చెల్లూరు/కొత్తపేటకాలనీ (రాయవరం) :అనుమానం మనిషిలోని విచక్షణను అణగదొక్కి పశుత్వాన్ని మేల్కొలిపిందది. 25 సంవత్సరాలు భార్యాభర్తలుగా గడిపిన అనంతరం 65 ఏళ్ల వయస్సులో భర్త అనుమానంతో భార్యను విచక్షణా రహితంగా కొట్టి చంపిన ఘటనతో స్థానికులు నివ్వెరపోయారు.
మండలంలోని వెంటూరు శివారు కొత్తపేటకు చెందిన గుత్తుల సూర్యారావుకు కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన వీర్రాఘవ(44) కు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటికే వివాహమైన సూర్యారావుకు భార్య చనిపోవడంతో వీర్రాఘవను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి జన్మించిన కుమార్తె లావణ్యకు వివాహం కూడా చేశారు. సూర్యారావు, తన భార్యతో కలసి చెల్లూరు గ్రామ శివార్లలో కూర్మాపురం వెళ్లే రహదారి పక్కన ఉన్న మార్ని అచ్చిబాబుకు చెందిన పశువుల చావిడి వద్ద కమతం ఉంటున్నారు. సూర్యారావు ఇటీవల కాలంలో భార్య వీర్రాఘవపై అనుమానం పెంచుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో సూర్యారావు భార్య వీర్రాఘవను విచక్షణా రహితంగా కర్రతో కొట్టినట్టు తెలుస్తోంది.
తాను భార్యను చితక్కొట్టానని పలువురికి చెప్పడంతో స్థానికులు వీర్రాఘవను చూశారు. అప్పటికే గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు సమాచారం. దీంతో ఆమె మృతదేహాన్ని రాత్రి సమయంలో వెంటూరు శివారు కొత్తపేటలో ఉన్న ఇంటికి తరలించారు. శనివారం ఉదయం ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. మృతురాలి బంధువులు కొత్తపేట వచ్చారు. తానే చంపేశానని, ఇప్పుడు ఏమి చేస్తారని సూర్యారావు ఎదురు తిరగడంతో మృతురాలి వీర్రాఘవ బంధువులు పట్టుకుని చితక్కొట్టారు.
కన్నీళ్లు పెట్టిన స్థానికులు
మృతదేహంపై ఉన్న గాయాలు చూసిన స్థానికులు, మృతురాలి బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కాళ్లు, చేతులపై బలమైన గాయాలు ఉండగా, కొట్టిన దెబ్బలకు ఒళ్లంతా కమిలిపోయిందని గాయాలు చూసిన స్థానికులు ఆవేదన చెందారు. సూర్యారావు కర్రతో కొట్టే సమయంలో చేతులు అడ్డుపెట్టగా చేతి వేళ్లు కూడా విరిగిపోయాయి. ఊరికి దూరంగా ఉన్న పశువుల చావిడిలో దెబ్బలకు తాళలేక పెట్టిన రోదనలు తలచుకుని స్థానికులు కంటతడి పెట్టారు. సూర్యారావు కర్కశత్వాన్ని తలచుకుని ఇన్నాళ్లూ మన మధ్యన గడిపిన వ్యక్తిలో ఇంత రాక్షసత్వం గూడుకట్టుకుని ఉందా? అని విస్తుపోయారు.
హత్య కేసు నమోదు
మండపేట రూరల్ సీఐ పుల్లారావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో భర్త సూర్యారావు భార్య వీర్రాఘవను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి నిందితుడు సూర్యారావును అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై కట్టా శ్రీనివాసరావు తెలిపారు.
అనుమానం పెనుభూతమై..
Published Sun, Mar 15 2015 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement