Kottapeta
-
సీత క్షమించింది..!
సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రజా సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా జరుగుతున్న మేలు గురించి ఓ మహిళ వివరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు, సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటివద్దే అందుతున్న సౌకర్యాల గురించి ప్రస్తావిస్తూ పాలనలో వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది. అయితే.. విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కొండెంపూడికి చెందిన జనసేన సానుభూతిపరులైన ఇద్దరు యువకులు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. రావికమతం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దంట్ల నాగసీత వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బీటెక్ చదువుతున్న ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో కేసును వాపసు తీసుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆమెను ప్రాధేయపడ్డారు. ఆ యువకులు ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు మరోసారి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయబోమని పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది. (డాక్టర్ సుధాకర్ పోలీసుల అదుపులో లేరు) -
స్పిన్నింగ్ మిల్లులో పడి మహిళ మృతి
సాక్షి, పశ్చిమగోదావరి : స్పిన్నింగ్ మిల్లు మిషన్‌లో పడి ప్రమాదవశాత్తూ మహిళ తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పెరవలి ఎస్సై డీవై కిరణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లికి చెందిన అల్లాడి వెంకటలక్ష్మి (46) పెరవలి మండలం మల్లేశ్వరం ఎస్వీఆర్ స్పిన్నింగ్ మిల్లులో కూలీగా పనిచేస్తోంది. శుక్రవారం వేకువజాము షిప్ట్‌లో పనిచేస్తున్న వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తూ మిషన్‌లో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలందిస్తుండగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుమారుడు అల్లాడి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పెన్సిల్ ముల్లుపై షిర్డీసాయిబాబా
గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా ఒక కళాకారుడు పెన్సిల్ ముల్లుపై షిర్డీసాయిబాబాను చెక్కాడు. కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన లంక వీరభద్రం అనే కళాకారుడు పెయింటింగ్స్ వేస్తాడు, సుద్దముక్కలు, సబ్బులపై బొమ్మలు చెక్కుతాడు. ఇటీవలే పెన్సిల్ ముల్లుపై వరల్డ్‌కప్ తదితర చిత్రాలను కూడా తీర్చిదిద్దాడు. మంగళవారం గురుపౌర్ణమి సందర్భంగా పెన్సిల్ ముల్లుపై సాయిబాబా రూపాన్ని చెక్కి భక్తిని చాటుకున్నాడు. -
కొత్తపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ప్రచారం
-
నీట మునిగి నలుగురు పిల్లలు మృతి
వరంగల్: నీటికుంటలో పడి నలుగురు విద్యార్థులు మృతి చెందిన దుర్ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ మండలం కొత్తపేటలోని ఈదులకుంటలో ఈతకు వెళ్లి నలుగురు మృ త్యువాతపడ్డారు. వరంగల్ సుందరయ్యనగర్‌కు చెందిన ముస్లిం కుటుంబాలు ప్రతి ఏడాది ఆఖ్రీ చార్‌షాంబ (ఆఖరి బుధవారం) నాడు వంటలకు వెళ్తారు. ఆ ఆనవాయితీ ప్రకారం కొన్ని ముస్లిం కుటుంబాలు కొత్తపేట సమీపంలోని తాటివనానికి వనభోజనాలకు వెళాయి. భోజనాలు చేశాక ఎండి.రంజాన్(16), ఎండి.నదీంపాషా(16), ఎండి.రసూల్(13), ఎండి.యాకుబ్‌పాషా(13) నలుగురు పిల్లలు ఈదులకుంటలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. ఇద్దరిని కాపాడబోయి.. మరో ఇద్దరు.. తొలుత నదీంపాషా, రంజాన్లు నీటిలో లోతున్న ప్రాంతానికి వెళ్లారు. వారు నీటిలో మునిగిపోతుండటం చూసి ఒడ్డు పైనున్న రసూల్, యాకుబ్‌పాషాలు చేయందించి, బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నలుగురు నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న యాకుబ్‌పాషా తమ్ముడు ఎండి.రహేల్ పెద్దలకు ఈ విషయం చెప్పాడు. వారు అక్కడికి చేరుకునేప్పటికే పిల్లలు నీటిలో మునిగిపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. రంజాన్, నదీంలు పదో తరగతి చదువుతుండగా, రసూల్, యాకుబ్‌పాషా ఎనిమిదో తరగతి చదువుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ, పరకాల ఏసీపీ సుధీంద్రలు సందర్శించారు. -
ప్రైవేట్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
ఖాజీపేట: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాకొట్టిన ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఖజీపేట మండలం పి. కొత్తపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కొత్తపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
అపురూప ‘కలాం’
విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నిలువెత్తు ఫైబర్ విగ్రహం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. కలాం కాంస్య, ఫైబర్ విగ్రహాల తయారీకి రాష్ట్రం నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయని రాజ్‌కుమార్ సోమవారం విలేకరులకు తెలిపారు. గుంటూరు జిల్లా కనపర్తి ఎంఐసీఈ స్కూల్ ఆవరణలో నెలకొల్పేందుకు ఆ స్కూల్ యాజమాన్యం ఆర్డర్ మేరకు రూపొందించిన నిలువెత్తు ఫైబర్ విగ్రహాన్ని ఈ నెల 15న ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా కలాం జయంతికి రెండు ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆయన బస్ట్ సైజ్ విగ్రహాలు బహూకరించనున్నట్టు రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది కొత్తపేట, రాజమండ్రి కళాశాలలకు అందచేయనున్నట్టు తెలిపారు. - కొత్తపేట -
హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం
కొత్తపేట : దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిన ఆలయ హుండీల లెక్కింపు సందర్భంగా ఆ శాఖ ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఉదంతమిది. కొత్తపేట ఎస్సై డి. విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వానపల్లి గ్రామ దేవత పల్లాలమ్మ అమ్మవారి ఆలయం హుండీలను బుధవారం లెక్కించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈవో వెత్సా దేముళ్లు ఆధ్వర్యంలో రాజమండ్రి దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎ.శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ పల్లిభీమారావు సమక్షంలో బుధవారం పలువురు గ్రామస్తులు హండీలను లెక్కించారు. ఓ హుండీనీ తెరచి దానిలో ఉన్న నగదును, వస్తువులను బయటకు తీసే సమయంలో వాడపాలెం బండారు పేరమ్మగారి స్వామి అన్నదానం సత్రం గుమాస్తాగా పని చేస్తున్న సిహెచ్ఎన్ఎస్ఎస్ ప్రసాద్ 9 గ్రాముల 3 మీల్లీ గ్రాముల బరువు గల రెండు పెద్దవి, రెండు చిన్నవి మంగళ సూత్రాలను బయటకు తప్పించేందుకు యత్నించారు. పక్కనే ఉన్న పువ్వుల కుండీలో వేశారు. దీనిని పలువురు గ్రామస్తులు గుర్తించారు. వెంటనే అతనిని నిలదీయగా తాను ఏ వస్తువులూ తప్పించలేదని వాదించగా గట్టిగా నిలదీయడంతో తప్పును అంగీకరించాడు. పక్కనేఉన్న పువ్వుల కుండీలో పడ వేసిన మంగళ సూత్రాలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈవో వెత్సా దేముళ్లు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు. -
కృష్ణుడి రూపంలో 13 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం
కొత్తపేట : విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ఖ్యాతినందిన మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని రూపొందించనున్నట్టు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను రూపొందించి న అదే తరహా విగ్రహాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్ట్ కొవిన్(కాలిఫోర్నియా)లో నెలకొల్పేందుకు ఇప్పటికే తరలించినట్టు చెప్పారు. ఆ విగ్రహం ఫొటోను ‘సాక్షి’లో చూసిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అలాంటిదే రాజమండ్రిలో పుష్కరఘాట్ వద్ద పాత, కొత్త రైలు వంతెనల మధ్య నెలకొల్పాలని ప్రతిపాదించగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారని తెలిపారు. విగ్రహం రూపకల్పనకు ఎంపీఆర్డర్ ఇచ్చారని, దానికయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. సుమారు 12 అడుగుల పెడెస్టల్‌పై విగ్రహాన్ని నెలకొల్పే చోటును ఇప్పటికే ఎంపీ మురళీమోహన్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి పరిశీలించినట్టు తెలిపారు. -
అనుమానం పెనుభూతమై..
చెల్లూరు/కొత్తపేటకాలనీ (రాయవరం) :అనుమానం మనిషిలోని విచక్షణను అణగదొక్కి పశుత్వాన్ని మేల్కొలిపిందది. 25 సంవత్సరాలు భార్యాభర్తలుగా గడిపిన అనంతరం 65 ఏళ్ల వయస్సులో భర్త అనుమానంతో భార్యను విచక్షణా రహితంగా కొట్టి చంపిన ఘటనతో స్థానికులు నివ్వెరపోయారు. మండలంలోని వెంటూరు శివారు కొత్తపేటకు చెందిన గుత్తుల సూర్యారావుకు కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన వీర్రాఘవ(44) కు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటికే వివాహమైన సూర్యారావుకు భార్య చనిపోవడంతో వీర్రాఘవను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి జన్మించిన కుమార్తె లావణ్యకు వివాహం కూడా చేశారు. సూర్యారావు, తన భార్యతో కలసి చెల్లూరు గ్రామ శివార్లలో కూర్మాపురం వెళ్లే రహదారి పక్కన ఉన్న మార్ని అచ్చిబాబుకు చెందిన పశువుల చావిడి వద్ద కమతం ఉంటున్నారు. సూర్యారావు ఇటీవల కాలంలో భార్య వీర్రాఘవపై అనుమానం పెంచుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో సూర్యారావు భార్య వీర్రాఘవను విచక్షణా రహితంగా కర్రతో కొట్టినట్టు తెలుస్తోంది. తాను భార్యను చితక్కొట్టానని పలువురికి చెప్పడంతో స్థానికులు వీర్రాఘవను చూశారు. అప్పటికే గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు సమాచారం. దీంతో ఆమె మృతదేహాన్ని రాత్రి సమయంలో వెంటూరు శివారు కొత్తపేటలో ఉన్న ఇంటికి తరలించారు. శనివారం ఉదయం ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. మృతురాలి బంధువులు కొత్తపేట వచ్చారు. తానే చంపేశానని, ఇప్పుడు ఏమి చేస్తారని సూర్యారావు ఎదురు తిరగడంతో మృతురాలి వీర్రాఘవ బంధువులు పట్టుకుని చితక్కొట్టారు. కన్నీళ్లు పెట్టిన స్థానికులు మృతదేహంపై ఉన్న గాయాలు చూసిన స్థానికులు, మృతురాలి బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కాళ్లు, చేతులపై బలమైన గాయాలు ఉండగా, కొట్టిన దెబ్బలకు ఒళ్లంతా కమిలిపోయిందని గాయాలు చూసిన స్థానికులు ఆవేదన చెందారు. సూర్యారావు కర్రతో కొట్టే సమయంలో చేతులు అడ్డుపెట్టగా చేతి వేళ్లు కూడా విరిగిపోయాయి. ఊరికి దూరంగా ఉన్న పశువుల చావిడిలో దెబ్బలకు తాళలేక పెట్టిన రోదనలు తలచుకుని స్థానికులు కంటతడి పెట్టారు. సూర్యారావు కర్కశత్వాన్ని తలచుకుని ఇన్నాళ్లూ మన మధ్యన గడిపిన వ్యక్తిలో ఇంత రాక్షసత్వం గూడుకట్టుకుని ఉందా? అని విస్తుపోయారు. హత్య కేసు నమోదు మండపేట రూరల్ సీఐ పుల్లారావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో భర్త సూర్యారావు భార్య వీర్రాఘవను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి నిందితుడు సూర్యారావును అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై కట్టా శ్రీనివాసరావు తెలిపారు. -
కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి అస్వస్థత
కొత్తపేట : వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన కొత్తపేట(తూర్పు గోదావరి) ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ నిర్విరామం గా అనేక అధికారిక, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఓ కార్యకర్తను పరామర్శిం చేందుకు రాత్రి ఆత్రేయపురం వెళుతున్న సమయంలో ఆయన ముక్కుపుటాల నుంచి రక్తం స్రవించింది. దాన్ని తుడుచుకుంటుండగానే స్రావం తీవ్రమై నేప్కిన్తో పాటు షర్టు, ప్యాంటు రక్తంతో తడిసిపోయాయి. ఆయన తో ఉన్న నాయకులు, సన్నిహితులు ఆందోళనకు గురై వెంటనే రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కార్డియాలజిస్టు ఎన్ఎస్ రామరాజు పర్యవేక్షణలో రక్తస్రావాన్ని అరికట్టేందుకు చికిత్స చేశారు. విపరీతమైన అలసట, రక్తపోటు పెరగడం వల్ల రక్తస్రావమైనట్టు నిర్ధారించిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చారు. ఈఎన్టీ స్పెషలిస్టు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా జగ్గిరెడ్డికి వివిధ పరీక్షలు జరి పారు. స్వస్థత చేకూరడంతో జగ్గిరెడ్డి ఆది వారం మధ్యాహ్నం గోపాలపురంలోని స్వగృహానికి తిరిగి వచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉద యం జగ్గిరెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. ఏ విషయంలోనూ ఒత్తిడికి లోనుకావద్దని సూచించారు. వాకింగ్, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని, హైదరాబాద్ వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు, నాయకుల పరామర్శ అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరామర్శించారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పినిపే విశ్వరూప్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ నాయకులు కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావు తదితరులు ఫోన్లో పరామర్శించారు. జగ్గిరెడ్డిని పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, కొల్లి నిర్మలకుమారి, జక్కంపూడి రాజా, జక్కంపూడి చిన్ని ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, బండారు సత్తిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోరం జయకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు ధర్నాల రామకృష్ణ, ఆలమూరు ఎంపీపీ కొత్తపల్లి వెంకటలక్ష్మి దుర్గారావు తదితరులు ఉన్నారు. -
మందలించాడని..‘మండి’పోతివా బిడ్డా!
ఉపాధ్యాయుడు తప్పుపట్టాడని టెన్ విద్యార్థిని ఆత్మాహుతి ‘ఏ తప్పూ చేయలేదు.. క్షమించండి’ అని సూసైడ్ లెటర్ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన బంధువులు, స్థానికులు మృతదేహంతో రాస్తారోకో, నిర్భయ చట్టం కేసుకు డిమాండ్ కొత్తపేట :ఓ ఉపాధ్యాయుడు పెడుతున్న మానసిక హింసను తప్పించుకోవడానికి మరణమే శరణ్యమనుకుందా బాలిక. నోట్స్ రాయాల్సిన కలంతో సూసైడ్ నోట్ రాసింది. ఒకేఒక్క అగ్గిపుల్లతో నూరేళ్ల నిండుజీవితానికి నిప్పు పెట్టుకుంది. ‘ఏ తప్పూ చేయలేదు’ అంటూనే ఈ లోకం నుంచి తప్పుకుంది. కన్నవారికి ఎన్నటికీ చల్లారని వేదనాగ్నిని మిగిల్చింది. కొత్తపేట మండలం పలివెలలో పదో తరగతి విద్యార్థిని బండి రేణుక బుధవారం మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. తన ఆత్మహత్యకు నాగభూషణం అనే ఉపాధ్యాయుని వేధింపులే కారణమని రేణుక సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల పైపూరివారి వీధికి చెంది బండి ధనరాజు, లక్ష్మి దంపతులకు కుమార్తె రేణుక, కుమారుడు జగదీష్ మణికంఠ ఉన్నారు. ధనరాజు ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నాడు. బిళ్లకుర్రు శివారు కొత్తపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో రేణుక పదో తరగతి, మణికంఠ ఏడో తరగతి చదువుతున్నారు. ఒంట్లో బాగోలేదని రేణుక బుధవారం ఇంటి వద్దే ఉండగా, మణికంఠ స్కూలుకు వెళ్లాడు. తల్లి మందుల కోసం కొత్తపేట వెళ్లింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రేణుక ఇంట్లో ఉన్న సుమారు 5 లీటర్ల కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు చూసిన పక్కింటి మామిడిశెట్టి సూరిబాబు పరుగుపరుగున వచ్చి చూసేసరికి రేణుక మంటల్లో కాలి, మృతి చెందింది. ఇంతలో వచ్చిన తల్లి లక్ష్మి, బంధువులు జరిగిన ఘోరాన్ని చూసి గొల్లుమన్నారు. ఇంట్లో లభించిన 4 పేజీల సూసైడ్ లెటర్లో ‘అమ్మ, నాన్న, పెద్దంకులు, అమ్మమ్మ, తాతయ్య మీరందరూ నన్ను క్షమించండి’ అని మొదలు పెట్టి ‘నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను అందరూ క్షమించాలి. నాగభూషణం సార్ నేను తప్పు చేయలేదని ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు. ఇంకా లేనిపోనివి అన్నీ అంటున్నారు’ అని రాసింది. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు, స్థానికులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు వై.నాగభూషణానికి దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చి నాగభూషణాన్ని అదుపులోకి తీసుకుని కొత్తపేట పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. రేణుక మృతదేహాన్ని ఎస్సై ఎ.బాలాజీ పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ సమీపంలో రాస్తారోకో రేణుక ఆత్మహత్యకు కారకుడైన ఉపాధ్యాయుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, పలువురు పలివెల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్ద ఉన్న రేణుక మృతదేహాన్ని తీసుకువచ్చేసి, పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్అండ్బీ రోడ్డుపై ఉంచి సాయంత్రం 4 గంటల నుంచి రాస్తారోకో చేశారు. డీఎస్పీ వచ్చి తాము కోరినట్టు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. వారికి మద్దతుగా పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఇన్చార్జి సీఐ శ్రీనివాస్ వచ్చి ఉపాధ్యాయునిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సెక్షన్ మార్చి, కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో రాత్రి 8 గంటల సమయంలో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని తిరిగి ఆస్పత్రికి తరలించారు. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు 306 సెక్షన్‌తో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. చలించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బాలిక ఆత్మహత్య గురించి తెలిసిన స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి వచ్చి, మృతదేహాన్ని చూసి, చలించిపోయారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆకుల రామకృష్ణ, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు దర్ణాల రామకృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, టీడీపీ నాయకుడు కోరం జయకుమార్, ఎంపీడీఓ పి.వీణాదేవి, ఎంఈఓ వై.సత్తిరాజు తదితరులు మృతదేహాన్ని చూసి, బాలిక కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
యువకుడిని బలిగొన్న గూడ్స్ ఆటో
మోడేకుర్రు (కొత్తపేట) : బాధలో ఉన్న తల్లీబిడ్డలకు సాయం చేయాలన్న తలంపుతో.. వారిని తీసుకుని మోటార్ బైక్‌పై ఆస్పత్రికి బయలుదేరిన యువకుడిని గూడ్స ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద సంఘటన మోడేకుర్రులోని మహాలక్ష్మి నగర్ వద్ద మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో ఇంకా ముగ్గురికి తీవ్రంగాను, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట మండలం వాడపాలెం పెదపేటకు చెందిన నక్కా వరలక్ష్మి కుమార్తె ఏడేళ్ల మౌని అనారోగ్యంతో బాధపడుతోంది. ఎదురింట్లో ఉంటున్న గెడ్డం వరప్రసాద్(21) సాయంతో అతడి బైక్‌పై వరలక్ష్మి తన కుమార్తెను తీసుకుని అమలాపురంలో ఉన్న ఆస్పత్రికి బయలుదేరింది. మోడేకుర్రు మహాలక్ష్మి నగర్ వద్ద అమలాపురం నుంచి రాజమండ్రి వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకుం టోంది. బస్సును ఓవర్టేక్ చేస్తూ.. అంబాజీపేట నుంచి కొత్తపేట వైపు వెళ్తున్న ఖాళీ గూడ్స ఆటో ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో వరప్రసాద్, వరలక్ష్మితో పాటు అంబాజీపేట మండలం గున్నేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దొమ్మేటి వెంకట లక్ష్మీనారాయణ, అంబాజీపేట కొర్లపాటివారిపాలేనికి చెందిన కముజు సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108లో అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ గాయమైన వరప్రసాద్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. వరలక్ష్మి కుమార్తె మౌని, ఆటోలో ఉన్న నంద్యాల దుర్గారావు అనే వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. వీరు కూడా అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరప్రసాద్ తల్లి సత్యవతి మూ డేళ్ల క్రితం విద్యుదాఘాతంతో, తండ్రి లాజరు కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో వరప్రసాద్ కుటుంబానికి ఆధారమయ్యాడు. అతడికి ఇద్దరు అక్కయ్యలు, చెల్లి ఉన్నారు. అక్కయ్యలు కువైట్‌లో ఉండగా, వరప్రసాద్ చిన్న కారులో ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తూ చెల్లెలికి పెళ్లి చేశాడు. -
కలతచెంది అక్క.. కాపాడబోయి చెల్లెలు
కొత్తపేట : భర్తతో మనస్పర్థల వల్ల పుట్టింటిలో ఉంటూ మానసిక వేదనకు గురైన ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఆమెను అడ్డుకోబోయిన చె ల్లెలు కూడా గల్లంతైన ఘటన కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వాడపాలెం పాత మార్కెట్ ప్రాంతానికి చెందిన పడాల సత్యనారాయణ, జానికమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుమార్తెల పేర్లు నాయుడు మాధవి (33), పడాల వెంకటలక్ష్మి (25). పెద్ద కుమార్తె మాధవిని నాలుగేళ్ల క్రింతం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన నాయుడు రాజకుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. అయితే ఆ తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో మాధవి పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటుంది. భర్త రాజకుమార్ కువైట్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కలత చెందిన మాధవి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి వెనుక నుంచి వెళ్లే బొబ్బర్లంక- ముక్తేశ్వరం కాలువ వద్దకు వెళ్లి అందులోకి దూకడానికి సిద్ధమైంది. ఇంతలో వచ్చిన చెల్లెలు ఆమెను కాపాడేందుకు చేతిని పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కాలువలో పడిపోయి కొట్టుకుపోయారు. స్థానికులు వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు. బండారు పేట వద్ద అక్క మాధవి మృతదేహం లభ్యమైంది. వెంకటలక్ష్మి కోసం గాలింపు జరుగుతోంది. స్థానికుల సమాచారం మేరకు కొత్తపేట ఎస్సై ఎ.బాలాజీ ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
టిక్కెట్ కలెక్షన్ .. యమ టెన్షన్
కొత్తపేట, న్యూస్‌లైన్ :ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ కం కండక్టర్ డ్యూటీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటంగా మారిం ది. కొన్ని దూర ప్రాంత సర్వీసులకు కండక్టరు లేకుండా టూ ఇన్ వన్ మాదిరిగా వేస్తున్న డ్యూ టీలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. విజయవాడ - కాకినాడ, గుంటూరు - అమలాపురం వంటి దూర ప్రాంత సర్వీసులకు కండక్టరు లేకుండా ఆ పని కూడా డ్రైవర్‌కే అప్పగించడం వల్ల ఆర్టీసీకి ఒక ఉద్యోగి కలిసి వస్తాడు. డ్రైవర్ బస్సు నడుస్తుండగానే టికెట్ ఇచ్చే పనిలో నిమగ్నమై ఉండడంతో ప్రమాదాలు సంభవించేలా ఉన్నాయి. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ-కాకినాడ వయా మండపేట, రామచంద్రపురం డీలక్స్ బస్ సర్వీసు రావులపాలెం నుంచి కాకినాడ గంటన్నర సమయంలో చేరుకోవాలి. కానీ రెండున్నర గంటలు సమయం పట్టింది. టూ ఇన్ వన్ డ్యూటీ కాకుండా సాధారణంగా డ్రైవర్, కండక్టరు సర్వీసు బస్ అయితే నిర్ణీత సమయానికే చేరుకుంటుంది. కానీ రెండు డ్యూటీలు ఒక్కరే (డ్రైవర్) చేయడం వల్ల గంట ఆలస్యంగా గమ్యానికి చేరుకుంది. అదనంగా గంట సేపు ప్రయాణికులు బస్సులో అసౌకర్యానికి గురవుతున్నారు. ఆలమూరు-రామచంద్రపురం మధ్య చాలా వరకు ఓ వైపు పంట కాలువలు, మరో వైపు డ్రెయిన్ మధ్యలో రెండు లైన్ల రహదారి ఉన్నాయి. ఆదివారం ఓ బస్సు సర్వీసులో డ్రైవర్ స్టీరింగ్ వదిలి సొమ్ము లెక్క పెడుతుండడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రమాదాలు రెప్పపాటులో జరిగే అవకాశం ఉందని వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ విధానం బస్సులోని సుమారు 55 మంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం కాదా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ కం కండక్టరు విధానం రద్దు చేసి ఎవరి డ్యూటీ వారు చేసేలా ఇద్దరితో సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తపేట, న్యూస్‌లైన్ : కొత్తపేట మండలం పలి వెల వంతెన సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అమలాపురం శ్రీరామపురానికి చెందిన ఎం డూరి నాగవెంకట సుబ్బారావు తన భార్య రామతులసి,మూడేళ్ల పాపతో కలసి టీవీఎస్ మోపెడ్‌పై అమలాపురం వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆర్అండ్బీ గైడ్ స్టోన్‌ను ఢీకొన్నాడు. సుబ్బారావు (31) తలకు తీవ్రగాయమై పడిపో యాడు. అతడి భార్య తులసి స్పృహ తప్పి పడిపోయనట్టు భావించి, కొత్తపేటలోని తమ బంధువులకు ఫోన్ చేసింది. వారు సంఘటనస్థలానికి చేరుకుని తులసిని కొత్తపేట పంపించారు. సుబ్బారావును ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏఎస్సై ఎ.గరగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బారావు హోల్‌సేల్ మెడికల్ వ్యాపారి. పండగకు తణుకు అత్తవారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
సీఎం రికమండేషన్ ఉందా?
కొత్తపేట, న్యూస్‌లైన్ : ప్రతి మనిషీ ఓ తల్లి ప్రసవవేదన అనంతరం కన్ను తెరిచిన వాడే. అయితే కళ్లు నెత్తికెక్కిన ఆ ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆ మాటే మరిచారు. పురిటి నొప్పులతో వచ్చిన ఓ నిండు గర్భిణిని తమ వెటకారపు మాటలతో అంత కన్నా నొప్పించారు. ‘సీఎం రికమండేషన్ ఉందా, ఎమ్మెల్యే రికమండేషన్ ఉందా’ అంటూ ఆమెను పరిహసించారు. పోనీ, సూటీపోటీ మాటలంటే అన్నారు, అసలు ఆ నిండు చూలాలిని ఆస్పత్రిలో చేర్చుకున్నారా అంటే అదీ లేదు. దాంతో ఆమె ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం బాధితురాలి చెల్లెలు జనిపిరెడ్డి నాగలక్ష్మి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన నాగా సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమార్తె యర్రంశెట్టి సత్య అత్తవారి ఊరైన కేదారిలంక నుంచి రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ఆమెకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె చెల్లెలు జనిపిరెడ్డి నాగలక్ష్మి సాయంతో కొత్తపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఇద్దరు నర్సులు ఉన్నారు. వీరిలో ఓ నర్సు ‘ఇప్పుడు డాక్టరు ఉండరు, ఉదయం తీసుకురండి’ అని చెప్పింది. పురిటినొప్పులు వస్తున్నాయని, వెంటనే ఆస్పత్రిలో చేర్చుకోవాలని నాగలక్ష్మి ప్రాధేయపడింది. దాంతో ‘సీఎం రికమండేషన్ ఉందా, ఎమ్మెల్యే రికమండేషన్ ఉందా’ అంటూ ఆ నర్సు హేళనగా మాట్లాడారు. త మకు తెలిసిన నాయకులతో ఫోన్ చేయిస్తామని నాగలక్ష్మి చెప్పింది. విషయం తెలుసుకున్న డ్యూటీ డాక్టర్ వచ్చి గర్భిణిని పరీక్షించాడు. బిడ్డ అడ్డం తిరిగిందని, రాజమండ్రి తీసుకువెళితే ఆపరేషన్ చేస్తారని చెప్పారు. అంతే కాక గర్భిణితో పాటు తోడుగా ఉన్నవారికి కూడా భోజనం పెడతారని హేళనగా మాట్లాడారు. పేద కుటుంబానికి చెందిన వాళ్లను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించుకోవాల్సిందిపోయి, ఎగతాళిగా మాట్లాడారని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసిం ది. గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఆపరేషన్ చేసి బిడ్డను తీశారని పేర్కొంది. ఈ సంఘటనపై విచారణ జరిపి, కొత్తపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
తండ్రీకొడుకులపై హత్యాయత్నం
కొత్తపేట, న్యూస్‌లైన్ :పాత కక్షల నేపథ్యంలో తండ్రీకొడుకులపై ప్రత్యర్థులు మారణాయుధాలతో హత్యాయత్నం చేసిన ఉదంతమిది. కొత్తపేట ఎస్సై ఎ.బాలాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట మండలం పలి వెల పెదపేటకు చెందిన సాదే నాగేశ్వరరావు, అతడి కుమారుడు రాజ్‌కుమార్ వ్య వసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి పై అదే గ్రామానికి చెందిన వస్కా వెంకన్నతో పాటు ఆరుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డా రు. ఇరువర్గాల మధ్య పాత గొడవలున్నా యి. మంగళవారం అర్ధరాత్రి నాగేశ్వరరావు ఇంటి ముందు రాజ్‌కుమార్, అతడి చెల్లెలు ముగ్గులు పెడుతున్నారు. అదే సమయంలో వస్కా వెంకన్న, అతడి వర్గీయులు అక్కడకు వెళ్లి వారి ముగ్గులను పాడు చేశారు. దీంతో సాదే నాగేశ్వరరావు, వస్కా వెంకన్న వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వెంకన్న వర్గీయులు కర్రలు, కత్తులతో నాగేశ్వరరావు, రాజ్‌కుమార్‌లపై విరుచుకుపడ్డారు. నాగేశ్వరరావుకు ఎడమ డొక్కలో, రాజ్‌కుమార్‌కు మూడు చోట్ల కత్తిపోట్లయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వీరిని స్థానికులు కొత్తపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించగా ప్రా థమిక చికిత్స జరిపి ఉన్నత వైద్యం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి రెండు కత్తులు, గొడ్డలి, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరా రీలో ఉన్నారు. సంఘటన స్థలాన్ని రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు పరి శీలించారు. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.