ముంబై : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ప్రశంసల వర్షం కురిపించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించడంపై జావెద్ హబీబ్ స్పందించారు.('పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు')
‘కరోనా ప్రపంచం మొత్తాన్ని మార్చివేసింది. ఫ్రొఫెషన్లను కూడా మార్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకం పేరే జగనన్న చేదోడు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు అండగా నిలవడానికి తీసుకొచ్చిన పథకం ఇది. ఒకేసారి వీరికి రూ.10 వేల సాయం అందనుంది. దేశంలోనే ఇలాంటి పథకం తీసుకువచ్చిన మొదటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’ బిగ్ థ్యాంక్స్ అంటూ ‘జగనన్న చేదోడు’ పథకంపై జావెద్ హబీబ్ ప్రశంసలు ఝల్లు కురిపించారు. మరోవైపు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జగనన్న చేదోడు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సెలబ్రిటీ స్టైలీస్ట్ హర్మన్ కౌర్ అన్నారు. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు)
కాగా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేసి జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. (‘జగనన్న చేదోడు’ ప్రారంభం)
తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment