Ready-made clothing
-
మార్కెట్లోకి యూక్లిడ్ బ్రాండ్ దుస్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ఉన్న ఫార్చూన్ అపారెల్స్ తాజాగా యూక్లిడ్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం షర్ట్స్, ట్రౌజర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు రూ.1,299 వరకు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ కలర్ కాంబో బ్రాండ్‌లో దుస్తులను విక్రయిస్తోంది. ట్రౌజర్స్ కు కావాల్సిన వస్త్రాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు కంపెనీ ప్రమోటర్ జె.కృష్ణమోహన్ ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘30 ఏళ్లుగా దుస్తుల పంపిణీ వ్యాపారంలో ఉన్నాం. ప్రముఖ మిల్లుల నుంచి వస్త్రాన్ని కొనుగోలు చేసి ఆధునిక యూనిట్లలో కుట్టిస్తున్నాం. ఇతర బ్రాండ్లతో పోలిస్తే ధర 40 శాతం దాకా తక్కువగా నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 400 స్టోర్లకు సరఫరా చేస్తున్నామని మరో ప్రమోటర్ జి.అన్నపూర్ణ తెలిపారు. 2016లో దక్షిణాది రాష్ట్రాలకు, 2018కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పా రు. భవిష్యత్తులో యూక్లిడ్ బ్రాండ్‌తో ఔట్లెట్లను తెరుస్తామని వెల్లడించారు. ఫార్చూన్ అపారెల్స్ను క్లాసిక్ పోలో, కీ తదితర బ్రాండ్ల పంపిణీలో ఉన్న క్రివి ఫ్యాబ్స్ ప్రమోట్ చేస్తోంది. -
విస్తరణ బాటలో చర్మాస్..
ఆరు కిలోమీటర్లకో ఔట్లెట్ ♦ ఏటా 1-2 షోరూంలు ప్రారంభిస్తాం ♦ చర్మాస్ గ్రూప్ ప్రెసిడెంట్ పెస్తోంజి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ఉన్న చర్మాస్ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో మొత్తం ఏడు షోరూంలను నిర్వహిస్తున్న ఈ సంస్థ 8వ ఔట్‌లెట్‌ను కొండాపూర్‌లో సిటీ క్యాపిటల్ మాల్లో ఏర్పాటు చేస్తోంది. భాగ్యనగరంతోపాటు ప్రధాన నగరాల్లో మరిన్ని షోరూంలు తెరువనుంది. ఏ కస్టమర్‌కైనా కనీసం ఆరు కిలోమీటర్లలోపే అందుబాటులో స్టోర్ ఉండాలన్నది తమ ధ్యేయమని చర్మాస్ గ్రూప్ చైర్మన్ కె.ఎఫ్.పెస్తోంజి గురువారం తెలిపారు. ఏటా 1-2 ఔట్లెట్లు తెరుస్తామన్నారు. చర్మాస్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డెరైక్టర్లు గుల్ కె పెస్తోంజి, కైజద్ పెస్తోంజితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది సైతం..: చర్మాస్ 300లకుపైగా బ్రాండ్ల దుస్తులను విక్రయిస్తోంది. భారత్‌లో టాప్-5 రిటైల్ సంస్థగా నిలిచింది. గతేడాది రిటైల్ ద్వారా రూ.120 కోట్ల ఆదాయం ఆర్జించింది. రెడీమేడ్ దుస్తుల మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో ఆదాయం ఆర్జిస్తామన్న ధీమాను కె.ఎఫ్.పెస్తోంజి వ్యక్తం చేశారు. కంపెనీ జీడిమెట్ల సమీపంలోని ప్లాంటులో నెలకు 1.50 లక్షల పీసుల దుస్తులను తయారు చేస్తోంది. ఇతర కంపెనీలకూ దుస్తులను సరఫరా చేస్తోంది. జాబ్ వర్క్ ద్వారా గతేడాది రూ.25 కోట్లు సమకూరింది. ఆన్‌లైన్‌లోకి చర్మాస్.. ఆన్లైన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి కంపెనీలతో చర్చిస్తున్నట్టు కైజద్ పెస్తోంజి తెలిపారు. ‘2016కల్లా తొలుత మార్కెట్ ప్లేస్ ద్వారా ఈ-కామర్స్‌లోకి వస్తాం. 2017లో సొంతంగా వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తాం. దుస్తుల విపణిలో ఆన్లైన్ వాటా కేవలం 2 శాతం మాత్రమే. భవిష్యత్తులో ఇది 8-10 శాతానికే పరిమితమవుతుంది. దీనికి కారణం ఇప్పటికీ కస్టమర్లు టచ్ అండ్ ఫీల్ కోరుకుంటున్నారు’ అని చెప్పారు. రూ. 5 కోట్ల విలువైన బహుమతులు.. కంపెనీ ఏర్పాటై 35 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా జూలై 10 నుంచి దీపావళి వరకు ప్రత్యేక స్కీంను ఆఫర్ చేస్తోంది. ప్రతి రూ.1,800ల కొనుగోలుపై కస్టమర్‌కు ఒక స్క్రాచ్ కార్డు ఇస్తారు. రూ.100 మొదలుకొని రూ.10 లక్షల వరకు కచ్చితమైన నగదు బహుమతిని వెంటనే పొందవచ్చు. మొత్తం రూ.5 కోట్లకుపైగా విలువైన నగదు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వంటి బహుమతులు ఉన్నాయని కంపెనీ తెలిపింది. -
కిడ్స్‌వేర్‌లోకి మాంటెకార్లో...
♦ ఏడాదిలోగా ఈ విభాగంలోకి ప్రవేశిస్తాం ♦ 2015-16లో 25% వృద్ధి అంచనా ♦ మాంటెకార్లో ఫ్యాషన్స్ {పెసిడెంట్ స్వపన్ దత్తా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ఉన్న మాంటెకార్లో ఫ్యాషన్స్ కొత్త విభాగంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం పురుషులు, మహిళల రెడీమేడ్స్తోపాటు ట్వీన్స్ మాంటెకార్లో పేరుతో 8-14 ఏళ్ల పిల్లల దుస్తులను సంస్థ విక్రయిస్తోంది. ఎనిమిదేళ్లలోపు పిల్లల దుస్తుల మార్కెట్లోకి వచ్చే ఏడాదికల్లా అడుగు పెడతామని మాంటె కార్లో రిటైల్ ప్రెసిడెంట్ స్వపన్ దత్తా తెలిపారు. హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌క్లూజివ్ షోరూంను జూబ్లీహిల్స్‌లో బుధవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. డిమాండ్ దృష్ట్యా చిన్న పిల్లల దుస్తుల రంగంలోనూ విస్తరిస్తామని చెప్పారు. ట్వీన్స్ ఉప బ్రాండ్ ద్వారా 10% ఆదాయం సమకూరుతోందని తెలిపారు. ఆయనింకా ఏమన్నారంటే.. సీజన్లో 2,000 వెరైటీలు.. కస్టమర్లు విలువను చూస్తారు. పేరున్న బ్రాండ్ దుస్తులను వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్లో ఎంత కాదన్నా 2,000 వెరైటీలను ప్రవేశపెడుతున్నాం. పూర్తి స్థాయి డిజైనింగ్ టీం ఇందుకు నిమగ్నమైంది. అంతర్జాతీయంగా వస్తున్న ఫ్యాషన్‌కు ధీటుగా ఇక్కడ వెరైటీలను తీసుకొస్తున్నాం. యుక్త వయసు యువతుల కోసం మరిన్ని వెరైటీలను ప్రవేశపెడతాం. మహిళల దుస్తుల వాటా టర్నోవర్‌లో 30 శాతం కైవసం చేసుకుంది. నాణ్యమైన ఉన్నితో..: ఉన్ని దుస్తుల ద్వారా 40 శాత ం ఆదాయం వస్తోంది. ఈ విభాగం 15 శాతం వృద్ధి చెందుతోంది. ఐడబ్ల్యుఎస్ ఊల్మార్క్ ఉన్న నాణ్యమైన వస్త్రాలను అమ్ముతున్నాం. ఉత్పత్తుల ధర రూ.50 వేల వరకు ఉంది. సహజ ఉన్ని దుస్తుల పరిశ్రమ పరిమాణం భారత్‌లో సుమారు రూ.1,500 కోట్లుంటుంది. స్థిరాస్తి రంగం మందగమనం వల్ల రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ గతేడాది 8% తిరోగమన వృద్ధి చెందింది. ఈ ఏడాది పరిస్థితుల్లో మార్పు వస్తోంది. వృద్ధి ఖాయం. మాంటెకార్లోను ప్రమోట్ చేస్తున్న ఓస్వాల్ వులెన్ మిల్స్ దేశ, విదేశీ బ్రాండ్లకు దుస్తులను సరఫరా చేస్తోంది. 25 శాతం వృద్ధి అంచనా.. మాంటెకార్లో 2014-15లో రూ.540 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2015-16లో 25 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్ చేశాం. మార్చికల్లా దేశవ్యాప్తంగా కొత్తగా 26 స్టోర్లు రానున్నాయి. ఇందులో హైదరాబాద్‌తోపాటు విజయవాడ, వైజాగ్, కరీంనగర్ తదితర నగరాలు ఉంథ టాయి. ఒక్కో స్టోర్‌కు రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్నాం. భారత్‌లో కంపెనీకి 1,500లకుపైగా టచ్ పాయింట్లున్నాయి. 218 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు ఏర్పాటు చేశాం. లుథియానాలో ఇటీవలే రూ.80 కోట్లతో స్వెటర్ల తయారీ ప్లాంటు నెలకొల్పాం. -
ఏదీ నాటి దర్జా?
బెల్‌బాటమ్, స్కిన్‌టైట్ ప్యాంట్లు.. పొడవు కాలరుచొక్కాలు.. షార్ట మోడల్ షర్టులు.. రఫ్‌లుక్ డ్రెస్సులు.. ఒకటా.. రెండా.. మోడల్ఏదైనా, కుట్టు ఎలాగున్నా తమదైన శైలిలో దుస్తులు కుట్టిన దర్జీలు ఇప్పుడు ఆ దర్జా కోల్పోయారు. రెడీమేడ్ డ్రెస్సుల రాకతో వీరికాళ్ల కదలికలు ఆగిపోయాయి. టకటకమంటూ పని చేసిన వీరి మిషన్లు రంగురంగుల రెడీమేడ్ డ్రెస్సుల రాకతో మూలకు చేరిపోయాయి. పట్టణాల్లో మొదలై మెల్లగా పల్లె నడిబొడ్డుకు చేరిన రెడీమేడ్ హోరు దర్జీల ఉపాధిని గల్లంతు చేసింది. జీవితాలను ముక్కలు చేసింది. కుట్టు చప్పుడును ఆపేసింది. దర్జీ వృత్తికి వన్నెతెచ్చిన కుట్టు మిషన్‌ను ఆవిష్కరించిన విలియమ్స్హో, విలీఫ్జోన్స్ల స్మారకార్థం ఏటా ఫిబ్రవరి 28న ‘టైలర్స్ డే’ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.. నేడు టైలర్స్ డే ⇒ కష్టాల్లో కత్తెర పట్టిన చేతులు ⇒ టైలర్ల జీవితాల్లో అంధకారం ⇒ గతమెంతో ఘనం .. ప్రస్తుతం దుర్భరం ⇒ రెడీమేడ్ దుస్తుల రాకతో ఉపాధి కరువు షాబాద్/ఘట్కేసర్ టౌన్: ఒకప్పుడు దర్జీ లేని ఊరు లేదంటే అతిశయోక్తి లేదు. మనిషికి హుందాతనాన్ని, అందాన్ని ఇచ్చే దుస్తుల కోసం పట్టణాల నుంచి పల్లెల వరకు అందరూ దర్జీల వద్ద క్యూ కట్టేవారు. పండగలు,పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు దగ్గరుండి మరీ దుస్తులను కుట్టించుకునేవారు. ఇదంతా గతం. రెడీమేడ్ దుస్తుల వైభవం ముందు దర్జీలు కుదేలయ్యారు. యువతను ఆకర్షించే నూతన డిజైన్లలో షర్టులు, జీన్స్ ఫ్యాంటులు, చుడీదార్లు, పంజాబీ డ్రెస్‌లు మార్కెట్లో దిగడంతో కుట్టు చప్పుడు ఆగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత రెడీమేడ్ వైపు ఆకర్షితులవుతుండడంతో దర్జీలకు పని లేకుండా పోయింది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారంతా పని లేక ఖాళీగా దర్శనమిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పేరుమోసిన టైలర్లకు మాత్రమే కాసింత ఆదరణ లభిస్తోంది. అది కూడా కేవలం పండగ సీజన్లలో మాత్రమే. ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే వారికి కాసింతైనా పని దొరుకుతోంది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో కొత్తతరం ఇటువైపు రావడం మానేసింది. ఇదే వృత్తిలో ఉన్నవారు కూడా బతుకు వెతుక్కుంటూ మరోదారి వైపు మళ్లుతున్నారు. ఒకప్పుడు 24 గంటలు పనిచేసిన చేతులకు నేడు పనులు లేకుండా పోయాయి. చేతిలోఉన్న పనిని నమ్ముకోలేక, ఇంకో పనిచేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. నేటి ఫ్యాషన్లు, మెళకువలు నేర్చినవారు మాత్రం కాస్తోకూస్తో నిలదొక్కుకుంటున్నారు. భారీగా పెరిగిన ముడి సరుకుల ధరలు పండుగ సీజన్లలో దొరికే కొద్దిపాటి పనిచేసేందుకు అవసరమయ్యే ముడి సరుకుల ధ రలు పెరగటం దర్జీలకు మరో దెబ్బ. ప్రధా నంగా ముడి సరుకులైన దారాలు, జిప్పులు, హుక్కులు, గుండీలు తదితర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు అదనపు భారంగా మారుతున్నాయి. దీంతో చిన్నపాటి షాపు పెట్టిన యజమానికి అందులో పనిచేసే కార్మికులకు ఇద్దరికీ గిట్టుబాటు కావటం లేదు. ప్రస్తుతం పేరు మోసిన టైలర్లు ఒక జత మగవారి బట్టలు కుట్టి ఇచ్చేందుకు గరిష్టంగా రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. ఇక సూట్లకు అయితే రూ.2వేలు, సఫారీ డ్రెస్‌లకు రూ.700 తీసుకుంటున్నారు. ఆడవారికి పంజాబీ డ్రెస్సులు కుట్టివ్వాలంటే రూ.250 నుంచి వివిధ డిజైన్ల బట్టి ధరలు వసూలు చేస్తున్నారు. అయితే ఇంత మొత్తంలో చెల్లించడానికి విని యోగదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో దర్జీలకు పని దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దర్జీల సంక్షేమానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించాలి.. పెళ్లి, పండుగలు ఇతర సీజన్లలో మాత్రమే పని దొరుకుతోంది. మాకు బ్యాంకుల ద్వారా రుణాలందిస్తే ఆధునిక కుట్టుమిషన్లు కొనుక్కుంటాం. మెరుగ్గా, ఫ్యాషన్‌గా కుట్టి జీవనోపాధి పొందుతాం. - బాల్‌రాజ్, ఘట్‌కేసర్‌టౌన్ పని కరువైంది.. మార్కెట్లోకి రెడీమెడ్ దుస్తులు రావడంతో టైలర్‌కు ఆదరణకు త గ్గింది. గతంలో ప్రతి ఒక్కరూ కుట్టిన దుస్తులే తొడిగేవారు. ప్రస్తుతం షోరూంలలోకి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మాకు పని ఉండడం లేదు. - రమేశ్, షాబాద్ ఆదరణ తగ్గింది.. గతంలో దర్జీ పని చేసే వాళ్ల కు మంచి ఆదరణ ఉండేది. ప్రస్తుతం కొత్తకొత్త షోరూం లు, రెడీమేడ్ దుస్తులు వస్తుండడంతో మాకు గిరాకీ తగ్గింది. కాలానుగుణంగా వస్తున్న వివిధ డిజైన్లను నేర్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. -సాజిత్, షాబాద్ పోటీని తట్టుకోలేకపోతున్నాం రెడీమేడ్ దుస్తులు తయారీదారుైలన బహుళజాతి సంస్థల పోటీని తట్టుకోలేకపోతున్నాం. రెడీమేడ్ దుస్తులను తక్కువ ధరల్లో అందించడంతో కుట్టించుకోవడానికి ఎవరూ ముందుకురావడంలేదు. కుట్టుకూలి డబ్బులతో డ్రెస్‌లే లభిస్తుండడంతో మా దగ్గరికి రావడం లేదు. - తుల్జారాం, ఘట్‌కేసర్‌టౌన్ సీజన్లోనే గిరాకీ.. సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో ఇబ్బందులు పడుతున్నాం. గతంలో సొంతంగా టైలర్ షాపు నడుపుకునేవాడిని. ప్రస్తుతం వేరే షాపులో కూలీ పని చేస్తున్నాను. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడే గిరాకీ ఉంటుంది. - రామస్వామి, షాబాద్ -
‘రియల్’తో యువతకు భవిత
పటమటకు చెందిన వెంకట్ డిగ్రీ చదివాడు. ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. రాజధాని ఏర్పాటు తదితర అంశాలతో విజయవాడ నగరానికి ప్రాధాన్యత పెరిగి రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. దీంతో వెంకట్ ఓ సంస్థలో మార్కెటింగ్ ఏజెంట్‌గా చేరాడు. చేతికి చిక్కిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ రంగంలో కష్టపడి టీమ్ లీడర్‌గా ఎదిగాడు. గన్నవరానికి చెందిన రాజేష్ ఎంబీఏ చదివి ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలం విజయవాడలో ఓ కార్పొరేట్ ఆస్పత్రితో నెలకు రూ.7వేలకు ఉద్యోగం చేశాడు. ఎదుగూబొదుగూ లేకపోవడంతో రాజేష్ దృష్టి రియల్ ఎస్టేట్ రంగం వైపునకు మళ్లింది. ఓ ప్రముఖ బిల్డర్ వద్ద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. తర్వాత మార్కెటింగ్ మేనేజర్ అయి ఆర్థికంగా స్థిరపడ్డాడు. విజయవాడ : నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎటూ చూసినా, ప్రస్తుతం ఎవరినీ కదిపినా భూములు, స్థలాలు, అపార్టుమెంటుల ధరలు కొనుగోళ్లు, అమ్మకాలపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం నగరంలో అన్ని వ్యాపారాల కంటే రియల్ ఎస్టేట్ ముమ్మరంగా నడుస్తోంది. బంగారం, రెడీమేడ్ దుస్తులు, షాపింగ్ మాల్స్‌ల వ్యాపారాలు కూడా తగ్గుముఖం పట్టగా... రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. నగరంలో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు, వందలాది మంది బిల్డర్లు, మార్కెటింగ్ ఏజెంట్లు, మధ్యవర్తుల హడావుడితో సందడి నెలకొంది. రియల్ ఎస్టేట్ రంగంలో వందల మంది యువత ఉపాధి పొంది నిలదొక్కుకుంటున్నారు. మార్కెటింగ్‌లో అనుభవం ఉన్న సంస్థలు యువతను ఆకర్షించి వ్యాపార లావాదేవీలను ముమ్మరం చేస్తున్నాయి. పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో దాదాపు 200 నుంచి 300 వరకు మార్కెటింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. వాక్చాతుర్యం ఉంటే రాణింపు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే వాక్చాతుర్యంతో పాటు నిజాయితీగా, నమ్మకంగా ఉండటం అవసరం. ఈ రంగంలో కోట్ల రూపాయులు చేతులు మారుతుంటాయి. నమ్మకంగా, నిజాయితీగా పనిచేస్తే డబ్బు సంపాదించటం తేలిక. ఒక వ్యక్తితో లేదా కుటుంబంతో ఫ్లాటు లేదా స్థలం కొనిపించాలంటే ఓపిగ్గా వారికి దాని ప్రాధాన్యతను వివరించాలి. పెట్టే పెట్టుబడిపై భరోసా కల్పించాలి. ఆ తర్వాత వచ్చే లాభాలు వివరంగా చెప్పగలిగే సమర్థత ఉండాలి. బంగారం షేర్లు బిజినెస్‌లపై అవగాహన ఉంటే ఇందులో రాణించడానికి అవకాశం ఉంటుం ది. అనుభవంతో వేతనం ఈ రంగంలోకి వచ్చే యువతకు రియల్ ఎస్టేట్ సంస్థలు అనుభం, చాకచక్యం తెలివితేటలకు తగ్గట్టు భారీ వేతనాలు ఇస్తున్నాయి. చిన్న సంస్థలు కూడా చేసిన వ్యాపారాన్ని బట్టి ఇన్సెంటివ్‌లు, కమీషన్లు ఇస్తున్నాయి. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే యువత పనితీరును సంస్థలు తొలి ఆరు నెలలు అంచనా వేస్తా యి. రోజుకు నలుగురు క్లయింటను అప్పగిస్తాయి. ఈ విధంగా నెలలో ప్రతి ఒక్కరూ కనీసం వంద మందిని దాకా కలవాలి. ఇందులో కనీసం 10 మందితో ప్లాటు కొనుగోలు చేయించేలా లక్ష్యాలు విధిస్తారు. సాధించిన వారు మంచి వేతనంతో పాటు ఇన్సెంటివ్ కూడా పొందుతారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆస్తుల అమ్మకాలపై రెండు శాతం కమీషన్ పొందుతుంటారు. అదే తరహాలో రియల్ ఏస్టేట్ సంస్థలు కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. ఫ్రీలాన్స్ ఏజెంట్లుగా అవకాశం ఈ రంగంలో మార్కెటింగ్ ఫీల్డ్‌లో అనుభవం సంపాదించాక కొందరు ఏజెంట్లు ఫీలాన్స్గా వ్యాపారం చేస్తున్నారు. 10 నుంచి 15 మంది యువకులను కూడగట్టి అన్ని రియల్ ఏస్టేట్ సంస్థలకు వెళ్లి వారి వెంచర్లను తీసుకుని మార్కెటింగ్ చేస్తుంటారు. వినియోగదారుని అభిరుచిని బట్టి వెంచర్లలో సౌకర్యాలు వసతులు, బ్యాంకులు ఇస్తున్న రుణాల వివరాలు చెప్పి అమ్మకాలు చేసి కమీషన్ పొందుతుంటారు. ఈ రంగంలో ఇటీవల వందలాది మంది వచ్చి సొంత కాళ్లపై నిలదొక్కుకుంటున్నారని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కష్టపడి, నిజాయితీగా పని చేసేవారు త్వరగా మన్నన పొందుతారని తెలిపారు. -
మల్టీ లెవల్ క్లాస్ కార్ పార్కింగ్
ప్యారిస్ : చెన్నై టీనగర్‌లోని ది చెన్నై సిల్క్స్ షోరూమ్‌లో జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మల్టీ లెవల్ క్లాస్ కార్ పార్కింగ్‌ను శనివారం ప్రారంభించారు. ఈశాన్య ఆసియా దేశాల్లో ఉన్న ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ఒకటిగాను, దేశ పారంపర్య వ్యాపార కేంద్రాల్లో ముఖ్యమైనదిగాను చెన్నై, టీనగర్ బాసిల్లుతోంది. ఇక్కడ ఏడాదికి సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఇక్కడ చీరలు, రెడీమేడ్ దుస్తులు, నగలు, గృహోపకరణాలు ముఖ్య వ్యాపారంగా ఉన్నప్పటికినీ గుండు సూది నుంచి ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడ ముఖ్య వ్యాపార సంస్థల్లో ఒకటిగా పేరొందింది చెన్నై సిల్క్స్. ఈ సంస్థ తమ వినియోదారుల సౌకర్యార్థం కొత్త పార్కింగ్ సౌకర్యాన్ని పరిచయం చేసింది. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మల్టీ లెవల్ క్లాస్ కార్ పార్కింగ్ సౌకర్యాన్ని ది చెన్నై సిల్క్స్ సంస్థ చెన్నై, టీనగర్ షోరూంలో ప్రారంభించింది. ఈ కార్ పార్కింగ్‌లో 104 కార్లను ఒకే సారి పార్కింగ్ చేయవచ్చు. వీక్షకులకు దిగ్భ్రాంతిని కలిగించే రీతిలో ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఒక్కొక్క కారును విడి విడిగా నిలిపే విధంగా గ్యాప్ ఉంచి ఈ పార్కింగ్ సౌకర్యంతో రూపొందించారు. సేవే పరమార్థం ఈ మల్టీలెవల్ కార్ పార్కింగ్ పూర్తి ఆటోమెటిక్గాను, అవసరమైతే మాన్యువల్‌గా పనిచేసే విధంగా నిర్మించారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెన్నై సిల్క్స్ చెన్నై బ్రాంచ్ జనరల్ మేనేజర్ పి.ఎ రవీంద్రన్ మాట్లాడుతూ సంతోషంగా వచ్చిన వినియోగదారులు అంతే ఆనందంగా తిరిగి వెళ్లడమే వ్యాపార లక్షణం అన్నారు. ఆ లెక్కన ఒక రోజుకు సరాసరిగా కనీసం 2000 మంది కంటే ఎక్కువగా వినియోగదారులు తమ దుకాణానికి వస్తుంటే, అదే పండుగలు, విశేష దినాల్లో రోజుకు 20,000 మందికి పైగా వస్తున్నట్టు వెల్లడించారు. వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్లాస్ కార్ పార్కింగ్ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇక్కడ ఒక్కొక్క కారు పార్కింగ్ చేయడానికి సుమారు రూ.4 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు. కార్ల పార్కింగ్‌కు తమ ఖాతాదారుల నుంచి ఎటువంటి రుసుమును వసూలు చేయడం లేదని వెల్లడించారు. తమ వినియోగదారులకు అత్యధికంగా సౌకర్యాలను కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకనే షోరూంలో ఏటీఎం యంత్రం ఏర్పాటు, కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్ వంటి అదనపు సౌకర్యాలను కల్పించామన్నారు. అంతేకాకుండా తమ సంస్థ విస్తరణలో భాగంగా ఆగస్టు 27వ తేదీ విల్లుపురంలో మరొక కొత్త షోరూంను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇది దక్షిణ భారతంలో తమ 13వ షోరూం అవుతుందన్నారు. ఈ కొత్త షోరూం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో సంప్రదాయ పసిడి ఆభరణాలు, జౌళి రకాలు, రెడీమేడ్ దుస్తులు, గృహోపకరణాలు అంటూ అన్నింటీని ఒకే చోట వినియోగదారులు కొనుగోలు చేసి ఆనందించవచ్చన్నారు. ఇది మాత్రమే కాకుండా వినియోగదారుల సౌకర్యం, అవసరాన్ని దృష్టిలోకి తీసుకుని ఆన్లైన్ ఆర్డర్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో చెన్నై సిల్క్స్ విల్లుపురంలో డిపార్ట్మెంటల్ స్టోర్‌ను, తిరుప్పూర్‌లో మెడికల్స్‌ను ప్రారంభిస్తుందని వెల్లడించారు. పజిల్ పార్కింగ్ సిస్టమ్ క్లాస్ మల్టీ కార్ పార్కింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంజనీర్ డి.ప్రకాశ్ మాట్లాడుతూ స్థలం, సమయం ఆదా చేయడమే మల్టీ లెవల్ పార్కింగ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ పార్కింగ్ పజిల్ వలే డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇది 8 మీటర్ల వెడల్పు, 62 మీటర్ల పొడవుతో తయారైందన్నారు. ఈ పార్కింగ్‌లో 4 యూనిట్లు ఉండగా ఒక్కొక్క యూనిట్లో 26 కార్లను పార్కింగ్ చేయవచ్చునని తెలిపారు. ప్రతి యూనిట్‌కు ఇద్దరు ఆపరేటర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఒక యూనిట్‌కు 16 కిలోవాట్స్ విద్యుత్ అవసరమవుతుందన్నారు. 2నిమిషాల్లో ఒక కారును బయటకు తీయ డం, లోపలికి పెట్టడం వీలవుతుందన్నారు.