మల్టీ లెవల్ క్లాస్ కార్ పార్కింగ్
ప్యారిస్ : చెన్నై టీనగర్‌లోని ది చెన్నై సిల్క్స్ షోరూమ్‌లో జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మల్టీ లెవల్ క్లాస్ కార్ పార్కింగ్‌ను శనివారం ప్రారంభించారు. ఈశాన్య ఆసియా దేశాల్లో ఉన్న ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ఒకటిగాను, దేశ పారంపర్య వ్యాపార కేంద్రాల్లో ముఖ్యమైనదిగాను చెన్నై, టీనగర్ బాసిల్లుతోంది. ఇక్కడ ఏడాదికి సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఇక్కడ చీరలు, రెడీమేడ్ దుస్తులు, నగలు, గృహోపకరణాలు ముఖ్య వ్యాపారంగా ఉన్నప్పటికినీ గుండు సూది నుంచి ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడ ముఖ్య వ్యాపార సంస్థల్లో ఒకటిగా పేరొందింది చెన్నై సిల్క్స్. ఈ సంస్థ తమ వినియోదారుల సౌకర్యార్థం కొత్త పార్కింగ్ సౌకర్యాన్ని పరిచయం చేసింది. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మల్టీ లెవల్ క్లాస్ కార్ పార్కింగ్ సౌకర్యాన్ని ది చెన్నై సిల్క్స్ సంస్థ చెన్నై, టీనగర్ షోరూంలో ప్రారంభించింది. ఈ కార్ పార్కింగ్‌లో 104 కార్లను ఒకే సారి పార్కింగ్ చేయవచ్చు. వీక్షకులకు దిగ్భ్రాంతిని కలిగించే రీతిలో ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఒక్కొక్క కారును విడి విడిగా నిలిపే విధంగా గ్యాప్ ఉంచి ఈ పార్కింగ్ సౌకర్యంతో రూపొందించారు.
సేవే పరమార్థం
ఈ మల్టీలెవల్ కార్ పార్కింగ్ పూర్తి ఆటోమెటిక్‌గాను, అవసరమైతే మాన్యువల్‌గా పనిచేసే విధంగా నిర్మించారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెన్నై సిల్క్స్ చెన్నై బ్రాంచ్ జనరల్ మేనేజర్ పి.ఎ రవీంద్రన్ మాట్లాడుతూ సంతోషంగా వచ్చిన వినియోగదారులు అంతే ఆనందంగా తిరిగి వెళ్లడమే వ్యాపార లక్షణం అన్నారు. ఆ లెక్కన ఒక రోజుకు సరాసరిగా కనీసం 2000 మంది కంటే ఎక్కువగా వినియోగదారులు తమ దుకాణానికి వస్తుంటే, అదే పండుగలు, విశేష దినాల్లో రోజుకు 20,000 మందికి పైగా వస్తున్నట్టు వెల్లడించారు. వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్లాస్ కార్ పార్కింగ్ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇక్కడ ఒక్కొక్క కారు పార్కింగ్ చేయడానికి సుమారు రూ.4 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు.
కార్ల పార్కింగ్‌కు తమ ఖాతాదారుల నుంచి ఎటువంటి రుసుమును వసూలు చేయడం లేదని వెల్లడించారు. తమ వినియోగదారులకు అత్యధికంగా సౌకర్యాలను కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకనే షోరూంలో ఏటీఎం యంత్రం ఏర్పాటు, కరెన్సీ ఎక్స్‌చేంజ్ కౌంటర్ వంటి అదనపు సౌకర్యాలను కల్పించామన్నారు. అంతేకాకుండా తమ సంస్థ విస్తరణలో భాగంగా ఆగస్టు 27వ తేదీ విల్లుపురంలో మరొక కొత్త షోరూంను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇది దక్షిణ భారతంలో తమ 13వ షోరూం అవుతుందన్నారు. ఈ కొత్త షోరూం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఇందులో సంప్రదాయ పసిడి ఆభరణాలు, జౌళి రకాలు, రెడీమేడ్ దుస్తులు, గృహోపకరణాలు అంటూ అన్నింటీని ఒకే చోట వినియోగదారులు కొనుగోలు చేసి ఆనందించవచ్చన్నారు. ఇది మాత్రమే కాకుండా వినియోగదారుల సౌకర్యం, అవసరాన్ని దృష్టిలోకి తీసుకుని ఆన్‌లైన్ ఆర్డర్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో చెన్నై సిల్క్స్ విల్లుపురంలో డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ను, తిరుప్పూర్‌లో మెడికల్స్‌ను ప్రారంభిస్తుందని వెల్లడించారు.
పజిల్ పార్కింగ్ సిస్టమ్
క్లాస్ మల్టీ కార్ పార్కింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంజనీర్ డి.ప్రకాశ్ మాట్లాడుతూ స్థలం, సమయం ఆదా చేయడమే మల్టీ లెవల్ పార్కింగ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ పార్కింగ్ పజిల్ వలే డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇది 8 మీటర్ల వెడల్పు, 62 మీటర్ల పొడవుతో తయారైందన్నారు. ఈ పార్కింగ్‌లో 4 యూనిట్లు ఉండగా ఒక్కొక్క యూనిట్‌లో 26 కార్లను పార్కింగ్ చేయవచ్చునని తెలిపారు. ప్రతి యూనిట్‌కు ఇద్దరు ఆపరేటర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఒక యూనిట్‌కు 16 కిలోవాట్స్ విద్యుత్ అవసరమవుతుందన్నారు. 2నిమిషాల్లో ఒక కారును బయటకు తీయ డం, లోపలికి పెట్టడం వీలవుతుందన్నారు.