టిక్కెట్ కలెక్షన్ .. యమ టెన్షన్
కొత్తపేట, న్యూస్‌లైన్ :ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ కం కండక్టర్ డ్యూటీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటంగా మారిం ది. కొన్ని దూర ప్రాంత సర్వీసులకు కండక్టరు లేకుండా టూ ఇన్ వన్ మాదిరిగా వేస్తున్న డ్యూ టీలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. విజయవాడ - కాకినాడ, గుంటూరు - అమలాపురం వంటి దూర ప్రాంత సర్వీసులకు కండక్టరు లేకుండా ఆ పని కూడా డ్రైవర్‌కే అప్పగించడం వల్ల ఆర్టీసీకి ఒక ఉద్యోగి కలిసి వస్తాడు. డ్రైవర్ బస్సు నడుస్తుండగానే టికెట్ ఇచ్చే పనిలో నిమగ్నమై ఉండడంతో ప్రమాదాలు సంభవించేలా ఉన్నాయి. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ-కాకినాడ వయా మండపేట, రామచంద్రపురం డీలక్స్ బస్ సర్వీసు రావులపాలెం నుంచి కాకినాడ గంటన్నర సమయంలో చేరుకోవాలి. కానీ రెండున్నర గంటలు సమయం పట్టింది. టూ ఇన్ వన్ డ్యూటీ కాకుండా సాధారణంగా డ్రైవర్, కండక్టరు సర్వీసు బస్ అయితే నిర్ణీత సమయానికే చేరుకుంటుంది.
కానీ రెండు డ్యూటీలు ఒక్కరే (డ్రైవర్) చేయడం వల్ల గంట ఆలస్యంగా గమ్యానికి చేరుకుంది. అదనంగా గంట సేపు ప్రయాణికులు బస్సులో అసౌకర్యానికి గురవుతున్నారు. ఆలమూరు-రామచంద్రపురం మధ్య చాలా వరకు ఓ వైపు పంట కాలువలు, మరో వైపు డ్రెయిన్ మధ్యలో రెండు లైన్ల రహదారి ఉన్నాయి. ఆదివారం ఓ బస్సు సర్వీసులో డ్రైవర్ స్టీరింగ్ వదిలి సొమ్ము లెక్క పెడుతుండడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రమాదాలు రెప్పపాటులో జరిగే అవకాశం ఉందని వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ విధానం బస్సులోని సుమారు 55 మంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం కాదా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ కం కండక్టరు విధానం రద్దు చేసి ఎవరి డ్యూటీ వారు చేసేలా ఇద్దరితో సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరారు.