polo
-
ఆ పాపులర్ మోడల్ కార్ల ధరలు పెరిగాయ్!
ముంబై: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సెప్టెంబర్ 1 నుంచి పలు మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్ పోలో, మిడ్ సైజ్ సెడాన్ వెంటో ఉన్నాయి. 3 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. తయారీ వ్యయం అధికం అవుతున్నందునే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. పోలో జీటీ మినహాయిస్తున్నట్టు వివరించింది. ఆగస్ట్ 31 నాటికి కార్లను బుక్ చేసుకున్న వినియోగదార్లపై ఎటువంటి ధరల భారం ఉండబోదని స్పష్టం చేసింది. -
‘పోలో’కు ఢిల్లీ మెట్రోలో తొలి పోస్టింగ్..
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత ఢిల్లీలో మెట్రో సేవలను పున:ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేవారు స్థానిక స్టేషన్లలో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం ‘పోలో’ను కలవవచ్చు. ప్రత్యేక శిక్షణ నైపుణ్యాలు కలిగిన చురుకైన పోలోకు ఢిల్లీ మెట్రో స్టేషన్లలో తొలి పోస్టింగ్ లభించింది. ఇది స్థానిక స్టేషన్లలో భదత్రా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కలిసి విధులు నిర్వహించనున్నది. (7 న మెట్రో పునఃప్రారంభం, చర్యలివే!) కాగా అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టడంలో ఈ జాతికి చెందిన శునకం ‘కైరో’ ప్రముఖ పాత్ర పోషించింది. అప్పటి నుంచి బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇది ఏకధాటిగా 40 కిలోమీటర్లు పరిగెత్తగలదని శిక్షకులు తెలిపారు. వాసన పసిగట్టడం, దాడి చేయడం, కాపలాకాయడం వంటి మూడు విధులు నిర్వహించడం దీని ప్రత్యేకత. మిగతా జాతి కుక్కలైన జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ వంటివి ఏకధాటిగా 4 నుంచి 7 కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయని, అవి ఒక టాస్క్‌ను మాత్రమే చేస్తాయని చెప్పారు. చురుకైన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కుక్కను దేశ రాజధానిలో విధుల్లో నియమించడం ఇదే తొలిసారి. ఇక నుంచి ఢిల్లీ పరిధిలోని కీలక మెట్రో స్టేషన్లలలో ఇది కనిపించనున్నది. -
క్లాసిక్ పోలో మరో 65 ఔట్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్స్ తయారీలో ఉన్న రాయల్ క్లాసిక్ మిల్స్ ‘క్లాసిక్ పోలో’ ఫ్రాంచైజీ విధానంలో రిటైల్ ఔట్లెట్ల సంఖ్యను 200లకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థకు పలు రాష్ట్రాల్లో ఇటువంటి స్టోర్లు 135 ఉన్నాయి. వీటిలో అత్యధికం దక్షిణాదిన ఉన్నాయి. కొత్త కేంద్రాలు తూర్పు, పశ్చిమ భారత్‌లో రానున్నాయని క్లాసిక్ పోలో రిటైల్ డైరెక్టర్ రమేశ్ వి ఖేని మంగళవారం తెలిపారు. నూతన కలెక్షన్‌ను ఇక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. క్లాసిక్ పోలో బ్రాండ్ ద్వారా 2018–19లో రూ.160 కోట్లు సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.200 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. గ్రూప్ టర్నోవర్ 2019–20లో 25 శాతం వృద్ధితో రూ.1,000 కోట్లను తాకుతుందని కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ జీఎం గుండుబోయిన శ్రీకాంత్ వెల్లడించారు. గ్రూప్ ఆదాయంలో అత్యధిక వాటా ఎగుమతులదేనని, యూఎస్, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు దుస్తులను సరఫరా చేస్తున్నట్టు వివరించారు. ఏటా 2,000 కొత్త డిజైన్లు.. క్లాసిక్ పోలో నుంచి ఏటా 2,000 డిజైన్లు ప్రవేశపెడుతున్నట్టు సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధ్యనేశ్ కుమార్ వెల్లడించారు. విక్రేతల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, దీని ద్వారా ఆర్డరు ఇచ్చిన నెలరోజుల్లోనే వారికి దుస్తులను సరఫరా చేస్తున్నామని తెలిపారు. కంపెనీ విక్రయిస్తున్న రెడీమేడ్స్ ధర రూ.599–2,499 మధ్య ఉందన్నారు. పర్యావరణ అనుకూల డిజైన్లపై ఫోకస్ చేస్తున్నామని డిజైన్ మేనేజర్ తిరునవక్కరసు తెలిపారు. సస్టేనబుల్ డెనిమ్ పేరుతో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, కాటన్ మిశ్రమంతో జీన్స్ ప్యాంట్స్ అందుబాటులోకి తెచ్చాం. వెదురు నుంచి తీసిన నారతో షర్ట్స్ రూపొందించాం అని వివరించారు. -
ఫోక్స్‌వ్యాగన్ కొత్త వెర్షన్ పోలో
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వాగన్ కొత్త వెర్షన్ కారును లాంచ్ చేసింది. తన ప్రముఖహ్యాచ్బ్యాక్ మోడల్ పోలోలో కొత్త వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1.0 లీటర్ల ఎంపీఐ ఇంజిన్‌తో తీసుకొస్తున్న ఈ కారుకు రూ. 5,41,800 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా నిర్ణయించింది. అలాగే ఇండియాలో 1.2 ఎంపీఐ ఇంజిన్‌ను కొత్త 1.0 ఇంజిన్‌తో భర్తీ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక కొత్త పోలో లో 56 కిలోవాట్ల పపర్, 95 ఎన్ఎం టార్క్, లీటరుకు 18.78 కిలోమీటర్ల మైలేజీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. తమ బ్రాండ్‌ను మరింత మెరుగుపరుచుకుంటూ, భారతీయ విలక్షణమైన కారు-కొనుగోలుదారులకు విభిన్న పోర్ట్‌ఫోలియోలను అందించడమే తమ లక్ష్యమని వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టీఫెన్ నాప్ చెప్పారు. ఈ కొత్త వెర్షన్లో ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరిచామన్నారు. కాగా ఫోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లో పోలో, వెంటో, జెట్టా, పాసట్, టౌరేగ్ వంటి మోడల్ కార్లను విక్రయిస్తుంది. -
‘పోలో’మంటూ..
పోలో.. ఆట గురించి తెలుసు కదా? గుర్రాల మీద దౌడుతీస్తూ... పొడవాటి కర్రతో బంతిని గోల్‌లోకి నెట్టే క్రీడ. చూడ్డానికి ఉత్కంఠ భరింతగా.. గుర్రాలతో తలపడే తీరు పాతకాలం నాటి యుద్ధా సన్నివేశాలను తలపిస్తోంది. ఇంచుమించు అటువంటి క్రీడే... సైకిల్ (బైస్కిల్) పోలో. గతం నుంచీ ఉన్న సంప్రదాయ క్రీడేనైనా.. ఇప్పుడిప్పుడే తూర్పుగోదావరి జిల్లాలో ‘పోలో’మంటూ దీనికి ఆదరణ పెరుగుతోంది. గత ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)లో దీనిని చేర్చడంతో మరింత ఆదరణ పెరిగే అవకాశముంది. సాక్షి, అమలాపురం: ఒక్కో జట్టు తరఫున నలుగురు మాత్రమే క్రీడాకారులు మైదానంలో ఆడాల్సి ఉంది. మరో ఇద్దరు, నలుగురు అదనపు క్రీడాకారులుంటారు. ఎవరు ఎక్కువగా గోల్స్ చేస్తే వారే గెలిచినట్టు. మొత్తం 30 నిమిషాల పాటు రెండు జట్ల మధ్య పోటీ సాగుతుంది. నాలుగు క్వార్టర్లుగా (క్వార్టర్ 7.30 నిమిషాలు) చేసి ఆడిస్తారు. ఈ ఆటలో ప్రత్యేకంగా గోల్‌కీపర్ అంటూ ఉండడు. ఏ క్రీడాకారుడైనా గోల్ చేయడం, అడ్డుకోవడం చేయవచ్చు. కాని బాల్‌ను బ్యాట్‌తో టచ్ చేసేటప్పుడు మాత్రం కాలు భూమిమీద పెట్ట కూడదు. అలా చేస్తే ఫౌల్‌గా పరిగణిస్తారు. క్రీడా మైదానం 100 మీటర్లు పొడవు, 80 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ గేమ్‌కు వినియోగించే సైకిల్‌కు ముందు బ్రేక్, మధ్యలో మడ్ఘర్ ఉండదు. బ్యాట్ ఇంచుమించు సుత్తిలా ఉంటుంది. పట్టుకునే కర్ర మాత్రం పొడవుగా ఉంటుంది. ప్రపంచ పోటీల్లో మన దేశం హవా ఇంటర్నేషనల్ బైస్కిల్ చాంపియన్ షిప్ పోటీల్లో మన దేశ జట్టు పలు సందర్భాల్లో సత్తా చాటింది. 1996లో యూఎస్ఏలో రిచ్‌ల్యాండ్, 1999లో కెనడా, 2000లో మన దేశంలో న్యూఢిల్లీలో, 2001లో బ్రిటన్‌లోని లండన్‌లో మనదేశం విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించింది. 2002లో ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో, 2004లో కెనడాలో జరిగి పోటీల్లో ద్వితీయస్థానంలో నిలిచి రజపతకాలు కైవసం చేసుకుంది. పెరుగుతున్న ఆదరణ సైకిల్ పోలోకు మన జిల్లాలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. కాకినాడ, పిఠాపురం, మామిడికుదురు కేంద్రాలుగా ఈ క్రీడ వృద్ధి చెందుతోంది. గత ఏడాది నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్ –19 విభాగంలో సైకిల్ పోలోకు అవకాశం కల్పించారు. ఈ పోటీల్లో మన జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. గత ఏడాది కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఎస్జేఎఫ్–17 రాష్ట్రస్థాయి పోటీల్లో బాలురు మూడో స్థానం, బాలికలు రెండో స్థానం పొందారు. జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారుల్లో జేహెచ్ఎస్ అరుణ్‌తేజ్, వి.యశస్వీ, యు.అంబికా, స్వర్ణలేఖలు జాతీయస్థాయి పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఛతీస్ఘడ్ రాష్ట్రం బిలాయిలో జరిగిన జాతీయ పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించారు. వీరి ఎంపిక మరికొంత మంది క్రీడాకారులకు ఉత్తేజాన్నిస్తోంది. అక్కడ కూడా మన రాష్ట్ర బాలికల జట్టు రెండవ స్థానంలో, బాలుర జట్టు మూడవ స్థానంలో నలిచింది. రాజోలు ఎంఈవో జొన్నలగడ్డ గోపాలకృష్ణ, పిఠాపురానికి చెందిన యోగాకోచ్ పల్ల లక్ష్మీణరావులు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం చత్తీస్ఘడ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఇండియన్ ఆర్మీ, రాజస్థాన్ జట్లు ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వం ప్రోత్సహించాలి ఇటువంటి క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో క్రీడామైదానాలు, సైకిళ్లను ఏర్పాటు చేయాలి. మన క్రీడాకారులు సాధారణ సైకిళ్లపై శిక్షణ పొందుతున్నారు. వీరు అంతర్జాతీయ పోటీలకు వెళితే ఆ స్థాయిలో రాణించలేరు. – జొన్నాలగడ్డ గోపాలకృష్ణ, ఎంఈవో, కోచ్, రాజోలు జాతీయస్థాయిలో ఆడడం ఆనందంగా ఉంది తొలి ప్రయత్నంలో నేను రాష్ట్ర జట్టుకు ఎంపికకావడం ఆనందంగా ఉంది. మాకు స్థానికంగా మంచి శిక్షణ ఇచ్చారు. జాతీయ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ పోటీల్లో రాణించాలన్నదే నా ఆశ. – జె.హెచ్.ఎస్.అరుణ్‌తేజ్, సైకిల్‌పోలో క్రీడాకారుడు -
పోలో వీరుడు..
పిసాపోలో జాతీయ జట్టుకు ఎంపికైన వీరగంగాధర్ తునిరూరల్ (తుని) : ప్రోత్సహం లభించడంతో.. క్రీడల్లో అసమాన ప్రతిభతో మట్టిలో ఒక మాణిక్యం దేదీప్యమానంగా వెలిగింది. మండలంలోని శివారు గ్రామం ఎన్.ఎస్.వెంకటనగరానికి చెందిన కొల్లు వీరగంగాధర్ పిసాపోలో క్రీడలో జాతీయ స్థాయిలో కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఫిన్లాండ్ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పిసాపోలో పోటీల్లో ఈతడు పాల్గొననున్నాడు. ఆ పోటీల్లో కూడా ప్రతిభ చూపి దేశం, రాష్ట్రం, గ్రామానికి ఖ్యాతి తెస్తానంటున్నాడు. రెండు నెలల్లోనే అత్యుత్తమ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానాన్ని పొందిన ఈతడు.. ఉపాధ్యాయులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. వ్యయసాయ కుటుంబంలో పుట్టిన వీరగంగాధర్కు ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సహం లభించింది. కబడ్డీ, లాంగ్ జంప్, చౌక్‌బాల్ పోటీల్లో ఇతడు రాణిస్తున్నాడు. పదో తరగతి పరీక్షల కోసం.. ప్రస్తుతం ఇతడు ఎన్.సూరవరం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఫిన్లాండ్ దేశంలో ప్రసిద్ధి కెక్కిన పిసాపోలో క్రీడలో ఇతడికి పీఈటీలు రాజు, విక్టర్ శిక్షణ ఇచ్చారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయిలో గత జనవరిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో సిల్వర్ ట్రోఫీ, మెరిట్ సర్టిఫికెట్‌ను సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడడమే ధ్యేయం 2020లో పిసాపోలో ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చే అవకాశం ఉన్నట్టు సెలక్టర్లు తెలిపారని, అందులోనూ పాల్గొని విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వీరగంగాధర్ తెలిపారు. మంగళవారం నుంచి 15వ తేదీ వరకూ రాజస్థాన్‌లో నేషనల్ అకాడమీ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఇతడు పాల్గొనాల్సి ఉంది. అయితే పదో తరగతి పరీక్షలు సమీపించడంతో శిక్షణకు వెళ్లలేదు. ఈ విషయాన్ని పీఈటీల ద్వారా సెలక్టర్లకు తెలియజేస్తే.. మేలో జరిగే మూడో విడత శిక్షణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ ఆటలో తొమ్మిది మంది ఆటగాళ్లు, ఇద్దరు అదనపు ఆటగాళ్లు ఉంటారన్నారు. జట్టులో రెండో స్థానంలో ఉన్నానన్నాడు. ఫిన్లాండ్ వెళ్లేందుకు పాస్‌పోర్టు, ఇతర ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు వెళ్లాలంటే రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, ఇందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకరిస్తున్నారని చెప్పాడు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొని గుర్తింపు తీసుకువస్తానని ఇతడు అంటున్నాడు. -
సైకిల్ పోలోలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
మామిడికుదురు :రాష్ట్ర స్థాయి 62వ స్కూల్ గేమ్స్ అండర్–19 సైకిల్ పోలో గేమ్స్–2016 టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారుల బృందం ప్రతిభ చూపింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఇంటర్ డిస్రిక్ట్ పోటీల్లో బాలికల విభాగంలో రజత పతకం, బాలుర విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఈ పోటీలు జరిగాయని సైకిల్ పోలో కోచ్ జొన్నలగడ్డ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. బాలికల జట్టులో మామిడికుదురుకు చెందిన చింతపల్లి స్వర్ణరేఖ, కె.ఐశ్వర్య, ఎం.విజయకుమారి, ఉండ్రు అంబిక, బాలుర విభాగంలో పి.ఉదయ్‌కిరణ్, కె.వెంకటరమణ సభ్యులుగా ఉన్నారు. జాతీయ పోటీలకు స్వర్ణరేఖ ఎంపిక బాలికల విభాగం నుంచి పదో తరగతి విద్యార్థిని చింతపల్లి స్వర్ణరేఖ జాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలకు ఎంపికైంది. ఈ పోటీలు ఛత్తీస్‌గఢ్‌లో డిసెంబర్ నెలలో జరుగుతాయని కోచ్ గోపాలకృష్ణ తెలిపారు. సైకిల్ పోలో పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను హెచ్ఎం జేఎన్ ఎస్ గోపాలకృష్ణ, పీడీ వి.శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటీలు అభినందించారు. -
రాష్ట్రస్థాయి సైకిల్ పోలో పోటీలు ప్రారంభం
బనగానపల్లె రూరల్: స్థానిక నెహ్రూ ఇంగ్లిష్ మీడియం క్రీడామైదానంలో మూడో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్, జూనియర్ బాలుర సైకిల్ పోలో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సైకిల్ పోలో సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదన్నారు. స్పోర్ట్స్ కోటాను సక్రమంగా అమలు చేసి క్రీడాకారులను ప్రోత్సాహించాలని సూచించారు. నిర్వాహక కమిటీ చైర్మన్ కోడూరు హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి సైకిల్ పోలో పోటీలు తమ పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన పెంపొందించుకునే అవకాశం లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రధర్శించిన సాంస్కృతిక కార్యక్రమలు అలరించాయి. మొదటి రోజు పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు 2–0 గోల్స్‌తో కర్నూలు జట్టు పై విజయం సాధించి. ఈ పోటీలు ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. సైకిల్ పోలో జిల్లా సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎ.వి.రామ సుబ్రమణ్యం, కమిటీ కార్యదర్శి రామాంజనేయులు, స్కూల్ డైరెక్టర్ రవితేజారెడ్డి, హెచ్ఎం కమల్‌తేజారెడ్డి, ఎంఈవో నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
రాయల్ గేమ్ - పోలో
-
పోలో సీజన్ వచ్చేసింది
-
పోలోలో కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: ఫోక్స్‌వ్యాగన్ పోలో మోడల్లో కొత్త వేరియంట్, క్రాస్ పోలోను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ.7.75 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). 1. 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, వెండి పూత పూసిన అద్దాలు వంటి ప్రత్యేకతలున్నాయి. స్పోర్టీ క్రాస్ ఓవర్ స్టైల్ ఉండే ప్రీమియం హ్యాచ్‌బాక్ కావాలనుకునే వారి కోసం ఈ కారును మార్కెట్లోకి తెచ్చామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎండీ అర్వింద్ సక్సేనా చెప్పారు. -
సెప్టెంబర్ ఒకటి నుంచి పోలో సీజన్
ఇండియన్ పోలో అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 22 వరకు రాష్ట్రంలో పోలో పోటీలు జరుగనున్నాయి. సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశంలోని అత్యుత్తమ జట్లతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఆటగాళ్లు రానున్నారని ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మునీష్ శైబల్ పేర్కొన్నారు. సోమవారం తిరుమలగిరిలోని 554వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 దశల్లో జరిగే ఈ పోటీలు మొదట ఆగస్టు 15 నుంచి 31వరకు బెంగళూర్‌లో జరుగుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 22వరకు హైద్రాబాద్, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6 వరకు జైపూర్, అక్టోబర్ 7 నుంచి 13 వరకు నొయిడా, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 8 వరకు ఢిల్లీ (ఐపీఏ చాంపియన్‌షిప్ కలిపి), డిసెంబర్ 11 నుంచి 31వరకు జోధ్‌పూర్, కోల్‌కతాల్లో, డిసెంబర్ 30 నుంచి ఏప్రిల్ 5వరకు జైపూర్, ఫిబ్రవరి 2 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీ, మార్చి 11 నుంచి ఏప్రిల్ 5వరకు ముంబై, ఏప్రిల్ 7వ తేది నుంచి 20 వరకు బెంగళూర్, సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు జైపూర్‌లో పోలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రిన్స్ఆఫ్ బేరార్ కప్, బైసన్ కప్, ఆర్మీ కమాండర్స్ కప్ అందజే స్తారని ఆయన తెలిపారు.