Winter Sinusitis: Sinus Infection Symptoms Causes and Treatment in Telugu - Sakshi
Sakshi News home page

అసలే చలికాలం..సైనసైటిస్‌కు ఈ జాగ్రత్తలు తీసుకుందాం..

Published Wed, Dec 15 2021 7:37 PM | Last Updated on Mon, Dec 27 2021 6:30 PM

Sinus Infection Symptoms Causes And Treatment In Telugu - Sakshi

ప్రస్తుత చలి వాతావరణం సైనసైటిస్‌కి అత్యంత అనుకూలించే సీజన్‌. అంతేకాదు అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులు కూడా. ఎండగా ఉండాల్సిన రోజుల్లో వర్షం, వర్షాకాలంలో ఎండ.. మధ్యాహ్నం సమయంలో చల్లని గాలులు... ఇటీవల అన్నీ ఇలాంటి చిత్ర విచిత్ర వాతావరణ పరిస్థితులే చూస్తున్నాం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సర్వ సాధారణ ఆరోగ్య సమస్య సైనసైటిస్‌. ఈ నేపధ్యంలో హైదరాబాద్,  కొండాపూర్‌లో ఉన్న అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌ ఇఎన్‌టి డాక్టర్‌ మహమ్మద్‌ నజీరుద్దీన్‌ సైనసైటిస్‌కు  లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారిలా...

శ్వాస..ఇన్ఫెక్షన్‌...
సైనసైటిస్‌ అనేది సైనస్‌లకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌. ఇది సైనస్‌ లైనింగ్‌ కణజాలంలో వాపు కారణంగా ఏర్పడుతుంది. సైనస్‌లు సన్నని శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ముక్కు మార్గాల ద్వారా బయటకు వస్తుంది. ఇదే ముక్కును శుభ్రంగా, ఇన్ఫెక్షన్‌ లేకుండా ఉంచుతుంది. ఈ సైనస్‌లు సాధారణంగా గాలితో నిండినప్పుడు, ద్రవంతో నిండినప్పుడు, సైనసైటిస్‌కు దారితీసే ఇన్‌ఫెక్షన్లకు లోనుకావడం జరుగుతుంది. ఈ  ఇన్ఫెక్షన్‌ ఎవరికైనా రావచ్చు కానీ  అలర్జీలు, ఉబ్బసం మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు తరచుగా సైనస్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడుతుంటారు.  

కొన్ని లక్షణాలు:
► దట్టమైన రంగు మారిన ద్రవంతో ముక్కు నుంచి స్రావాలు
► ముఖం నొప్పి 10 రోజులకు మించి ఉండడం
► ముక్కు మూసుకుపోవడం లేదా మూసుకుపోవడం వల్ల ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 
► కళ్ళు, బుగ్గలు, చెవులు, తల, పై దవడ మరియు దంతాల చుట్టూ నొప్పి, సున్నితత్వం, వాపు
► వాసన మరియు రుచి  తగ్గినట్టు అనిపించడం
► గొంతు నొప్పి, నోటి దుర్వాసన, అలసట

కారణాలు
► సైనసైటిస్‌ సాధారణంగా వైరస్, బాక్టీరియా లేదా ఫంగస్‌ వల్ల వస్తుంది, 
► సాధారణ జలుబు వల్ల సైనస్‌లు ఉబ్బి  ఇన్‌ఫెక్షన్లకు దారితీసినప్పుడు సైనసైటిస్‌కు దారి తీస్తుంది.
► కాలానుగుణ అలెర్జీలు  పుప్పొడి లేదా ధూళి వంటి అలెర్జీ కారకాలకు శరీరం లోనైనప్పుడు  సైనస్‌లు ఉబ్బి, సైనసైటిస్‌కు దారితీసే మార్గాన్ని అడ్డుకుంటుంది.
► ధూమపానం సైనస్‌ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది, పొగాకు పొగ నాసికా వాయుమార్గాలను చికాకుపెడుతుంది, తద్వారా శరీరం మరింత శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది, దీని వలన అలెర్జీలు లేదా జలుబు సైనసైటిస్‌కు దారితీసే అవకాశం ఉంది.

చికిత్స
► సైనసైటిస్‌ తీవ్రతను బట్టి వివిధ పద్ధతులలో చికిత్స చేయవచ్చు. డీకోంగెస్టెంట్‌లు, సెలైన్‌ ద్రావణంతో నాసికా నీటిపారుదల, యాంటీబయాటిక్స్, పుష్కలంగా నీరు త్రాగడం వంటివి  ఈ ఇన్‌ఫెక్షన్స్‌కు  ప్రాథమిక చికిత్సగా చెప్పొచ్చు.
► దీర్ఘకాలిక/క్రానిక్‌ సైనసైటిస్‌ కోసం  అలెర్జీలు. ఇంట్రానాసల్‌ స్టెరాయిడ్‌ స్ప్రేలు, ఓరల్‌ హిస్టామిన్‌ మాత్రలు, యాంటిహిస్టామైన్‌ స్ప్రేలు  చికిత్సలో భాగంగా వైద్యులు సూచిస్తారు.
► అదనపు మందులను కలిగి ఉండే సెలైన్‌ సొల్యూషన్స్‌ ఉపయోగించి చేసే నాసికా ప్రక్షాళన కూడా సైనస్‌ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సమర్థవంతమైన సాధనం.
► వేరే చికిత్సలు ఏవీ ఇన్‌ఫెక్షన్స్‌ నియంత్రించడంలో విజయవంతం కానప్పుడు సమస్యను పరిష్కరించడానికి శస్త్రచికిత్స... తర్వాత ఇఖీ స్కాన్‌ చేయబడుతుంది.

నివారణ ప్రధానం..
► తగినంత అవగాహన, ముందస్తు జాగ్రత్తలతో సైనసైటిస్‌ను నివారించవచ్చు.  జలుబు లేదా ఇ¯Œ ఫెక్ష¯Œ లతో అనారోగ్యంగా ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని వదులుకోవాలి.  –భోజనానికి ముందు చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి.
► వైద్యుల సూచనలు పాటించడం ద్వారా తమకేవైనా అలర్జీలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. 
► ఊపిరితిత్తులు, నాసికా భాగాలకు చికాకు కలిగించే, మంటను కలిగించే పొగాకు పొగ వంటి కాలుష్య కారకాలకు గురికాకూడదు. 

పైన పేర్కొన్న లక్షణాలతో పాటు, ఏవైనా ఇతర అసాధారణతలు గమనించినట్లయితే  తక్షణ నిపుణుల సంప్రదింపులు అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది శరీరం నుండి అవాంఛిత టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది.  


–డాక్టర్‌ మహమ్మద్‌ నజీరుద్దీన్‌ఇఎన్‌టి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement