బతుకు యుద్ధంలో రోజుకో చావు | A true tragedy of North Telangana districts | Sakshi
Sakshi News home page

బతుకు యుద్ధంలో రోజుకో చావు

Published Mon, May 22 2017 2:42 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

బతుకు యుద్ధంలో రోజుకో చావు - Sakshi

బతుకు యుద్ధంలో రోజుకో చావు

- ఎడారి దేశాలకు వలస వెళ్లి మృత్యువాత
- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పల్లెపల్లెనా కన్నీటి కథలే..


సాక్షి నెట్‌వర్క్‌: ఎడారి దేశాల్లో బడుగు జీవుల బతుకు యుద్ధంలో రోజుకో చావు వినాల్సి వస్తోంది. నాలుగు దీనార్లు చేతిలో పడితే జీవితం మారిపోతుందనే నమ్మకం వమ్మయిపోతోంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు, అప్పులు తీర్చేసేందుకు పొట్ట చేతబట్టుకుని గల్ఫ్‌ బాట పడుతోన్న వలస జీవులు.. అక్కడ అనుకోని ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఏ తలుపు తట్టినా వలస బతుకుల విషాదమే పలకరిస్తోంది. గడచిన పది నెలల్లో గల్ఫ్‌ దేశాల్లో 345 మంది వివిధ ప్రమాదాల్లో మరణిస్తే.. అందులో 244 మంది తెలంగాణ బిడ్డలే ఉన్నారు. మరో 96 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా.. ఐదుగురు ఇతర రాష్ట్రాల వారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసుస్టేషన్‌ రికార్డుల ప్రకారం ఏటా దాదాపు 200 శవపేటికలు గల్ఫ్‌ దేశాల నుంచి తెలంగాణ పల్లెలకు వస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మంది వలసజీవులు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని లెక్కలు చెబుతున్నాయి.

లెక్కాపత్రం లేని ‘వలస’
రాష్ట్రంలో వలసలకు సంబంధించి సక్రమమైన అధ్యయనం కానీ, రికార్డులు కానీ ఏమీ లేవు. స్వచ్ఛంద సంస్థల రికార్డుల ప్రకారం.. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు అత్యధికంగా వలస వెళ్తున్న వారిలో పురుషులు 95 శాతం, మహిళలు 5 శాతం మేర ఉన్నారు. పురుషుల్లో 50 శాతం మంది కార్మికులే. వీరంతా 18–30 ఏళ్లలోపు వారే. ఇందులో ప్రాథమిక విద్యను అభ్యసించిన వారు 35 శాతం కాగా, 21 శాతం మంది నిరక్షరాస్యులు. గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న వారిలో 85 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారే కాగా.. 38 శాతం మందికి కనీసం గుంట భూమి కూడా లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని మొత్తం జనాభాలో 61.88 లక్షల మంది అంతర్‌ జిల్లా, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ వలసల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలతోపాటు హైదరాబాద్‌ పాత నగరం నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. వీరంతా గల్ఫ్‌ కోఆపరేషన్‌ (జీసీసీ) దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌తో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాలకు వెళ్తున్నారు. గల్ఫ్‌తో సహా 18 ఈసీఎన్‌ఆర్‌ (ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ రిక్వయిర్డ్‌) దేశాలలో 85 లక్షల మంది భారతీయులు ఉన్నట్టు ప్రవాస భారతీయ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇందులో తెలంగాణకు చెందినవారు 10 లక్షల మంది ఉన్నట్టు అంచనా.

అనారోగ్యం.. ప్రమాదాలు..
గల్ఫ్‌ దేశాల్లో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి చనిపోతున్నవారు కొందరైతే.. ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన బెంగతో మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గుండెపోటు మరణాలూ పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. ప్రమాదాలకు గురైన సందర్భాల్లో చాలా మందికి తగిన వైద్యం అందడం లేదు. నిబంధనల పేరు చెప్పి.. రకరకాల సాకులతో అక్కడ క్షతగాత్రుల్ని పట్టించుకునే దిక్కు ఉండటం లేదు. అలాగని వెంటనే స్వదేశానికి వచ్చే ఏర్పాటూ కరువవుతోంది. చివరకు అక్కడే ప్రాణాలు విడిచి.. నెలల తరబడి జాప్యం తర్వాత స్వగ్రామాలకు మృతదేహాలు చేరుతున్నాయి. అప్పటి వరకు బాధిత కుటుంబాలు మానసికంగా చిత్రవధ అనుభవిస్తున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో వీసా, పాస్‌పోర్టు ఉన్న వారికే వైద్య సదుపాయాలు వర్తిస్తాయి. టూరిస్టు వీసాపై వెళ్లిన వారికి.. అక్రమ నివాసితులకు ఉచిత వైద్యం లభించదు. వీసా, లేబర్‌ కార్డు లేకపోతే.. పక్కనే ఆసుపత్రులున్నా ప్రయోజనం ఉండదు. చాలామంది ఏజెంట్ల చేతిలో మోసపోయి టూరిస్ట్‌ వీసాలపై వెళ్తూ.. అక్కడ లభించే సౌకర్యాలను కోల్పోతున్నారు. దీంతో ఏదైనా ప్రమాదానికి గురైతే సకాలంలో వైద్యానికి నోచుకోలేకపోతున్నారు.

పరిహారం.. పరిహాసం..
ప్రమాదాల్లో తమ వారిని కోల్పోతున్న బాధిత కుటుంబాలు చివరకు పరిహారానికి కూడా నోచుకోవడం లేదు. మచ్చుకు ఓ ఉదాహరణ.. కిందటేడాది అక్టోబరు 19న అబుదాబిలో ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న 320 మంది కార్మికుల కోసం ఓ రేకుల షెడ్డులో క్యాంపు ఏర్పాటు చేశారు. షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి ఇందులోని కొన్ని బ్లాకులు తగలబడిపోయాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు తెలంగాణ జిల్లాల వారే. వారిలో ముగ్గురు నిర్మల్‌ జిల్లా వాసులు. వీరిలో సేవానాయక్‌ తండాకు చెందిన ప్రకాశ్‌నాయక్‌ (29) ఒకరు. ఆయన ఈ ప్రమాదానికి రెండు నెలల ముందే అబుదాబి వెళ్లాడు. ప్రమాదంలో నిలువునా కాలి బూడిదైపోయాడు. చావు వార్త స్వగ్రామానికి చేరింది. కానీ మృతదేహం ఆరు నెలలకు వచ్చింది. అప్పటిదాకా ఆయన కుటుంబం కన్నీరుమున్నీరైంది. వాస్తవానికి గల్ఫ్‌ కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం ప్రకాశ్‌కు సౌదీ ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల వరకు పరిహారం అందాలి. కానీ.. తీరా ఆర్నెళ్ల తర్వాత ప్రకాశ్‌ గుండెపోటుతో చనిపోయాడని తేల్చి శవాన్ని అప్పగించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడా కుటుంబానికి పైసా కూడా దక్కే పరిస్థితి లేదు. చాలా కేసుల్లోనూ ఇలాగే జరుగుతోంది.

కేరళ విధానంలో ఏముంది?
టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన వెంటనే గల్ఫ్‌ వలస కార్మికుల కోసం కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని హామీనిచ్చింది. అసలు కేరళ విధానం ఏమిటి? అందులో ఏముందంటే..?
► గల్ఫ్‌ వెళ్లే ప్రవాస కేరళవాసుల కోసం ప్రత్యేక శాఖ ఉంది. దీని ఆధ్వర్యంలో ‘నోర్కా రూట్స్‌’పేరిట విస్తృత స్థాయి యంత్రాంగంతో కూడిన విభాగం పనిచేస్తోంది.
► నోర్కా (నాన్‌ రెసిడెంట్స్‌ కేరలైట్స్‌ అఫైర్స్‌) 1996లో ఏర్పాటైంది.
► కేరళ ప్రభుత్వం వలస కార్మికులకు 2008 ఆగస్టు నుంచి ప్రవాసీ గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది.
► రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్లిన కేరళవాసులకు, స్వదేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి ‘సాంత్వన పథకం’పేరిట ఏటా రూ.లక్షలోపు కుటుంబ ఆదాయం గల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి రూ.50 వేలు వైద్య చికిత్సలకు అందిస్తోంది.
► వలస కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.లక్ష సాయం అందచేస్తోంది.
► సాధారణ వ్యాధులకు రూ.20 వేలు, వలస కార్మికుల పిల్లల పెళ్లికి రూ.15 వేలు, వికలాంగులకు అవసరమైన పరికరాల కోసం రూ.10 వేలు అందిస్తోంది.
► తమ రాష్ట్రానికి చెందిన వారు ఇతర దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలకు తీసుకురావడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
► వలస వెళ్లగోరే కార్మికులకు కేరళ ప్రభుత్వం ఐఐటీల ద్వారా వృత్తి శిక్షణను అందిస్తోంది. ఫీజులో 80 శాతం ప్రభుత్వమే భరిస్తోంది. 20 శాతం మాత్రమే అభ్యర్థి చెల్లించాలి.
► ఇతర దేశాలకు వెళ్లాలనుకునే ఉద్యోగులు, కార్మికుల కోసం ‘ఫ్రీ డిఫార్చర్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌’నిర్వహిస్తోంది. కేరళలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గల కార్యాలయాల్లో రూ.200 చెల్లిస్తే తగిన శిక్షణనిస్తారు.
► ‘నోర్కా’జారీ చేసే ధ్రువీకరణ పత్రాలపై వచ్చే ఆదాయంలో 10 శాతాన్ని చైర్మన్‌ నిధిలో జమ చేస్తారు. వీటిని నిరుపేద వలస కార్మిక కుటుంబాల ప్రయోజనాలకు వెచ్చిస్తారు.
► 2008లో కేరళ ప్రభుత్వం ప్రవాసీ సంక్షేమ నిధి చట్టాన్ని రూపొందించింది. 18–55 మధ్య వయస్కులు ఇందులో చేరడానికి అర్హులు. రూ.200 ఫీజు. ప్రస్తుతం 85 వేల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. వికలాంగులకు, వివాహాలకు, గృహ నిర్మాణానికి, విద్య, వైద్యానికి సాయం అందిస్తారు. పింఛన్‌ కూడా ఇస్తారు.
► కేరళతో పాటు పంజాబ్‌ ప్రభుత్వం నిర్మాణాత్మక విధానాలతో గల్ఫ్‌ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నాయి.

లైసెన్స్‌ పొందిన ఏజెంట్లే అర్హులు..
ఇమిగ్రేషన్‌ యాక్ట్‌–1983 ప్రకారం గల్ఫ్‌తో సహా 18 దేశాలకు కార్మికులను విదేశీ ఉద్యోగాలలో భర్తీ చేయడానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్‌ పొందిన ఏజెంట్లు మాత్రమే అర్హులు. ఈ లైసెన్స్‌ పొందడానికి రూ.50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌ చేసి, తగిన కార్యాలయం కలిగి ఉండాలి. ఇలాంటి లైసెన్స్‌డ్‌ ఏజెన్సీలు దేశంలో 1,900 వరకు ఉన్నాయి. ఇవి తెలంగాణలో 31 ఉన్నాయి. వీటి కింద వేలాది మంది సబ్‌ ఏజెంట్లు, అనధికార ఏజెంట్లు పని చేస్తున్నారు.

ఇంటిపైనే ఆలోచన.. చెప్పుకోలేని ఆవేదన
గల్ఫ్‌ వెళ్తే చాలు.. గట్టెక్కిపోతాం.. అనేదే అక్కడకు వెళ్లాలనుకునే వారందరి ఆలోచన. అక్కడ సంపాదనపై ఎక్కువ ఊహించుకోవడం, ఎన్నో ఆశలతో వెళ్లాక తీరా అక్కడ అనుకున్నంతగా రాకపోవడంతో చాలామంది డీలా పడిపోతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. అసలే ఇక్కడ అప్పులు.. దానికితోడు వెళ్లడానికి మరికొంత అప్పు.. చాలీచాలని వేతనంతో ఈ అప్పులెలా తీర్చాలి.. కుటుంబాన్ని ఎలా పోషించాలన్న బెంగతోపాటు కుటుంబానికి దూరంగా ఒంటరితనంతో గడపడం, పని ఒత్తిడి, ఇవన్నీ కార్మికులను మనోవ్యధకు గురిచేస్తున్నాయి. ఎక్కువగా ఒప్పంద మోసాలతో పలువురు దగా పడుతున్నారు. దీంతో అక్కడ కనీసం తామే బతకలేని పరిస్థితులూ ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే మనోవ్యధతో చాలామంది ప్రాణాలు విడుస్తున్నారు. ఏటా వివిధ కారణాలతో గల్ఫ్‌లో సగటున 200 మంది వరకు చనిపోతున్నారని అంచనా. వీరిలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారు 90 మంది వరకు ఉంటున్నారు. మానసిక వ్యధతో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారూ పెద్దసంఖ్యలోనే ఉంటున్నారు.  

ఏడేళ్ల తర్వాత శవమై..
ఎలిగెట్టి రాజేశ్వర్‌(41).. ఆదిలాబాద్‌ జిల్లా కూచ న్‌పల్లి. ఉన్న కొద్ది పొలంలో ఎవుసం చేస్తూ బాగా బతికిన రైతు. కాలం కలిసిరాక.. అప్పుల పాల య్యాడు. కుటుంబాన్ని పోషించేందుకు 2010లో ఒమన్‌ వెళ్లాడు. ఏడేళ్ల పాటు ఇంటి ముఖం చూడలేదు. ఓ రోజు భవన నిర్మాణ పనులు చేస్తూ గాయపడ్డాడు. అక్కడ పట్టించుకునే వారెవరూ లేక.. చికిత్స అందక ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రాణాలు విడిచాడు. రెండు నెలలకు రాజేశ్వర్‌ మృతదేహం స్వగ్రామానికి చేరింది. ‘పైలం’ అని చెప్పి వెళ్లిన ఇంటి పెద్ద.. ఏడేళ్ల తర్వాత శవమై తిరిగి రావడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. అప్పులు తీరలేదు. పూట గడవడం లేదు. ఇప్పుడు ఆయన కొడుకు సంతోష్‌ కూడా ఒమన్‌ వెళ్లాడు.


ఎన్నెన్నో కన్నీటి గాథలు
అందరినీ అనాథల్ని చేసి
జగిత్యాల జిల్లా మద్దనూర్‌ గ్రామానికి చెందిన తరాల రాజేశ్‌(28) డ్రైవర్‌. ఇక్కడ తగిన సంపాదన లేక రెండేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. ఈ ఏడాది మార్చి 12న సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇరవై రోజుల తర్వాత మృత దేహం స్వగ్రామానికి చేరింది. చెట్టంత కొడుకును పోగొట్టుకుని ఆయన తల్లిదండ్రులు, భర్తను పోగొట్టుకుని భార్య విజయ కుంగిపోయారు. అత్తమామల్ని, నా ఇద్దరు ఆడబిడ్డల్ని ఎలా సాకాలని విజయ దీనంగా అడుగుతోంది.

అప్పుల కుప్పతో గుండెపోటు..
జగిత్యాల జిల్లా సాతారానికి చెందిన కొక్కు శంకర్‌ వ్యవసాయంలో దెబ్బ తిన్నాడు. పదేళ్ల క్రితం వెళ్లి దుబాయ్, సౌదీలలో దొరికిన పనులు చేశాడు. తిరిగొచ్చి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. ఈ క్రమంలో మిగిలిన అప్పులు తీర్చేందుకు ఏడాది క్రితం మళ్లీ బహ్రెయిన్‌ వెళ్లాడు. ఈసారి జీతం పెద్దగా లేదు. కుటుంబాన్ని ఆదుకోలేకపోతున్నాననే బాధతో.. గత ఫిబ్రవరి 28న పనిలోనే గుండెపోటుతో మరణిం చాడు. ఆ కుటుంబం వైపు ఇంకా రూ.2.5లక్షల అప్పు చూస్తోంది.

వ్యాధుల బారిన పడుతున్నారు
గల్ఫ్‌లో మనోళ్ల మరణాలకు అనేక కారణాలున్నాయి. ఏళ్ల తరబడి కుటుంబానికి దూరంగా ఉండటం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, అక్కడి వాతావరణంలో ఇమడలేకపోవడం వంటి కారణాలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆహారం, నిద్రలో సమయపాలన పాటించకపోవడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యం గా కిడ్నీ సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. పని ఒత్తిడి గుండెజబ్బులకు దారితీస్తోంది. గల్ఫ్‌లో వైద్యం చాలా ఖరీదైనది. వైద్య బీమా సౌకర్యాలు లేక చాలామంది ప్రాణాలు విడుస్తున్నారు.
– డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల

సర్కారుకు పట్టింపు లేదు..
గల్ఫ్‌ కార్మిక చట్టాల ప్రకారం అక్కడ విధుల్లో చనిపోయిన వారికి రూ.10లక్షల నుంచి రూ.40లక్షల వరకు పరిహారం ఇవ్వా లి. కానీ చాలా కేసుల రిపోర్ట్‌ను పరిమారం పరిధిలోకి రాని గుండెపోటుగా చూపుతున్నారు.గతేడాది అబుదాబిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు తెలంగాణ కార్మికులు సజీ వదహనమైతే ఒక్కరికి కూడా అటు గల్ఫ్‌ ప్రభుత్వం, ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైసా ఇవ్వలేదు. ఎందరో ఆటగాళ్లు, పాట గాళ్లకు లక్షలకు లక్షలు ఇస్తున్న రాష్ట్రం గల్ఫ్‌ కార్మికుల పట్టించుకోకపోవడం అన్యాయం.
– రుద్రశంకర్, తెలంగాణ ప్రవాస భారతీయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement