
రెడీమేడ్ వస్త్ర ప్రపంచంతో టైలర్లకు కష్టాలు
గత ప్రభుత్వ హయాంలో జగనన్న చేదోడుతో భరోసా
నేటి కూటమి ప్రభుత్వంలో మొండిచేయి
నేడు ప్రపంచ టైలర్స్ దినోత్సవం
ధరించే దుస్తులతోనే మనిషికి అందం.. హుందాతనం లభిస్తాయి. వస్త్రానికి ఒక ఆకృతిని ఇచ్చి కళాత్మకంగా తీర్చిదిద్దేది దర్జీలే.. ప్రస్తుతం వారికి ఆదరణ తగ్గిపోయింది. మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తులు (Readymade Garments) విపరీతంగా రావడంతో జనం వాటి పట్ల మక్కువ చూపుతున్నారు. దానితో టైలర్లకు ఉపాధి కరువైంది. గతంలో పండగలు, పర్వదినాలు, శుభకార్యాల సమయంలో చేతినిండా పనితో బిజీగా ఉండే దర్జీలు (Tailors) నేడు పనులు లేక వారి కుటుంబాల పోషణ కష్టమై ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 5,478 మంది టైలర్లు ఉన్నారు. చిన్న గదుల్లో షాపులు పెట్టుకుని వచ్చే అరకొరమందికి దుస్తులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు.
ఒకప్పుడు ప్రతీ పండగకు ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దీపావళి, క్రిస్మస్, రంజాన్, బక్రీద్ తదితర పండగలకు, పలు పర్వదినాలకు, కుటుంబాల్లో వివిధ శుభకార్యాలకు ఇంటిల్లిపాదీ కొత్త వస్త్రాలు తెచ్చుకుని కుట్టించుకునేవారు. ఆయా పండుగలకు నెల ముందు నుంచే టైలర్లకు పని ఎక్కువగా ఉండేది. భోజనం చేసే తీరిక కూడా లేకుండా పనిచేసేవారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. దుస్తులు కుట్టించుకునేవారే కరవయ్యారు.
మార్కెట్లో రెడీమేడ్ దుస్తుల దుకాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకొక ఫ్యాషన్‌తో దుస్తులను ఫ్యాక్టరీల్లో తయారుచేసి మార్కెట్‌లోకి దించుతున్నారు. దీంతో ఆ దుకాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కువ మంది అప్పటికప్పుడు ఆ దుకాణాలకు వెళ్లి తమకు కావలసిన దుస్తులను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టైలర్లు పనులు లేక ఆ వృత్తిని వదిలేసి బతుకు జీవుడా అంటూ ప్రత్యామ్నాయ వృత్తులు వెతుక్కుని జీవనం సాగిస్తున్నారు.
గతంలో ఆదుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
పనులు తగ్గిపోయి కష్టాల్లో నలిగిపోతున్న టైలర్లను గత వైఎస్సార్ సీపీ (YSRCP) ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. చేతి వృత్తుల వారి కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక భరోసా కల్పించింది. దానిలో భాగంగా ప్రతీ టైలర్‌కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం చేసింది. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో సుమారు 5,478 మంది టైలర్ల లబ్ధి పొందారు. ఈ విధంగా ఏడాదికి సుమారు రూ.5.48 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసేవారు.

అంతేకాక ప్రతీ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాం క్లాత్ అందచేసి, దుస్తుల కుట్టుకూలీ డబ్బులను కూడా చెల్లించేది. ఆ విధంగా కూడా టైలర్లకు ఉపాధి లభించేది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టైలర్ల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. గత ప్రభుత్వం మాదిరిగానే టైలర్లకు చేయూతనిస్తే ఆర్థిక తోడ్పాటుతో పాటు యూనిఫాం దుస్తుల ద్వారా కొంతవరకై నా ఉపాధి లబిస్తుందని టైలర్లు అభిప్రాయపడుతున్నారు.
నేడు ప్రపంచ టైలర్స్ దినోత్సవం
ఏటా ఫిబ్రవరి 28న కుట్టుమెషీన్ సృష్టికర్త విలియమ్ ఎలియాస్ హోవే జయంతిని ప్రపంచ దర్జీల దినోత్సవం (టైలర్స్ డే) గా జరుపుకుంటున్నారు. దర్జీ చేతి పనిని, వస్త్ర పరిశ్రమలో వారిని గౌరవిస్తూ ఈ రోజును జరుపుకుంటారు. కుట్టుమెషీన్‌ను కనిపెట్టి తమ జీవనానికి దారి చూపిన విలియమ్ పట్ల విశ్వాసం, గౌరవంతో నియోజకవర్గ కేంద్రం కొత్తపేటలో టైలర్స్ కొన్నేళ్ల క్రితం స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆ మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏటా ప్రపంచ టైలర్స్ డే (World Tailors Day) నాడు విలియమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పిస్తారు.
చదవండి: ప్రజల చేతిలో ఆయుధం సైన్స్
ఇదే జీవనాధారం
టైలరింగ్ పనిమీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. రెడీమేడ్ దుస్తుల రాకతో వస్త్రం కొనుగోలు చేసి కుట్టించుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తి రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతోంది. కుట్టు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం చేతి వృత్తిదారులను ఆదుకోవాలి. విద్యార్థులకు యూనిఫాం క్లాత్ ఇస్తే టైలర్లకు కొంతవరకై నా పని దొరుకుతుంది.
– అవిడి వీరవెంకట సత్యనారాయణ, టైలర్, కొత్తపేట
Comments
Please login to add a commentAdd a comment