మందలించాడని..‘మండి’పోతివా బిడ్డా! | Student suicide in Kottapeta | Sakshi
Sakshi News home page

మందలించాడని..‘మండి’పోతివా బిడ్డా!

Published Thu, Aug 14 2014 12:46 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

మందలించాడని..‘మండి’పోతివా బిడ్డా! - Sakshi

మందలించాడని..‘మండి’పోతివా బిడ్డా!

    ఉపాధ్యాయుడు తప్పుపట్టాడని టెన్‌‌ విద్యార్థిని ఆత్మాహుతి
     ‘ఏ తప్పూ చేయలేదు.. క్షమించండి’ అని సూసైడ్ లెటర్
     ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన బంధువులు, స్థానికులు
     మృతదేహంతో రాస్తారోకో, నిర్భయ చట్టం కేసుకు డిమాండ్

 
 కొత్తపేట :ఓ ఉపాధ్యాయుడు పెడుతున్న మానసిక హింసను తప్పించుకోవడానికి మరణమే శరణ్యమనుకుందా బాలిక. నోట్స్ రాయాల్సిన కలంతో సూసైడ్ నోట్ రాసింది. ఒకేఒక్క అగ్గిపుల్లతో నూరేళ్ల నిండుజీవితానికి నిప్పు పెట్టుకుంది. ‘ఏ తప్పూ చేయలేదు’ అంటూనే ఈ లోకం నుంచి తప్పుకుంది. కన్నవారికి ఎన్నటికీ చల్లారని వేదనాగ్నిని మిగిల్చింది. కొత్తపేట మండలం పలివెలలో పదో తరగతి విద్యార్థిని బండి రేణుక బుధవారం మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. తన ఆత్మహత్యకు నాగభూషణం అనే ఉపాధ్యాయుని వేధింపులే కారణమని రేణుక సూసైడ్‌నోట్‌లో పేర్కొంది.
 
 కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల పైపూరివారి వీధికి చెంది బండి ధనరాజు, లక్ష్మి దంపతులకు కుమార్తె రేణుక, కుమారుడు జగదీష్ మణికంఠ ఉన్నారు. ధనరాజు ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నాడు. బిళ్లకుర్రు శివారు కొత్తపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో రేణుక పదో తరగతి, మణికంఠ ఏడో తరగతి చదువుతున్నారు. ఒంట్లో బాగోలేదని రేణుక బుధవారం ఇంటి వద్దే ఉండగా, మణికంఠ స్కూలుకు వెళ్లాడు. తల్లి మందుల కోసం కొత్తపేట వెళ్లింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రేణుక ఇంట్లో ఉన్న సుమారు 5 లీటర్ల కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.
 
 మంటలు చూసిన పక్కింటి మామిడిశెట్టి సూరిబాబు పరుగుపరుగున వచ్చి చూసేసరికి రేణుక మంటల్లో కాలి, మృతి చెందింది. ఇంతలో వచ్చిన తల్లి లక్ష్మి, బంధువులు జరిగిన ఘోరాన్ని చూసి గొల్లుమన్నారు. ఇంట్లో లభించిన 4 పేజీల సూసైడ్ లెటర్‌లో ‘అమ్మ, నాన్న, పెద్దంకులు, అమ్మమ్మ, తాతయ్య మీరందరూ నన్ను క్షమించండి’ అని మొదలు పెట్టి ‘నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను అందరూ క్షమించాలి. నాగభూషణం సార్ నేను తప్పు చేయలేదని ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు. ఇంకా లేనిపోనివి అన్నీ అంటున్నారు’ అని రాసింది. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు, స్థానికులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు వై.నాగభూషణానికి దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చి నాగభూషణాన్ని అదుపులోకి తీసుకుని కొత్తపేట పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. రేణుక మృతదేహాన్ని ఎస్సై ఎ.బాలాజీ పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
 
 పోలీస్ స్టేషన్ సమీపంలో రాస్తారోకో
 రేణుక ఆత్మహత్యకు కారకుడైన ఉపాధ్యాయుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, పలువురు పలివెల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్ద ఉన్న రేణుక మృతదేహాన్ని తీసుకువచ్చేసి, పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉంచి సాయంత్రం 4 గంటల నుంచి రాస్తారోకో చేశారు. డీఎస్పీ వచ్చి తాము కోరినట్టు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. వారికి మద్దతుగా పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఇన్‌చార్జి సీఐ శ్రీనివాస్ వచ్చి ఉపాధ్యాయునిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సెక్షన్ మార్చి, కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో రాత్రి 8 గంటల సమయంలో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని తిరిగి ఆస్పత్రికి తరలించారు. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు 306 సెక్షన్‌తో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
 
 చలించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
 బాలిక ఆత్మహత్య గురించి తెలిసిన స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి వచ్చి, మృతదేహాన్ని చూసి, చలించిపోయారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆకుల రామకృష్ణ, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు దర్ణాల రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, టీడీపీ నాయకుడు కోరం జయకుమార్, ఎంపీడీఓ పి.వీణాదేవి, ఎంఈఓ వై.సత్తిరాజు తదితరులు మృతదేహాన్ని చూసి, బాలిక కుటుంబానికి సానుభూతి తెలిపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement