readymade garments
-
సిరిసిల్లలో రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ శివారులో 63 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తెలంగాణ అపారెల్ పార్కులో దుస్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్పోర్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లో శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వేలాది మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా వస్త్రోత్పత్తి, ఎగుమతుల కోసం బిల్ట్ టు సూట్ పద్ధతిలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ అపారెల్ పార్కు’ను అభివృద్ధి చేస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న టెక్స్పోర్ట్ కంపెనీ 1978 నుంచి అపారెల్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, విదేశీ ఎగుమతులు లక్ష్యంగా రెడీమేడ్ దుస్తులను తయారు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 19 చోట్ల రెడీమేడ్ తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రూ.620 కోట్ల వార్షికాదాయంతో ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. రెండు వేల మందికి ఉపాధి ప్రస్తుత ఒప్పందం మేరకు సిరిసిల్లలోని తెలంగాణ అపారెల్ పార్కులో 7.42 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, టెక్స్పోర్ట్ ఎండీ నరేంద్ర డి.గోయెంకా సంతకాలు చేశారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి, టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సిరిసిల్లలోని నేతన్నల నైపుణ్యం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అపారెల్ పార్కులో ఫ్యాక్టరీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని టెక్స్పోర్ట్ కంపెనీ ఎండీ గోయెంకా తెలిపారు. -
క్లాసిక్ పోలో మరో 65 ఔట్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్స్ తయారీలో ఉన్న రాయల్ క్లాసిక్ మిల్స్ ‘క్లాసిక్ పోలో’ ఫ్రాంచైజీ విధానంలో రిటైల్ ఔట్లెట్ల సంఖ్యను 200లకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థకు పలు రాష్ట్రాల్లో ఇటువంటి స్టోర్లు 135 ఉన్నాయి. వీటిలో అత్యధికం దక్షిణాదిన ఉన్నాయి. కొత్త కేంద్రాలు తూర్పు, పశ్చిమ భారత్లో రానున్నాయని క్లాసిక్ పోలో రిటైల్ డైరెక్టర్ రమేశ్ వి ఖేని మంగళవారం తెలిపారు. నూతన కలెక్షన్ను ఇక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. క్లాసిక్ పోలో బ్రాండ్ ద్వారా 2018–19లో రూ.160 కోట్లు సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.200 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. గ్రూప్ టర్నోవర్ 2019–20లో 25 శాతం వృద్ధితో రూ.1,000 కోట్లను తాకుతుందని కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ జీఎం గుండుబోయిన శ్రీకాంత్ వెల్లడించారు. గ్రూప్ ఆదాయంలో అత్యధిక వాటా ఎగుమతులదేనని, యూఎస్, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు దుస్తులను సరఫరా చేస్తున్నట్టు వివరించారు. ఏటా 2,000 కొత్త డిజైన్లు.. క్లాసిక్ పోలో నుంచి ఏటా 2,000 డిజైన్లు ప్రవేశపెడుతున్నట్టు సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధ్యనేశ్ కుమార్ వెల్లడించారు. విక్రేతల కోసం ప్రత్యేక యాప్ను రూపొందించామని, దీని ద్వారా ఆర్డరు ఇచ్చిన నెలరోజుల్లోనే వారికి దుస్తులను సరఫరా చేస్తున్నామని తెలిపారు. కంపెనీ విక్రయిస్తున్న రెడీమేడ్స్ ధర రూ.599–2,499 మధ్య ఉందన్నారు. పర్యావరణ అనుకూల డిజైన్లపై ఫోకస్ చేస్తున్నామని డిజైన్ మేనేజర్ తిరునవక్కరసు తెలిపారు. సస్టేనబుల్ డెనిమ్ పేరుతో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, కాటన్ మిశ్రమంతో జీన్స్ ప్యాంట్స్ అందుబాటులోకి తెచ్చాం. వెదురు నుంచి తీసిన నారతో షర్ట్స్ రూపొందించాం అని వివరించారు. -
రెడీమేడ్ గార్మెంట్స్ పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేయాలి
విజయవాడ: రెడీమేడ్ గార్మెంట్స్పై ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. విజయవాడ రెడీమేడ్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేశారు. రెడీమేడ్ రంగాన్ని రక్షించండి, రెడీమేడ్ దుస్తులపై ఎక్సైజ్ డ్యూటీ వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పలువురు వ్యాపారులు హెచ్చరించారు.