500 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇవాళే అయోధ్యలో కన్ను పండుగగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరగనుంది. మరికొద్దిసేపటిలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. అంతేగాదు దేశ విదేశాల నుంచి సైతం రామభక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ఆయోధ్య రాముడుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయన ధరించే బట్టలను అందంగా డిజైన్ చేసి ఎవరూ ఇస్తారు? వాళ్లేవరూ? వంటి విశేషాలు గురించి తెలుసుకుందాం!
అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం బాబూ లాల్ టైలర్స్. దీన్ని ఇద్దరు అన్నదమ్ములు భగవత్, శంకర్ లాల్ నడుపుతున్నారు. వీళ్లే బాల రామయ్యకు వేసే బట్టలను అందంగా డిజైన్ చేస్తారు. మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్‌దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్, శంకర్‌ల తండ్రి బాబూలాల్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు కుడుతోంది. రాముని విగ్రహానికి ఒక్కోరోజు ఒక్కోరంగుతో కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసి కుడతారు.
అలా..సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం రంగు వస్త్రాలు వేస్తారు. వాళ్లు కేవలం రాముడికి మాత్రమే గాక లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమాన్, శాలిగ్రామాలకు కూడా బట్టలు కుట్టడం జరుగుతుంది. ఈ టైలర్లు అయోధ్యలోని బడి కుటియా ప్రాంతంలో శ్రీ బాబులాల్ టైలర్ పేరుతో ఎనిమిది అడుగుల గదిలో దుకాణం నడుపుతున్నారు.
ఈ అయోధ్య రామమందిరం భూమిపూజ రోజు రామునికి ఆకుపచ్చరంగు దుస్తులను కుట్టారు. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలర్ దుస్తులను డిజైన్ చేశారు. అయితే ఆ సోదరులు రాముడుకి దుస్తులు కుట్టేందుకు సిల్క్‌ని వాడగా, బంగారం దారంతో కుట్టడం జరుగుతుంది. పైగా వాటిపై నవగ్రహాలు ఉండటం విశేషం. ఈ ఇరువురు సోదరులు రామ్‌లల్లా కోసం దుస్తులు కుట్టడంలో చాలా ప్రత్యేకతను చూపి తమ భక్తిని చాటుకుంటున్నారు. అంతేగాదు మా జీవితకాలంలో ఈ గొప్ప రామాలయాన్ని చూడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందంగా చెబుతున్నారు ఆ సోదరులు.
(చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!)
Comments
Please login to add a commentAdd a comment