గోల్డ్‌ ఫ్రం గల్ఫ్‌ | gold smuggling from gulf | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ ఫ్రం గల్ఫ్‌

Published Mon, Nov 6 2017 8:30 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

gold smuggling from gulf - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరానికి అక్రమంగా రవాణా అవుతున్న బంగారంలో అత్యధికశాతం గల్ఫ్‌ దేశాల నుంచే జరుగుతోంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ ఆధీనంలోని ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఏఐయూ) అధికారులు స్వాధీనం చేసుకున్న పసిడిలో అత్యధికం ఈ దేశాల నుంచి వచ్చిందే. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్‌–అక్టోబర్‌) ఏఐయూ అధికారులు మొత్తం 93 కేసులు నమోదు చేసి 37.17 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రెండు మినహా మిగిలిన స్మగ్లర్లంతా గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారేనని స్పష్టమైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలతో పోలీస్తే ఈ ఏడాది అక్రమ రవాణా 272 శాతం పెరిగినట్లు కస్టమ్స్‌ అధికారులు పేర్కొంటున్నారు.  

స్మగ్లర్లకు స్వర్గాధామంగా దుబాయ్‌...  
హవాలా రాకెట్లకు పేరొందిన దుబాయ్‌ ఇప్పుడు బంగారం అక్రమ రవాణాకూ కేంద్రంగా మారింది. ఆ దేశంలో ఆదాయపు పన్ను లేకపోవడంతో మనీలాండరింగ్‌ వ్యవహారమే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడి నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి, దాన్ని బంగారంగా మార్చి తిరిగి తీసుకువస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలోనైనా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అతడిపై ఎలాంటి విచారణ ఉండదు. దానిని విమానంలోకి తీసుకువచ్చేప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు అధికారులు సైతం అభ్యంతరం పెట్టరు. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడ చాలా తేలిగ్గా విమానంలోకి బంగారాన్ని తరలించేస్తున్న స్మగ్లర్లు ఇక్కడ బయటకు తీసుకువచ్చే సమయాల్లోనే పట్టుబడుతున్నారు.  

శస్త్ర చికిత్సతో రెక్టమ్‌ కన్సీల్‌మెంట్‌...
బంగారం అక్రమ రవాణాకు సహకరించే మధ్యవర్తులను క్యారియర్లు అంటారు. అత్యధిక శాతం క్యారియర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్‌ బాక్సులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పౌడర్‌ డబ్బాలతో పాటు మెబైల్‌ చార్జర్స్‌లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తరువాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తీసుకువచ్చారు. ఆపై రెక్టమ్‌ కన్సీల్‌మెంట్‌ జోరుగా సాగుతోందని కస్టమ్స్‌ అధికారులు పేర్కొంటున్నారు. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు స్మగ్లర్లు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్‌ పేపర్‌ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఇలా కొలంబో నుంచి బంగారం తీసుకువచ్చిన ఇద్దరిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.  

మధ్యసీట్లలోనే అసలు మతలబు...
వ్యవస్థీకృత ముఠాలకు పక్కాగా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తూ బంగారం అక్రమ రవాణా సాగిస్తున్నాయి. అక్రమ బంగారంతో దుబాయ్‌ నుంచి బయలుదేరే ఓ ఏజెంట్‌ ఈ ఇంటర్నేషనల్‌ కమ్‌ డొమెస్టిక్‌ విమానంలో ఢిల్లీ లేదా ముంబై వరకు వస్తాడు. బంగారం ఉన్న బ్యాగ్‌ను అతడు కూర్చున్న సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా ఆయా మెట్రోల్లో విమానం దిగి కస్టమ్స్‌ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తాడు. నేరుగా డిపాచర్‌ లాంజ్‌కు వెళ్లి అదే విమానంలో హైదరాబాద్‌ వెళ్లడానికి అనువుగా ముందే బుక్‌ చేసుకున్న టిక్కెట్‌ ఆధారంగా దేశవాళీ ప్రయాణికుడిగా ఎక్కి అంతకు ముందు కూర్చున్న సీటులోనే కూర్చుంటాడు. అనుకున్న ప్రకారం అతడు హైదరాబాద్‌ చేరినా... దేశవాళీ ప్రయాణికుడు రావడంతో ఎలాంటి కస్టమ్స్‌ తనిఖీలు లేకుండా విమానాశ్రయం నుంచి బంగారంతో సహా బయటకు వచ్చేస్తున్నాడు. కొన్ని సంస్థలు విమాన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేప్పుడు ప్రయాణికుడు తమకు అనువైన సీటునూ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ‘చూస్‌ యువర్‌ సీట్‌’ పేరుతో ప్రయాణికుల సౌకర్యార్థం విమానయాన సంస్థ ఈ అవకాశం కల్పించింది. దీనిని స్మగ్లర్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

 272 శాతం పెరిగిన స్మగ్లింగ్‌...
కస్టమ్స్‌ అ«ధికారులు సైతం ఏప్రిల్‌–మార్చి ఆర్థిక సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. గత ఏడాది ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య 25 కేసులు నమోదు చేసిన కస్టమ్స్‌ అధికారులు 11.45 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది అదే సమయంలో మొత్తం 93 కేసులు నమోదు చేసి 37.17 కేజీలు స్వాధీనం చేసుకోవడంతో కేసుల సంఖ్య 272 శాతం పెరిగినట్‌లైందని కస్టమ్స్‌ అధికారులు చెప్తున్నారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం వెనుక భారీ కుట్ర లేకపోతే దానిని తిరిగి అప్పగించడానికే కస్టమ్స్‌ అధికారులు ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్‌ బంగారం తనదే అని క్‌లైమ్‌ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్‌ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఇలా క్‌లైమ్‌ చేయాలంటే వైట్‌ మనీ జమచేయాల్సి ఉండటంతో అనేక మంది వదిలేస్తారు.  ఒకవేళ ఎవరూ క్‌లైమ్‌ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైల్లో కస్టమ్స్‌ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం వేయడం ద్వారా విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. ఈ కేసుల్లో అరెస్టులు, శిక్షలు అత్యంత అరుదని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement