మంత్రివర్యా.. కరుణించండి
► మంచం పట్టిన నా తండ్రిని ఆదుకోండి
► మంత్రి కేటీఆర్‌కు దుబాయ్ వలస కార్మికుడి లేఖ
ఎల్లారెడ్డిపేట : మంచం పట్టిన తండ్రి... పెరుగుతున్న అప్పులు.. గల్ఫ్‌లో చాలీచాలని జీతంతో ఓ కుటుంబం దుర్భర జీవితాన్ని గడుపుతోంది. పూట గడవడం కష్టమైన పరిస్థితుల్లో తండ్రికి వైద్యం అందించడం, కుటుంబాన్ని పోషించుకునే దారికోసం ఆ యువకుడు దిక్కులు చూస్తున్నాడు. తమను కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ గల్ఫ్ నుంచి మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాడు. వివరాలివీ...
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ పరిధిలోని అగ్రహారానికి చెందిన మామిండ్ల రామస్వామి స్వగ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారడంతో అప్పు చేసి ఐదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఇక్కడ ఆయన తండ్రి రాములు అనారోగ్యంతో మంచంపట్టాడు.
రూ.7లక్షలు అప్పులు చేసి వివిధ ఆస్పత్రుల్లో వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. తండ్రి వైద్య కోసం రూ.7 లక్షల వరకు అప్పులు కాగా నెలకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నట్లు రామస్వామి లేఖలో పేర్కొన్నాడు. తన కుటుంబ పరిస్థితిపై మంత్రి కేటీఆర్ స్పందించి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని లేఖలో వేడుకున్నాడు. రామస్వామి కుటుంబ పరిస్థితిపై దాతలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది.