డోన్ టౌన్: తమ సొంతింటి కల సాకారం కాకుండా అడ్డుపడుతున్న టీడీపీ నేత కన్నపకుంట గోవిందరెడ్డి ఇంటిని టైలర్లు ఆదివారం ముట్టడించారు. టీడీపీ హయాంలో డోన్ పట్టణ టైలర్ల సంఘం అధ్యక్షుడిగా కన్నపకుంట గోవిందరెడ్డి వ్యవహరించారు. టైలర్లకు టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఆ స్థలాల్లో కొంతమంది బేస్‌మట్టం వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. మరికొందరు తమ స్థలాలను అమ్ముకున్నారు. ఇలా జరిగిన అమ్మకాల్లో గోవిందరెడ్డి పాత్ర ఉన్నట్టు చెబుతున్నారు.
అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఆ స్థలాల్లో టిడ్కో ఇళ్లు కట్టిస్తామని స్థలాలను తీసేసుకుంది. అప్పటికే నిర్మించిన బేస్‌మట్టాలను తొలగించారు. టిడ్కో ఇళ్లు ప్రభుత్వం నిర్మించి నిజమైన లబ్దిదారులకే ఇస్తుంది. దీంతో అనధికారికంగా వాటిని కొనుగోలు చేసినవారు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే వారికి కూడా టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని చెప్పి వారి వద్ద నుంచి కూడా గోవిందరెడ్డి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం నిజమైన టైలర్లకు మాత్రమే టిడ్కో గృహాలు కేటాయిస్తూ జీవో జారీ చేయడంతో రూ.లక్షలు చెల్లించిన వారు గోవిందరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో గోవిందరెడ్డి కోర్టుకు వెళ్లడంతో టిడ్కో గృహాల పంపిణీ వాయిదాపడింది. దీంతో టైలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించారు.
Comments
Please login to add a commentAdd a comment