‘రియల్’తో యువతకు భవిత
పటమటకు చెందిన వెంకట్ డిగ్రీ చదివాడు. ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. రాజధాని ఏర్పాటు తదితర అంశాలతో విజయవాడ నగరానికి ప్రాధాన్యత పెరిగి రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. దీంతో వెంకట్ ఓ సంస్థలో మార్కెటింగ్ ఏజెంట్‌గా చేరాడు. చేతికి చిక్కిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ రంగంలో కష్టపడి టీమ్ లీడర్‌గా ఎదిగాడు.
గన్నవరానికి చెందిన రాజేష్ ఎంబీఏ చదివి ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలం విజయవాడలో ఓ కార్పొరేట్ ఆస్పత్రితో నెలకు రూ.7వేలకు ఉద్యోగం చేశాడు. ఎదుగూబొదుగూ లేకపోవడంతో రాజేష్ దృష్టి రియల్ ఎస్టేట్ రంగం వైపునకు మళ్లింది. ఓ ప్రముఖ బిల్డర్ వద్ద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. తర్వాత మార్కెటింగ్ మేనేజర్ అయి ఆర్థికంగా స్థిరపడ్డాడు.
విజయవాడ : నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎటూ చూసినా, ప్రస్తుతం ఎవరినీ కదిపినా భూములు, స్థలాలు, అపార్టుమెంటుల ధరలు కొనుగోళ్లు, అమ్మకాలపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం నగరంలో అన్ని వ్యాపారాల కంటే రియల్ ఎస్టేట్ ముమ్మరంగా నడుస్తోంది. బంగారం, రెడీమేడ్ దుస్తులు, షాపింగ్ మాల్స్‌ల వ్యాపారాలు కూడా తగ్గుముఖం పట్టగా... రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. నగరంలో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు, వందలాది మంది బిల్డర్లు, మార్కెటింగ్ ఏజెంట్లు, మధ్యవర్తుల హడావుడితో సందడి నెలకొంది. రియల్ ఎస్టేట్ రంగంలో వందల మంది యువత ఉపాధి పొంది నిలదొక్కుకుంటున్నారు. మార్కెటింగ్‌లో అనుభవం ఉన్న సంస్థలు యువతను ఆకర్షించి వ్యాపార లావాదేవీలను ముమ్మరం చేస్తున్నాయి. పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో దాదాపు 200 నుంచి 300 వరకు మార్కెటింగ్ సిబ్బంది పని చేస్తున్నారు.
వాక్చాతుర్యం ఉంటే రాణింపు
రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే వాక్చాతుర్యంతో పాటు నిజాయితీగా, నమ్మకంగా ఉండటం అవసరం. ఈ రంగంలో కోట్ల రూపాయులు చేతులు మారుతుంటాయి. నమ్మకంగా, నిజాయితీగా పనిచేస్తే డబ్బు సంపాదించటం తేలిక. ఒక వ్యక్తితో లేదా కుటుంబంతో ఫ్లాటు లేదా స్థలం కొనిపించాలంటే ఓపిగ్గా వారికి దాని ప్రాధాన్యతను వివరించాలి. పెట్టే పెట్టుబడిపై భరోసా కల్పించాలి. ఆ తర్వాత వచ్చే లాభాలు వివరంగా చెప్పగలిగే సమర్థత ఉండాలి. బంగారం షేర్లు బిజినెస్‌లపై అవగాహన ఉంటే ఇందులో రాణించడానికి అవకాశం ఉంటుం ది.
అనుభవంతో వేతనం
ఈ రంగంలోకి వచ్చే యువతకు రియల్ ఎస్టేట్ సంస్థలు అనుభం, చాకచక్యం తెలివితేటలకు తగ్గట్టు భారీ వేతనాలు ఇస్తున్నాయి. చిన్న సంస్థలు కూడా చేసిన వ్యాపారాన్ని బట్టి ఇన్సెంటివ్‌లు, కమీషన్‌లు ఇస్తున్నాయి. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే యువత పనితీరును సంస్థలు తొలి ఆరు నెలలు అంచనా వేస్తా యి. రోజుకు నలుగురు క్లయింటను అప్పగిస్తాయి. ఈ విధంగా నెలలో ప్రతి ఒక్కరూ కనీసం వంద మందిని దాకా కలవాలి. ఇందులో కనీసం 10 మందితో ప్లాటు కొనుగోలు చేయించేలా లక్ష్యాలు విధిస్తారు. సాధించిన వారు మంచి వేతనంతో పాటు ఇన్సెంటివ్ కూడా పొందుతారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆస్తుల అమ్మకాలపై రెండు శాతం కమీషన్ పొందుతుంటారు. అదే తరహాలో రియల్ ఏస్టేట్ సంస్థలు కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి.
ఫ్రీలాన్స్ ఏజెంట్లుగా అవకాశం
ఈ రంగంలో మార్కెటింగ్ ఫీల్డ్‌లో అనుభవం సంపాదించాక కొందరు ఏజెంట్లు ఫీలాన్స్‌గా వ్యాపారం చేస్తున్నారు. 10 నుంచి 15 మంది యువకులను కూడగట్టి అన్ని రియల్ ఏస్టేట్ సంస్థలకు వెళ్లి వారి వెంచర్లను తీసుకుని మార్కెటింగ్ చేస్తుంటారు. వినియోగదారుని అభిరుచిని బట్టి వెంచర్లలో సౌకర్యాలు వసతులు, బ్యాంకులు ఇస్తున్న రుణాల వివరాలు చెప్పి అమ్మకాలు చేసి కమీషన్ పొందుతుంటారు. ఈ రంగంలో ఇటీవల వందలాది మంది వచ్చి సొంత కాళ్లపై నిలదొక్కుకుంటున్నారని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కష్టపడి, నిజాయితీగా పని చేసేవారు త్వరగా మన్నన పొందుతారని తెలిపారు.