కొత్తపేట : దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిన ఆలయ హుండీల లెక్కింపు సందర్భంగా ఆ శాఖ ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఉదంతమిది. కొత్తపేట ఎస్సై డి. విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వానపల్లి గ్రామ దేవత పల్లాలమ్మ అమ్మవారి ఆలయం హుండీలను బుధవారం లెక్కించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈవో వెత్సా దేముళ్లు ఆధ్వర్యంలో రాజమండ్రి దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ పల్లిభీమారావు సమక్షంలో బుధవారం పలువురు గ్రామస్తులు హండీలను లెక్కించారు.
ఓ హుండీనీ తెరచి దానిలో ఉన్న నగదును, వస్తువులను బయటకు తీసే సమయంలో వాడపాలెం బండారు పేరమ్మగారి స్వామి అన్నదానం సత్రం గుమాస్తాగా పని చేస్తున్న సిహెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్ 9 గ్రాముల 3 మీల్లీ గ్రాముల బరువు గల రెండు పెద్దవి, రెండు చిన్నవి మంగళ సూత్రాలను బయటకు తప్పించేందుకు యత్నించారు. పక్కనే ఉన్న పువ్వుల కుండీలో వేశారు. దీనిని పలువురు గ్రామస్తులు గుర్తించారు.
వెంటనే అతనిని నిలదీయగా తాను ఏ వస్తువులూ తప్పించలేదని వాదించగా గట్టిగా నిలదీయడంతో తప్పును అంగీకరించాడు. పక్కనేఉన్న పువ్వుల కుండీలో పడ వేసిన మంగళ సూత్రాలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈవో వెత్సా దేముళ్లు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు.
హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం
Published Thu, Jun 18 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement
Advertisement