన్ చేశారు. అయితే ఆ సోదరులు రాముడుకి దుస్తులు కుట్టేందుకు సిల్క్‌ని వాడగా, బంగారం దారంతో కుట్టడం జరుగుతుంది. పైగా వాటిపై నవగ్రహాలు ఉండటం విశేషం. ఈ ఇరువురు సోదరులు రామ్‌లల్లా కోసం దుస్తులు కుట్టడంలో చాలా ప్రత్యేకతను చూపి తమ భక్తిని చాటుకుంటున్నారు. అంతేగాదు మా జీవితకాలంలో ఈ గొప్ప రామాలయాన్ని చూడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందంగా చెబుతున్నారు ఆ సోదరులు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
టీడీపీ నేత ఇంటిని ముట్టడించిన టైలర్లు
డోన్ టౌన్: తమ సొంతింటి కల సాకారం కాకుండా అడ్డుపడుతున్న టీడీపీ నేత కన్నపకుంట గోవిందరెడ్డి ఇంటిని టైలర్లు ఆదివారం ముట్టడించారు. టీడీపీ హయాంలో డోన్ పట్టణ టైలర్ల సంఘం అధ్యక్షుడిగా కన్నపకుంట గోవిందరెడ్డి వ్యవహరించారు. టైలర్లకు టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఆ స్థలాల్లో కొంతమంది బేస్మట్టం వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. మరికొందరు తమ స్థలాలను అమ్ముకున్నారు. ఇలా జరిగిన అమ్మకాల్లో గోవిందరెడ్డి పాత్ర ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఆ స్థలాల్లో టిడ్కో ఇళ్లు కట్టిస్తామని స్థలాలను తీసేసుకుంది. అప్పటికే నిర్మించిన బేస్‌మట్టాలను తొలగించారు. టిడ్కో ఇళ్లు ప్రభుత్వం నిర్మించి నిజమైన లబ్దిదారులకే ఇస్తుంది. దీంతో అనధికారికంగా వాటిని కొనుగోలు చేసినవారు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే వారికి కూడా టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని చెప్పి వారి వద్ద నుంచి కూడా గోవిందరెడ్డి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం నిజమైన టైలర్లకు మాత్రమే టిడ్కో గృహాలు కేటాయిస్తూ జీవో జారీ చేయడంతో రూ.లక్షలు చెల్లించిన వారు గోవిందరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో గోవిందరెడ్డి కోర్టుకు వెళ్లడంతో టిడ్కో గృహాల పంపిణీ వాయిదాపడింది. దీంతో టైలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించారు. -
Photo Feature: దర్జీ సంతసం
రడీమేడ్ దుస్తులు వచ్చిన తర్వాత చాలా మంది దర్జీలకు ఉపాధి కరువైంది. దీంతో వారంతా ఇతర వృత్తుల వైపు వెళ్లకుండా.. ఆదాయం పొందే మార్గాలను అన్వేషించారు. కొందరు సంచార దర్జీలుగా మారారు. అందులో భాగంగానే వారపు సంతల్లో కుట్టుమిషన్లు పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పాడేరు, చింతపల్లి, అరకులోయ యూత్ శిక్షణ కేంద్రాల ద్వారా వందలాది మంది గిరిజన మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు. 2006 నుంచి 2009 వరకు శిక్షణ పొందిన గిరిజన మహిళలందరికీ ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. ప్రస్తుతం ఏజెన్సీలోని వారపు సంతలతో పాటు గిరిజన గ్రామాల్లో ఈ మహిళలంతా కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. సిమిలిగుడకు చెందిన పాంగి మిధుల అనే మహిళ అరకులోయ మండలం మారుమూల లోతేరు వారపు సంతలో దుస్తులు కుడుతున్న చిత్రం ఇక్కడ చూడొచ్చు. –సాక్షి, పాడేరు -
‘జగనన్న చేదోడు’కు జావెద్ హబీబ్ బిగ్ థ్యాంక్స్
ముంబై : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ప్రశంసల వర్షం కురిపించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించడంపై జావెద్ హబీబ్ స్పందించారు.('పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు') ‘కరోనా ప్రపంచం మొత్తాన్ని మార్చివేసింది. ఫ్రొఫెషన్లను కూడా మార్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకం పేరే జగనన్న చేదోడు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు అండగా నిలవడానికి తీసుకొచ్చిన పథకం ఇది. ఒకేసారి వీరికి రూ.10 వేల సాయం అందనుంది. దేశంలోనే ఇలాంటి పథకం తీసుకువచ్చిన మొదటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’ బిగ్ థ్యాంక్స్ అంటూ ‘జగనన్న చేదోడు’ పథకంపై జావెద్ హబీబ్ ప్రశంసలు ఝల్లు కురిపించారు. మరోవైపు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జగనన్న చేదోడు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సెలబ్రిటీ స్టైలీస్ట్ హర్మన్ కౌర్ అన్నారు. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేసి జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. (‘జగనన్న చేదోడు’ ప్రారంభం) తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. -
'పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు'
సాక్షి, తాడేపల్లి: రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం 'జగనన్న చేదోడు' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున నగదును జమచేశారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం చూపిన చొరవకు లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కోటిపల్లి రామతులసి మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబం సీఎం జగన్‌కు రుణపడి ఉంటుంది. నవరత్నాలు పేదల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా పెన్షన్లు ఇస్తున్నారు. ఇంక్రిమెంట్ పెరిగినట్టుగా పెన్షన్ పెంచుతున్నారు, అవ్వతాతలు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు. నేనున్నానని చెప్పిన విధంగానే మాకు మీకు సాయపడుతున్నారు. కరోనా సమయంలో బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో మీరు అందించిన సాయం ఎంతగానే అక్కరకొచ్చింది. రాబోయే తరంలోనూ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి' అంటూ రామతులశమ్మ ఉద్వేగానికి లోనైంది. చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం వాలంటీర్ల వ్యవస్థ అద్భుతం చిన్న పిల్లలకు ఓటు హక్కు ఉండదని ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవు. అమ్మఒడి పథకం ద్వారా మా పిల్లలకు చేయూత ఇచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పేదలకు ఏ పథకం రావాలో వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చెప్తున్నారు. మా గురించి ఇంతగా ఆలోచించిన పాలకులు ఎవరూ లేరు. ఐదేళ్లలో చేయాల్సిన పనులను ఏడాదిలోనే చేసి చూపించారు. -ఎం. హేమావతి(రజకురాలు), అనంతపురం నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు వాలంటీర్ నేరుగా మా షాప్‌కు వచ్చి లబ్ధిదారుడిగా ఎంపిక చేశారు. 30 ఏళ్లుగా నేను ఇలాంటి స్కీమ్ చూడలేదు. లబ్ధిదారుల్లో నా పేరు ఉండటం సంతోషాన్ని కలిగించింది. నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు. మీ నాన్న దయగారి వల్ల నాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు మీ దయతో నా మేనల్లుడికి స్థలం వచ్చింది. తరతరాలకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. - పైడియ్య (నాయీ బ్రాహ్మణుడు) - శ్రీకాకుళం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు జగనన్న చోదోడుతో కరోనా సమయంలో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మరో 50 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలి. గ్రామ సచివాలయాలు నిర్మించి ఎంతో మంచిపని చేశారు. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన నాయకుడు వైఎస్ జగన్. మీరు ధన్యులు సార్, మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు. -రామకోటేశ్వరరావు (దర్జీ) - పశ్చిమ గోదావరి -
‘జగనన్న చేదోడు’ ప్రారంభం
సాక్షి, అమరావతి: పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న చేదోడు పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. 3.58 కోట్ల మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, సున్నా వడ్డీ వంటి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చగలిగానని సీఎం జగన్ అన్నారు. (ప్రత్యేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్) -
టైలర్ల సంక్షేమానికి కృషి చేస్తా : డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమ గోదావరి : టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు టైలర్ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. అందరికీ ఆరోగ్య శ్రీ వర్తింపు, అర్హులైన వృద్ధులకు పెన్షన్ సౌకర్యం వంటి సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. టైలర్ల సంఘానికి కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు బాధ్యత తీసుకుంటానని ఆళ్ల నాని వెల్లడించారు. -
‘దర్జా’గా బతికేద్దాం
సాక్షి, జామి (విజయనగరం): దర్జీలు ఇక దర్జాగా బతకనున్నారు. వారికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఏటా రూ.10 వేలు ఇవ్వనుంది. దీని కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. దీని వల్ల శృంగవరపుకోటలో సుమారు 1500 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీంతో దర్జీలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి దర్జీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దర్జీలసంక్షేమం గురించి ఏనాడు పట్టించుకోలేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజులకే ఇచ్చిన మాట ప్రకారం బడ్జెడ్‌లో నిధులు కేటాయించడంపై టైలర్లు ఆనందవ వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు మా కష్టాన్ని గుర్తించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం మాలాంటి కుల వృత్తులు వారికి నిజంగా అదృష్టమని టైలర్లు హర్షాతిరేకాలు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో రెడీమేడ్ దుస్తులు ప్రపంచం రావడంతో గ్రామీణ ప్రాంతాలకు సైతం సోకడంతో జీవన వృత్తిని నమ్ముకున్న టైలర్లు జీవనస్థితి దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం సంప్రదాయపద్ధతులకు ఆధారణ తగ్గడంతో చేతినిండా పనిలేక టైలర్లు రాను, రాను కనుమరుగైపోతున్నారు. రడీమేడ్లో వివిధ రకాల ప్యాషన్లు, డిజైన్లతో దుస్తులు రావడంతో టైలర్లు పనిలేకుండాపోతుందని టైలర్లు వాపోతున్నారు. దీంతో దర్జీలకు పనిలేకుండా తగ్గిపోతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి దర్జీల సంక్షేమంపై చిత్తశుద్ధి చూపడంతో దర్జీల్లో చిగురులు ఆశించాయి. దర్జీలకు దర్జా బతుకులు రాబోతున్నాయని వారు తెలుపుతున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఒకప్పుడు దర్జాగా బతికే దర్జీలు ప్రస్తుతం వారి జీవన విధానం ఆగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా జామి మండలంలో జామిలోనే ఎక్కువుగా చేనేత వృత్తుల వారైన దేవాంగులు చేనేత వృత్తులకు ఆదరణ లేకుండా పోవడంతో వారందరు మగ్గాలను వదిలి ఎక్కువ మంది టైలర్వృత్తిని చేపట్టారు. ప్రస్తుతం టైలర్ వృత్తి కూడా ఆదరణ లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది ఒకప్పుడు టైలరు వృత్తిలో ఉండేవారు. ఇతరత్రా పాంతాలకు కూలి, నాలి ఇతరత్రా పనులకు వెళ్తున్నారు. ఒకప్పుడు మండలంలో 400మందికి పైగా దర్జీలు ఈవృత్తిపై ఆధారపడేవారు. ప్రస్తుతం 200 మంది కుటుంబాలు వారు ఈవృత్తిపై ఆధారపడిఉన్నారు. 1500కుటుంబాలకు లబ్ధి.. శృంగవరపుకోట నియోజకవర్గంలో జామి, ఎల్.కోట, వేపాడ, కొత్తవలస, ఎస్.కోట మండలాల్లో సుమారు 1500 కుటుంబాలు వారికి తాజాగా బడ్జెట్లో కేటాయించిన నిధులతో లబ్ధిచేకూరనుంది. వారికి చేయూతనిచ్చేందుకు ఏడాదికి 10వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందించడం ద్వారా వృత్తి పట్ల గౌరవం పెరుగుతుందని, తమ కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని తెలుపుతున్నారు. 80శాతం మంది వెనుకబడిన తరగతులు వారే ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం ఇన్నాళ్లకు టైలర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు. నిజంగా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. మాకు ఇప్పుడు భరోసా కలిగింది. మా వృత్తిపై గౌరవం పెరుగుతుంది. మొదటి బడ్జెట్లోనే దర్జీల సంక్షేమానికి పెద్దపీట వేయడం అభినందనీయం. – ఎస్.శ్రీను, దర్జీ, లొట్లపల్లి దర్జీలకు ఎంతో ఆసరా దర్జీలకు బడ్జెట్లో నిధుల కేటయించడం, సంవత్సరానికి దర్జీలకు ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రణాళికలు రూపొందించడం మా దర్జీ కుటుంబాలకు ఎంతో ఆసరా. దర్జీల కష్టాలను గుర్తించిన ముక్యమంత్రి ఒక్క జగన్మోహన్రెడ్డే. నిజంగా మా సంక్షేమానికి నిధులు కేటాయించడం మాకు వరం. – అల్లాడ రవికుమార్, టైలర్, జామి -
ఏదీ నాటి దర్జా?
బెల్‌బాటమ్, స్కిన్‌టైట్ ప్యాంట్లు.. పొడవు కాలరుచొక్కాలు.. షార్ట మోడల్ షర్టులు.. రఫ్‌లుక్ డ్రెస్సులు.. ఒకటా.. రెండా.. మోడల్ఏదైనా, కుట్టు ఎలాగున్నా తమదైన శైలిలో దుస్తులు కుట్టిన దర్జీలు ఇప్పుడు ఆ దర్జా కోల్పోయారు. రెడీమేడ్ డ్రెస్సుల రాకతో వీరికాళ్ల కదలికలు ఆగిపోయాయి. టకటకమంటూ పని చేసిన వీరి మిషన్లు రంగురంగుల రెడీమేడ్ డ్రెస్సుల రాకతో మూలకు చేరిపోయాయి. పట్టణాల్లో మొదలై మెల్లగా పల్లె నడిబొడ్డుకు చేరిన రెడీమేడ్ హోరు దర్జీల ఉపాధిని గల్లంతు చేసింది. జీవితాలను ముక్కలు చేసింది. కుట్టు చప్పుడును ఆపేసింది. దర్జీ వృత్తికి వన్నెతెచ్చిన కుట్టు మిషన్‌ను ఆవిష్కరించిన విలియమ్స్హో, విలీఫ్జోన్స్ల స్మారకార్థం ఏటా ఫిబ్రవరి 28న ‘టైలర్స్ డే’ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.. నేడు టైలర్స్ డే ⇒ కష్టాల్లో కత్తెర పట్టిన చేతులు ⇒ టైలర్ల జీవితాల్లో అంధకారం ⇒ గతమెంతో ఘనం .. ప్రస్తుతం దుర్భరం ⇒ రెడీమేడ్ దుస్తుల రాకతో ఉపాధి కరువు షాబాద్/ఘట్కేసర్ టౌన్: ఒకప్పుడు దర్జీ లేని ఊరు లేదంటే అతిశయోక్తి లేదు. మనిషికి హుందాతనాన్ని, అందాన్ని ఇచ్చే దుస్తుల కోసం పట్టణాల నుంచి పల్లెల వరకు అందరూ దర్జీల వద్ద క్యూ కట్టేవారు. పండగలు,పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు దగ్గరుండి మరీ దుస్తులను కుట్టించుకునేవారు. ఇదంతా గతం. రెడీమేడ్ దుస్తుల వైభవం ముందు దర్జీలు కుదేలయ్యారు. యువతను ఆకర్షించే నూతన డిజైన్లలో షర్టులు, జీన్స్ ఫ్యాంటులు, చుడీదార్లు, పంజాబీ డ్రెస్‌లు మార్కెట్లో దిగడంతో కుట్టు చప్పుడు ఆగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత రెడీమేడ్ వైపు ఆకర్షితులవుతుండడంతో దర్జీలకు పని లేకుండా పోయింది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారంతా పని లేక ఖాళీగా దర్శనమిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పేరుమోసిన టైలర్లకు మాత్రమే కాసింత ఆదరణ లభిస్తోంది. అది కూడా కేవలం పండగ సీజన్లలో మాత్రమే. ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే వారికి కాసింతైనా పని దొరుకుతోంది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో కొత్తతరం ఇటువైపు రావడం మానేసింది. ఇదే వృత్తిలో ఉన్నవారు కూడా బతుకు వెతుక్కుంటూ మరోదారి వైపు మళ్లుతున్నారు. ఒకప్పుడు 24 గంటలు పనిచేసిన చేతులకు నేడు పనులు లేకుండా పోయాయి. చేతిలోఉన్న పనిని నమ్ముకోలేక, ఇంకో పనిచేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. నేటి ఫ్యాషన్లు, మెళకువలు నేర్చినవారు మాత్రం కాస్తోకూస్తో నిలదొక్కుకుంటున్నారు. భారీగా పెరిగిన ముడి సరుకుల ధరలు పండుగ సీజన్లలో దొరికే కొద్దిపాటి పనిచేసేందుకు అవసరమయ్యే ముడి సరుకుల ధ రలు పెరగటం దర్జీలకు మరో దెబ్బ. ప్రధా నంగా ముడి సరుకులైన దారాలు, జిప్పులు, హుక్కులు, గుండీలు తదితర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు అదనపు భారంగా మారుతున్నాయి. దీంతో చిన్నపాటి షాపు పెట్టిన యజమానికి అందులో పనిచేసే కార్మికులకు ఇద్దరికీ గిట్టుబాటు కావటం లేదు. ప్రస్తుతం పేరు మోసిన టైలర్లు ఒక జత మగవారి బట్టలు కుట్టి ఇచ్చేందుకు గరిష్టంగా రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. ఇక సూట్లకు అయితే రూ.2వేలు, సఫారీ డ్రెస్‌లకు రూ.700 తీసుకుంటున్నారు. ఆడవారికి పంజాబీ డ్రెస్సులు కుట్టివ్వాలంటే రూ.250 నుంచి వివిధ డిజైన్ల బట్టి ధరలు వసూలు చేస్తున్నారు. అయితే ఇంత మొత్తంలో చెల్లించడానికి విని యోగదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో దర్జీలకు పని దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దర్జీల సంక్షేమానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించాలి.. పెళ్లి, పండుగలు ఇతర సీజన్లలో మాత్రమే పని దొరుకుతోంది. మాకు బ్యాంకుల ద్వారా రుణాలందిస్తే ఆధునిక కుట్టుమిషన్లు కొనుక్కుంటాం. మెరుగ్గా, ఫ్యాషన్‌గా కుట్టి జీవనోపాధి పొందుతాం. - బాల్‌రాజ్, ఘట్‌కేసర్‌టౌన్ పని కరువైంది.. మార్కెట్లోకి రెడీమెడ్ దుస్తులు రావడంతో టైలర్‌కు ఆదరణకు త గ్గింది. గతంలో ప్రతి ఒక్కరూ కుట్టిన దుస్తులే తొడిగేవారు. ప్రస్తుతం షోరూంలలోకి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మాకు పని ఉండడం లేదు. - రమేశ్, షాబాద్ ఆదరణ తగ్గింది.. గతంలో దర్జీ పని చేసే వాళ్ల కు మంచి ఆదరణ ఉండేది. ప్రస్తుతం కొత్తకొత్త షోరూం లు, రెడీమేడ్ దుస్తులు వస్తుండడంతో మాకు గిరాకీ తగ్గింది. కాలానుగుణంగా వస్తున్న వివిధ డిజైన్లను నేర్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. -సాజిత్, షాబాద్ పోటీని తట్టుకోలేకపోతున్నాం రెడీమేడ్ దుస్తులు తయారీదారుైలన బహుళజాతి సంస్థల పోటీని తట్టుకోలేకపోతున్నాం. రెడీమేడ్ దుస్తులను తక్కువ ధరల్లో అందించడంతో కుట్టించుకోవడానికి ఎవరూ ముందుకురావడంలేదు. కుట్టుకూలి డబ్బులతో డ్రెస్‌లే లభిస్తుండడంతో మా దగ్గరికి రావడం లేదు. - తుల్జారాం, ఘట్‌కేసర్‌టౌన్ సీజన్లోనే గిరాకీ.. సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో ఇబ్బందులు పడుతున్నాం. గతంలో సొంతంగా టైలర్ షాపు నడుపుకునేవాడిని. ప్రస్తుతం వేరే షాపులో కూలీ పని చేస్తున్నాను. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడే గిరాకీ ఉంటుంది. - రామస్వామి, షాబాద్