హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్స్ తయారీలో ఉన్న రాయల్ క్లాసిక్ మిల్స్ ‘క్లాసిక్ పోలో’ ఫ్రాంచైజీ విధానంలో రిటైల్ ఔట్‌లెట్ల సంఖ్యను 200లకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థకు పలు రాష్ట్రాల్లో ఇటువంటి స్టోర్లు 135 ఉన్నాయి. వీటిలో అత్యధికం దక్షిణాదిన ఉన్నాయి. కొత్త కేంద్రాలు తూర్పు, పశ్చిమ భారత్‌లో రానున్నాయని క్లాసిక్ పోలో రిటైల్ డైరెక్టర్ రమేశ్ వి ఖేని మంగళవారం తెలిపారు. నూతన కలెక్షన్‌ను ఇక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. క్లాసిక్ పోలో బ్రాండ్ ద్వారా 2018–19లో రూ.160 కోట్లు సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.200 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. గ్రూప్ టర్నోవర్ 2019–20లో 25 శాతం వృద్ధితో రూ.1,000 కోట్లను తాకుతుందని కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ జీఎం గుండుబోయిన శ్రీకాంత్ వెల్లడించారు. గ్రూప్ ఆదాయంలో అత్యధిక వాటా ఎగుమతులదేనని, యూఎస్, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు దుస్తులను సరఫరా చేస్తున్నట్టు వివరించారు.
ఏటా 2,000 కొత్త డిజైన్లు..
క్లాసిక్ పోలో నుంచి ఏటా 2,000 డిజైన్లు ప్రవేశపెడుతున్నట్టు సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధ్యనేశ్ కుమార్ వెల్లడించారు. విక్రేతల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, దీని ద్వారా ఆర్డరు ఇచ్చిన నెలరోజుల్లోనే వారికి దుస్తులను సరఫరా చేస్తున్నామని తెలిపారు. కంపెనీ విక్రయిస్తున్న రెడీమేడ్స్ ధర రూ.599–2,499 మధ్య ఉందన్నారు. పర్యావరణ అనుకూల డిజైన్లపై ఫోకస్ చేస్తున్నామని డిజైన్ మేనేజర్ తిరునవక్కరసు తెలిపారు. సస్టేనబుల్ డెనిమ్ పేరుతో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, కాటన్ మిశ్రమంతో జీన్స్ ప్యాంట్స్ అందుబాటులోకి తెచ్చాం. వెదురు నుంచి తీసిన నారతో షర్ట్స్ రూపొందించాం అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment