
గల్ఫ్‌హెల్ప్ కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తున్న గట్టిం మాణిక్యాలరావు
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): ‘పొట్ట కూటి కోసం విదేశం వెళ్లిన మా వాళ్లు.. అక్కడ నరకయాతన పడుతున్నారు.. వారిని స్వదేశం రప్పించండి’ అంటూ ఇక్కడ కుటుంబ సభ్యులు అందించే వినతులు రోజురోజుకు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు నిర్వహిస్తోన్న గల్ఫ్‌హెల్ప్ కార్యక్రమానికి బుధవారం బాధితుల నుంచి భారీ సంఖ్యలో వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ విజిటింగ్ వీసాలు, ఏజెంట్ల మాయమాటలు నమ్మి అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఎక్కువ మొత్తంలో జీతం వస్తుందని ఆశపడి అక్కడ మోసపోయి నరకం చూస్తున్నారని తెలిపారు. అలా ఇండియా తిరిగి రాలేక బాధపడుతోన్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెళ్లిన వారు తిరిగి వస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
♦ సౌదీ అరేబియా దేశంలో యాక్సిడెంట్ కారణంగా ప్రాణాలతో పోరాడుతున్న పంజా వెంకట రామారావును స్వదేశం రప్పించాలని వీరవాసరం మండలం, పంజా వేమవరానికి చెందిన బంధువులు, తండ్రి పంజా త్రిమూర్తులు మాణిక్యాలరావుకు వినతిపత్రం అందజేశారు.
♦ కృష్ణా జిల్లా పెడన్ మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన మువ్వల పాతిమా 3 సంవత్సరాల క్రితం ఖతర్ దేశం వెళ్లింది. అక్కడ ఏజెంట్ ఆమెను సౌది అరేబియాకు తీసుకొనిపోయి పని చేయిస్తున్నారు. ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోందని, ఇండియాకు రప్పించాలని కుమారుడు మువ్వల రాహుల్ కోరారు.
♦ గూడెం మండలం నందమూరు గ్రామానికి చెందిన దర్శిపో సుబ్బాయమ్మ జీవనోపాధి నిమిత్తం మస్కట్ వెళ్లింది. అక్కడ ఆమెకు జీతం ఇవ్వకుండా బాధిస్తున్నారని, ఆమెను ఇండియాకు రప్పించాలని భర్త దర్శిపో కృపానందం వినతిపత్రం సమర్పించారు.
♦ మాధవరం గ్రామానికి చెందిన రాపాక శ్రీను 6 సంవత్సరాల క్రితం మలేషియా దేశం వెళ్లాడు. ఇప్పటి వరకు అతను ఎలా ఉన్నది సమాచారం అందలేదు. ఎక్కడ ఉన్నది తెలియని పరిస్థితులలో ఉన్నామని, భర్తను మలేషియా నుంచి ఇండియాకు రప్పించాలని భార్య ఉమాదేవి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment