సాధారణంగా ఏ బస్సులోనో చాలాసేపు కూర్చుని ప్రయాణం చేశాక... పాదాల్లో వాపురావడం చాలామందిలో కనిపించేదే. ఇది నిరపాయకరమైన వాపు. కానీ కొన్నిసార్లు అలా ఏ కారణం చేత ఆ వాపు వచ్చిందో తెలుసుకోడానికి డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వాపు కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు, అప్రమత్తంగా ఉండాల్సి రావచ్చు. పాదాలవాపు కనిపించినప్పుడు ఏయే అంశాలపై దృష్టిపెట్టాలన్న అవగాహన కోసమే ఈ కథనం.
కాళ్లలో/పాదాల్లో వాపు కనిపించడాన్ని ‘ఎడిమా’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సెల్యులైటిస్, డీప్‌వీన్ థ్రాంబోసిస్ అనే కండిషన్లతో పాటు హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్... ఈ మూడు కీలక అవయవాల పనితీరు తగ్గడం వల్ల ఇలా జరిగిందేమో చూడాలి. హైపోథైరాయిడిజమ్ వల్ల కూడా ఇలా జరగవచ్చు. దాంతోపాటు కొన్ని మందుల వాడకంతో పాటు, అసలు ఏ కారణమూ తెలియకుండా కూడా పాదాల్లో వాపు రావచ్చు.
కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల...
కిడ్నీ ఫెయిల్యూర్‌లో ముఖం మాత్రమే ఉబ్బుతుందని చాలామంది అనుకుంటారు. కానీ కాళ్లవాపూ కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేయించి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది.
లివర్ ఫెయిల్యూర్ వల్ల...
కాలేయ వైఫల్యంలోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. దీని నిర్ధారణ కోసం ‘లివర్ ఫంక్షన్ టెస్ట్ – ఎల్‌ఎఫ్‌టీ’ పరీక్ష చేయించి, సమస్య నిర్ధారణ అయినప్పుడు దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది.
కాలి సిరల్లో లోపంతో...
కొన్నిసార్లు కాళ్లలోని సిరలు చక్కగా పనిచేయకపోవడం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండిపోయి, పాదాల వాపు రూపంలో బయటపడుతుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారిలో, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. పిక్కల్లో నొప్పి, కాళ్లు బరువుగా అనిపించడం, అటు తర్వాత క్రమంగా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు, కొంతకాలానికి కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగి ఉన్నట్లుగా చర్మంలోంచి బయటికి కనిపించడంతో పాటు, అవి పచ్చగా లేక నల్లగా కనిపిస్తే, అది ‘వేరికోస్ వెయిన్స్’ లేదా ‘‘వీనస్ ఇన్‌సిఫిషియెన్సీ’ అనే కండిషన్ కావచ్చు.
తొలిదశలో సాయంత్రం మాత్రమే ఉండే కాళ్లవాపు ఆ తర్వాత రోజంతా ఉంటుంది ∙ఇది కాకుండా సెల్యులైటిస్ అనే కండిషన్‌లోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలా వాపు వచ్చిన కారణంగా కాలు కాస్త మెరుపుతో కనిపిస్తుంది ∙దీనితో పాటు కాలి సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్లకనిపించే ‘డీప్ వీన్ థ్రాంబోసిస్ – (డీవీటీ)’ అనే కండిషన్‌లో కూడా కాలివాపు కనిపిస్తుంది ∙ఈ కండిషన్స్ అన్నింటి నిర్ధారణ కోసం కాలి సిరలకు వీనస్ డాప్లర్ టెస్ట్ అనే పరీక్ష చేయించాలి.
ఇవేగాక... ఇతర సమస్యల్లో కూడా...
ఇక్కడ పేర్కొన్న సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యల వల్ల కూడా కాళ్ల/పాదాల వాపు రావచ్చు. కొన్ని ప్రోటీన్ల లోపం, మహిళల్లో కటి భాగంలో వచ్చే క్యాన్సర్లలో కూడా కాళ్ల వాపు రావచ్చు. కొందరు గర్భవతుల్లో కాలి సిరలు సామర్థ్యం తగ్గడం, కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్ లోపించినప్పుడూ వాపు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం, తదనుగుణంగా చికిత్సలు అవసరం.
గుండె పంపింగ్ తగ్గడం వల్ల...
గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు పాదాల వాపు కనిపిస్తుంది. ఒక్కోసారి రక్తపోటు పెరగడమూ జరుగుతుంది. గుండెజబ్బు కారణంగా రెండు కాళ్లలోనూ వాపు కనిపిస్తుంది. ముందుగా కాలి ముందు భాగంలోనూ... ఆ తర్వాత మడమ భాగంలో వాపు వస్తుంది. మొదట్లో నొప్పి ఉండదు. ఆయాసం, నడవలేకపోవడం జరగవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం మెడికల్ స్పెషలిస్ట్ / గుండె వైద్య నిపుణులను కలవాలి.
గుండెజబ్బు వల్లనే పాదాల వాపు వచ్చిందా అన్న విషయం తెలుసుకోవడం కోసం బీఎన్‌పీ అనే రక్తపరీక్ష చేయించి, ఈ విలువ 100 కంటే ఎక్కువగా ఉంటే గుండె సమస్య ఉందేమోనని అనుమానించాలి. అప్పుడు గుండె నిపుణుల ఆధ్వర్యంలో ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలి.
చికిత్స :
ఇది గుండెజబ్బు కారణంగానే జరిగితే డైయూరెటిక్స్ అనే మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి మూత్రం రూపంలో దేహంలోంచి నీటిని బయటకు పంపిస్తాయి. అయితే గుండెజబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఈ డైయూరెటిక్స్ వాడాలి, లేకపోతే అవి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతేకాదు... గుండెజబ్బు కాకుండా ఇతర కారణాల వల్ల కాలి వాపు వచ్చి ఉంటే... ఆ మూల కారణాన్ని కనుగొనే అవకాశం ఉండక, ఇతరత్రా సమస్యలు రావచ్చు.
ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం...
ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం వల్ల కూడా పాదాలకు వాపు వస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో ఇది ఎక్కువ. ఈ కారణంగా సమస్య వస్తే... నిద్రలో పెద్దగా గురకపెట్టడం, నిద్రనుంచి అకస్మాత్తుగా లేవడం, నిద్రలో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం కనిపిస్తాయి. వీరు తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. లంగ్స్‌లో రక్తపోటు పెరగడాన్ని తెలుసుకోవడం కోసం డాక్టర్లు ఎకో పరీక్ష చేయిస్తారు. వయసు 40 దాటి, కాళ్ల వాపులు ఉన్నవారు ఒకసారి తప్పనిసరిగా ఎకో పరీక్ష చేయించడం మంచిది.
చికిత్స : ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా వచ్చే స్లీప్ ఆప్నియాకు తప్పనిసరిగా చికిత్స చేయించాలి. దాంతో స్లీప్ ఆప్నియా సమస్య తగ్గి, కాళ్ల వాపూ తగ్గుతుంది.
జాగ్రత్తలు / ఫస్ట్‌లైన్ చికిత్స :
- చాలాసేపు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- వాపు ఉన్న కాళ్లపై ఎలాస్టిక్ స్టాకింగ్స్ తొడగాలి. ఈ జాగ్రత్తలతో కాలివాపును నివారించవచ్చు.
- స్టాకింగ్ సిరలకు అది మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల క్రమేణా రక్తం సజావుగా ప్రవహిస్తుంటుంది.
- ఈ దశలో నిర్లక్ష్యం చేసి, సమస్య ముదిరి ‘వేరికోస్ వెయిన్స్’గా పరిణమిస్తే, కాళ్లకు పుండ్లు వంటి దుష్ప్రభావాలు (కాంప్లికేషన్లు) రావచ్చు. ఆయా కండిషన్లకు అనుగుణంగా రేడియాలజీ చికిత్స, శస్త్రచికిత్సలు అవసరం కావచ్చు.
కారణం తెలియకుండా...
కొందరిలో, ముఖ్యంగా 40 ఏళ్ల మహిళల్లో కాళ్ల వాపుతో పాటు మరికొందరిలో ముఖం, చేతులు కూడా ఉబ్బడం జరగవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందన్న కారణం కొన్నిసార్లు తక్షణం తెలియకపోవచ్చు. వీరికి అన్ని పరీక్షలూ చేసి... నిర్దిష్టంగా ఎలాంటి కారణం లేదని తెలుసుకున్న తర్వాత డైయూరెటిక్స్ వాడాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలనీ డాక్టర్లు సూచిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment