కాళ్లు కోల్పోయిన రాజుతో భార్య సావిత్రి
సాక్షి, కామారెడ్డి: నాలుగు రాళ్లు సంపాదించాలని గల్ఫ్‌కు వెళ్లిన ఆ అభాగ్యుడు ప్రమాదవశాత్తు రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. భార్య, పిల్లల కోసం ఆయన కష్టపడాలనుకుంటే.. ఇప్పుడు ఆయన కోసం కుటుంబం కష్టపడాల్సి వస్తోంది. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఆ కుటుంబం చేతిలో ఇప్పుడు చిల్లిగవ్వా లేదు. ఏదైనా అమ్ముకుని వైద్యం కోసం ఖర్చు పెడదామన్నా ఆస్తిపాస్తులు లేవు. దీంతో మెరుగైన వైద్యం చేయించలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది.
కోన రాజు సొంత ఊరు సిద్దిపేట జిల్లా రామక్కపేట. అయితే బతుకుదెరువు కోసం కామారెడ్డికి వలస వచ్చాడు. పట్టణంలోని స్నేహపురికాలనీలో స్థిరపడ్డాడు. కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2012లో రూ.80 వేలు ఖర్చు చేసి మస్కట్‌కు వెళ్లాడు. అక్కడ ఆరు నెలల పాటు పని చేశాడు. ఒక రోజు పనిచేసే చోట ఇనుపరాడ్ తన రెండు కాళ్లకు తగిలింది. తీవ్రంగా గాయపడిన అతడికి అక్కడ వైద్యం చేయించారు. అయితే బ్లడ్ క్లాట్ అయ్యిందని చెప్పి అతడిని ఇంటికి పంపించారు. ఇంటికి చేరిన తరువాత స్థానిక వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నాడు. ఎంతకూ నయం కాలేదు. రోజురోజుకూ పరిస్థితి విషమించి పూర్తిగా లేవలేని స్థితికి చేరుకున్నాడు.
ఇన్‌ఫెక్షన్‌తో కాళ్లు తొలగించారు...
2013లో ఒక కాలు పూర్తిగా ఇన్‌ఫెక్షన్ అయ్యిందని కాలును తొలగించారు. మరో రెండేళ్లకు ఇంకో కాలు కూడా ఇన్‌ఫెక్షన్ అయ్యిందని దాన్ని తొలగించారు. రెండు కాళ్లను కోల్పోయిన రాజు పరిస్థితి దయనీ యంగా మారింది. రాజు వైద్యానికి కుటుంబ సభ్యులు దాదాపు రూ.3లక్షలు ఖర్చు చేశారు. అయినా రాజు పరిస్థితి మాత్రం మెరుగుప డలేదు. రాజు పరిస్థితి నిత్య నరకమే. పడు కోవాలన్నా, కూర్చోవాలన్నా ఇన్‌ఫెక్షన్‌తో పుండ్లు ఇబ్బంది పెడుతున్నాయి. గాయం మానడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలిత మివ్వడం లేదు. మూత్రం వెళితే రక్తం వస్తోంది. మలవిసర్జన చేస్తే రక్తం పడుతోంది. మెరుగైన వైద్యం చేయించుకునేందుకు వారి దగ్గర చిల్లిగవ్వా లేదు. రోజూ భర్తను చూసు కుంటూనే కుటుంబ పోషణకు ఆయన భార్య సావిత్రి కష్టపడుతోంది.
సర్కారు ఆదుకోవాలి
మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టినం. కాళ్లు లేకున్నా ఎట్లనన్న బతుకు తమని అను కున్నం. కాళ్లు తీసేసినా ఇన్‌ఫెక్షన్ మాత్రం పోతలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆయన్నెట్ల బతికించుకోవాలె. మేమెట్ల బతకాలె సారు. మాకు సర్కారు ఏదన్న సాయం చేసి ఆదుకోవాలి. ఎవరైనా మానవతావాదులు ఆదుకోండ్రి.-సేపూరి వేణుగోపాలచారి
Comments
Please login to add a commentAdd a comment