మార్కెట్లోకి యూక్లిడ్ బ్రాండ్ దుస్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ఉన్న ఫార్చూన్ అపారెల్స్ తాజాగా యూక్లిడ్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం షర్ట్స్, ట్రౌజర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు రూ.1,299 వరకు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ కలర్ కాంబో బ్రాండ్‌లో దుస్తులను విక్రయిస్తోంది. ట్రౌజర్స్ కు కావాల్సిన వస్త్రాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు కంపెనీ ప్రమోటర్ జె.కృష్ణమోహన్ ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘30 ఏళ్లుగా దుస్తుల పంపిణీ వ్యాపారంలో ఉన్నాం. ప్రముఖ మిల్లుల నుంచి వస్త్రాన్ని కొనుగోలు చేసి ఆధునిక యూనిట్లలో కుట్టిస్తున్నాం.
ఇతర బ్రాండ్లతో పోలిస్తే ధర 40 శాతం దాకా తక్కువగా నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 400 స్టోర్లకు సరఫరా చేస్తున్నామని మరో ప్రమోటర్ జి.అన్నపూర్ణ తెలిపారు. 2016లో దక్షిణాది రాష్ట్రాలకు, 2018కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పా రు. భవిష్యత్తులో యూక్లిడ్ బ్రాండ్‌తో ఔట్‌లెట్లను తెరుస్తామని వెల్లడించారు. ఫార్చూన్ అపారెల్స్‌ను క్లాసిక్ పోలో, కీ తదితర బ్రాండ్ల పంపిణీలో ఉన్న క్రివి ఫ్యాబ్స్ ప్రమోట్ చేస్తోంది.