కొత్తపేట, న్యూస్‌లైన్ : ప్రతి మనిషీ ఓ తల్లి ప్రసవవేదన అనంతరం కన్ను తెరిచిన వాడే. అయితే కళ్లు నెత్తికెక్కిన ఆ ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆ మాటే మరిచారు. పురిటి నొప్పులతో వచ్చిన ఓ నిండు గర్భిణిని తమ వెటకారపు మాటలతో అంత కన్నా నొప్పించారు. ‘సీఎం రికమండేషన్ ఉందా, ఎమ్మెల్యే రికమండేషన్ ఉందా’ అంటూ ఆమెను పరిహసించారు. పోనీ, సూటీపోటీ మాటలంటే అన్నారు, అసలు ఆ నిండు చూలాలిని ఆస్పత్రిలో చేర్చుకున్నారా అంటే అదీ లేదు. దాంతో ఆమె ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం బాధితురాలి చెల్లెలు జనిపిరెడ్డి నాగలక్ష్మి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన నాగా సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమార్తె యర్రంశెట్టి సత్య అత్తవారి ఊరైన కేదారిలంక నుంచి రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ఆమెకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె చెల్లెలు జనిపిరెడ్డి నాగలక్ష్మి సాయంతో కొత్తపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఇద్దరు నర్సులు ఉన్నారు. వీరిలో ఓ నర్సు ‘ఇప్పుడు డాక్టరు ఉండరు, ఉదయం తీసుకురండి’ అని చెప్పింది. పురిటినొప్పులు వస్తున్నాయని, వెంటనే ఆస్పత్రిలో చేర్చుకోవాలని నాగలక్ష్మి ప్రాధేయపడింది. దాంతో ‘సీఎం రికమండేషన్ ఉందా, ఎమ్మెల్యే రికమండేషన్ ఉందా’ అంటూ ఆ నర్సు హేళనగా మాట్లాడారు. త మకు తెలిసిన నాయకులతో ఫోన్ చేయిస్తామని నాగలక్ష్మి చెప్పింది.
విషయం తెలుసుకున్న డ్యూటీ డాక్టర్ వచ్చి గర్భిణిని పరీక్షించాడు. బిడ్డ అడ్డం తిరిగిందని, రాజమండ్రి తీసుకువెళితే ఆపరేషన్ చేస్తారని చెప్పారు. అంతే కాక గర్భిణితో పాటు తోడుగా ఉన్నవారికి కూడా భోజనం పెడతారని హేళనగా మాట్లాడారు. పేద కుటుంబానికి చెందిన వాళ్లను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించుకోవాల్సిందిపోయి, ఎగతాళిగా మాట్లాడారని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసిం ది. గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఆపరేషన్ చేసి బిడ్డను తీశారని పేర్కొంది. ఈ సంఘటనపై విచారణ జరిపి, కొత్తపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
సీఎం రికమండేషన్ ఉందా?
Published Sun, Jan 5 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement