న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత ఢిల్లీలో మెట్రో సేవలను పున:ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేవారు స్థానిక స్టేషన్‌లలో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం ‘పోలో’ను కలవవచ్చు. ప్రత్యేక శిక్షణ నైపుణ్యాలు కలిగిన చురుకైన పోలోకు ఢిల్లీ మెట్రో స్టేషన్‌లలో తొలి పోస్టింగ్ లభించింది. ఇది స్థానిక స్టేషన్లలో భదత్రా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కలిసి విధులు నిర్వహించనున్నది. (7 న మెట్రో పునఃప్రారంభం, చర్యలివే!)
కాగా అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టడంలో ఈ జాతికి చెందిన శునకం ‘కైరో’ ప్రముఖ పాత్ర పోషించింది. అప్పటి నుంచి బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇది ఏకధాటిగా 40 కిలోమీటర్లు పరిగెత్తగలదని శిక్షకులు తెలిపారు. వాసన పసిగట్టడం, దాడి చేయడం, కాపలాకాయడం వంటి మూడు విధులు నిర్వహించడం దీని ప్రత్యేకత. మిగతా జాతి కుక్కలైన జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ వంటివి ఏకధాటిగా 4 నుంచి 7 కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయని, అవి ఒక టాస్క్‌ను మాత్రమే చేస్తాయని చెప్పారు. చురుకైన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కుక్కను దేశ రాజధానిలో విధుల్లో నియమించడం ఇదే తొలిసారి. ఇక నుంచి ఢిల్లీ పరిధిలోని కీలక మెట్రో స్టేషన్లలలో ఇది కనిపించనున్నది.
Comments
Please login to add a commentAdd a comment