సాక్షి, హైదరాబాద్ : గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సు పొండం ఎలా అనే విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు హైదరాబాద్ నాంపల్లిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పీఓఈ) కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్లు, కొత్తగా లైసెన్సు పొందగోరే ఆశావహులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఎంసీ లూథర్, హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ మధుసూదన్‌రావులు పలువురి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
గల్ఫ్‌తో సహా 18 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే భారతీయులను భర్తీ చేయడానికి ఎమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సు పొందడం తప్పనిసరి అని తెలిపారు. భారత దేశంలో 1200 పైచిలుకు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉండగా గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఏజెన్సీలు లేవని, ఏజెన్సీ లైసెన్సు పొందడానికి రూ.50 లక్షలు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. పెద్ద పెట్టుబడి పెట్టలేని వారి కోసం రూ.8 లక్షల బ్యాంకు గ్యారంటీతో చిన్న తరహా ఏజెన్సీలను స్థాపించవచ్చని వివరించారు. మరిన్ని వివరాల కోసం https://emigrate.gov.in/ext/ వెబ్ సైటును సందర్శించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment