సాక్షి, అమరావతి: ‘షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీ షాపు ఉన్న రజకులకు, టైలరింగ్ షాపులున్న దర్జీలకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తాం.. వారికి తోడుగా ఉంటాం’.. ఇది వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని అంశం. ఈ హామీని అమలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ వర్గాలను ఇంత వరకూ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని తొలిసారి ఆలోచన చేసి, పార్టీ మేనిఫెస్టోలో వారికి స్థానం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
► ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌ను నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. మన ప్రభుత్వం వచ్చాక మీ కష్టాలు తీరుస్తానని నాడు వారికి భరోసా ఇచ్చారు.
► అధికారంలోకొచ్చి ఏడాది కాగానే వారికి ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధమయ్యారు.
► ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారు. ఆయా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు.
► రాజకీయాలు, పార్టీలకతీతంగా అర్హులైన నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. మొత్తం 2,47,040 మంది అర్హులగా తేలారు. వీరిలో టైలర్లు 1,25,926 మంది, రజకులు 82,347 మంది, నాయీ బ్రాహ్మణులు 38,767 మంది ఉన్నారు. వీరందరికీ జగనన్న చేదోడు పథకం కింద మొత్తం రూ.247.04 కోట్ల ఆర్థిక సాయం అందనుంది.
► సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment