ప్రవాసులకు ప్రాగ్జీ ఓటింగ్‌! | Proxy Voting For NRI Bill Passed In Lok Sabha | Sakshi
Sakshi News home page

విదేశంలో ఉండి స్వదేశంలో ప్రతినిధి ద్వారా ఓటు వేసే అవకాశం

Published Fri, Aug 17 2018 7:33 PM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

Proxy Voting For NRI Bill Passed In Lok Sabha - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: సర్వీస్‌ ఓటర్ల (రక్షణ సిబ్బంది, భద్రతా దళాల) తరహాలోనే ప్రవాస భారతీయులకు ‘ప్రాగ్జీ ఓటింగ్‌’ (పరోక్ష ఓటింగ్‌.. అంటే ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రజా ప్రాతినిధ్య (సవరణ) బిల్లు–2017ను లోక్‌సభ గత వారం ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్ట సవరణ అమలులోకి వస్తుంది. 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణ సెక్షన్‌ 20–ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో ‘ఓవర్సీస్‌ ఎల క్టర్స్‌’గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

కొత్త బిల్లు ఆమోదం పొందితే ఎంతో మంది ప్రవాస భారతీయులకు మన దేశంలో నిర్వహించే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన మన దేశ పౌరులకు ఈ ‘ప్రాగ్జీ’ ఓటింగ్‌ విధానం ప్రయోజనం కల్పిస్తుంది. గల్ఫ్‌ మినహా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఇతర విదేశాల్లో ఉపాధి పొందుతున్న వారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఆ దేశ పౌరసత్వం లభించే అవకాశం ఉంది. ఒక్క గల్ఫ్‌ దేశాల్లో మాత్రం విదేశీయులకు పౌరసత్వాన్ని ఆ దేశాలు ఇచ్చే అవకాశం లేదు.  

గల్ఫ్‌ ఓటర్లు కీలకం  
’ప్రాగ్జీ ఓటింగ్‌’ సౌకర్యం ద్వారా సుమారు కోటీ 50 లక్షల మంది ఎన్నారైలు భారత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నారైలను పట్టించుకోవాల్సిన అవసరం అనివార్యమైంది. అరబ్‌ గల్ఫ్‌ దేశాలలో నివసిస్తున్న సుమారు 10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు 25 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలరు. ఒక్కో గల్ఫ్‌ ఎన్నారైకి కుటుంబ సభ్యులందరు కలిపి కనీసం ఐదుగురు ఉంటారు. అంటే గల్ఫ్‌ ప్రవాసులు వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 60 లక్షల మందితో ‘గల్ఫ్‌ ఓటు బ్యాంకు’ రూపు దిద్దుకుంటుంది.

వీరు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ప్రవాస భారతీయులకు హక్కులు కల్పించేందుకు, సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ పార్టీలు తమ మెనిఫెస్టోలో పేర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రవాస భారతీయుల పేరిట ఉన్న భూములకు పెట్టుబడి సహాయం అందించలేదు. కానీ పరోక్ష పద్ధతిలో ఎన్నారైలకు ఓటు హక్కు లభించడం వల్ల ప్రభుత్వం తన ఆలోచన తీరును మార్చుకునే అవకాశం లేకపోలేదు. 

ఎన్నారైలు ఆన్‌లైన్‌లో ఓటు నమోదు ఇలా చేసుకోవచ్చు..
భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లింకు http:// www. nvsp. in/ Forms/ Forms/ form6 a? lang= en-GB ను క్లిక్‌ చేయగానే స్క్రీన్‌పై ఫామ్‌ 6ఎ కనిపిస్తుంది. ముందుగా ఓటరు నమోదు అధికారి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ (పాస్‌పోర్ట్‌ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు, బంధుత్వం నమోదు చేయాలి. పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగం(స్త్రీ, పురుష, ఇతర), ఈ–మెయిల్, ఇండియా మొబైల్‌ నంబర్‌ను పేర్కొనాలి. ఇండియాలోని చిరునామా (పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా) ఇంటి నంబర్, వీధి పేరు, పోస్టాఫీసు పేరు, గ్రామం/పట్టణం, జిల్లా, పిన్‌కోడ్‌ తెలియజేయాలి.

పాస్‌పోర్ట్‌ నంబరు, పాస్‌పోర్ట్‌ జారీ చేసిన ప్రదేశం పేరు, పాస్‌పోర్ట్‌ జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా నంబర్, వీసా కేటగిరీ (సింగిల్‌ ఎంట్రీ / మల్టిపుల్‌ ఎంట్రీ /టూరిస్ట్‌ /వర్క్‌ వీసా), వీసా జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణం ఉద్యోగం కోసమా, విద్య కోసమా, లేదా ఇతర కారణాలా వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు అయిన తేదీ పేర్కొనాలి. 

దరఖాస్తుదారు ఈ విధంగా డిక్లరేషన్‌ (వాంగ్మూలం) ఇవ్వాలి  
‘నాకు తెలిసినంతవరకు ఈ దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిజమైనవి. నేను భారత పౌరుడిని. నేను ఇతర దేశం పౌరసత్వాన్ని కలిగిలేను. ఒకవేళ నేను విదేశీ పౌరసత్వం పొందినట్లయితే వెంటనే భారత రాయబార కార్యాలయానికి తెలియజేస్తాను. ఒకవేళ నేను భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి సాధారణ నివాసిగా మారినట్లయితే మీకు వెంటనే తెలియజేయగలను. ఓటరు నమోదు కోసం ఇతర నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకోలేదు. ఇది వరకు నాకు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నట్లయితే దానిని మీకు వాపస్‌ చేస్తాను. తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 సెక్షన్‌ 31 ప్రకారం నేను శిక్షార్హుడిని’.

బీఎల్‌ఓ విచారణ 
దరఖాస్తు చేసిన తర్వాత బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్‌ఓ) భారతదేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఎలాంటి అభ్యంతరాలూ లేకపోతే ఏడు రోజుల్లో ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. 


మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించారు 
ప్రవాస భారతీయులను ఓటర్లుగా ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది. మేము మా కోసమే కాదు దేశం కోసం కష్టపడుతున్నాం. మా వల్ల ఎంతో విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి వచ్చి చేరుతుంది. ప్రవాస భారతీయులు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పార్లమెంట్‌ ఆమోదించడం ఎంతో సంతోషం కలిగించింది.   – గద్దె శ్రీనివాస్, ఖతార్‌ (డిచ్‌పల్లి వాసి) 

ఓటు హక్కు కల్పించడం సంతోషం 
విదేశాల్లో ఉన్న ప్రవాసులందరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆలోచన మంచిది.  అయితే ఓటును ఎలా వేయాలన్నదానిపై కూడా స్పష్టత అవసరం. టెక్నాలజీ ఎంతో అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ ద్వారానైనా, ఇతర పద్ధతుల ద్వారానైనా ఓటును ప్రతీ ఒక్కరూ వినియోగించుకునే అవకాశం కల్పించాలి.  –సిరికొండ నర్సింలు, మస్కట్‌ (గన్‌పూర్‌– ఎం. మాచారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా)

16 ఏళ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకో లేదు 
నేను 16 ఏళ్ల నుంచి గల్ఫ్‌కు వెళుతున్నాను అప్పటి నుంచి ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నాను. రెండేళ్లకు ఒకసారి ఇంటికి వచ్చి వెళుతున్నా మేము వచ్చిన సమయంలో ఎన్నికలు లేక పోవడంతో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదు. పరోక్ష పద్ధతిలోనైనా మేము ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం దక్కనుంది.  – శ్రీనివాస్‌ గుప్తా, బహ్రెయిన్‌ (నిజామాబాద్‌ జిల్లా) 

హక్కులు సాధించుకోవడానికి మంచి అవకాశం 
ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్‌ వల్ల తమ హక్కులను సాధించుకోవడానికి అవకాశం లభించింది. గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన వారి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మాకు ఓటు హక్కు లభించడంతో మా హక్కులను రాజకీయ పార్టీలు గుర్తించే అవకాశం ఉంది. ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్‌ ఆహ్వానించదగిన పరిణామం. 
– మహ్మద్‌ యూసుఫ్‌ అలీ, అధ్యక్షుడు తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ జిద్దా, సౌదీ అరేబియా (కరీంనగర్‌ జిల్లా వాసి)  

ఓటింగ్‌లో పాల్గొనాలనే కల నిజమవుతున్నది 
స్వదేశంలో లేకున్నా ప్రతినిధి ద్వారా ఓటు వేసే అరుదైన అవకాశం రావడం సంతృప్తినిస్తుంది. ‘ప్రాగ్జీ ఓటింగ్‌’ అనే ప్రక్రియ ఒక వైవిధ్యమైన వర్ణమాల లాంటిది. మనం భారతీయులమైనందుకు గర్వించాలి. 
 –అమ్రీనా ఖైసర్, జిద్దా, సౌదీ అరేబియా (హైదరాబాద్‌) 

రాజకీయాలను ప్రభావితం చేస్తారు 
పరాయి దేశంలో ఉన్న వారికి మన దేశంలో ఓటు వేసే అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. గల్ఫ్‌ దేశాల్లో ఉంటూ మన దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రవాసీయులకు రాజకీయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లభిస్తుంది. ప్రవాసీయులు అభ్యర్థుల కంటే.. పార్టీ మేనిఫెస్టోకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.   – జువ్వాడి శ్రీనివాస్‌రావు, ఉమల్‌కోయిల్‌ (నర్సింగాపూర్, సిరిసిల్ల జిల్లా) 

ఓటర్లలో చైతన్యం వస్తే మేలు.. 
తెలంగాణ జిల్లాల్లో చాలా మంది ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరి కాదు.. ఓటర్లలో చైతన్యం వస్తేనే సమాజానికి మేలు జరుగుతుంది. అబుదాబీలో ఉంటున్న ప్రవాసీ శంషీర్‌ సుప్రీంకోర్టులో చేసిన పోరాట ఫలితంగానే ప్రవాసీయులకు ఓటు  హక్కు లభించిందని భావిస్తున్నాను.    ఓటు హక్కు కల్పించడం మంచిదే. సంక్షేమ పథకాలు దూరమవుతాయనే భయంతో ఓటర్లుగా నమోదు కావడం లేదు. దీనిపై చైతన్య పరుస్తాం.  – సలాఉద్దీన్, షార్జా (జగిత్యాల)

ఓటింగ్‌కు అవకాశం వల్ల గల్ఫ్‌ కార్మికులకు ప్రయోజనం 
ప్రవాస భారతీయులకు ఓటింగ్‌కు అవకాశం కల్పించడం వల్ల గల్ఫ్‌ కార్మికులకే ఎక్కువ ప్రయోజనం కలుగనుంది. గల్ఫ్‌ మినహా ఇతర దేశాల్లో ఉంటున్న వారికి ఆ దేశ పౌరసత్వం లభించే అవకాశం ఉంది.  గల్ఫ్‌ కార్మికులకు మాత్రం గల్ఫ్‌ పౌరసత్వం ఎప్పటికీ లభించదు.  బిల్లు ఆమోదం వల్ల గల్ఫ్‌ కార్మికులకు లాభమే.  – ముత్యాల వినయ్‌కుమార్, కువైట్‌ (హైదరాబాద్‌ వాసి) 

ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం.. 
గల్ఫ్‌ దేశాల్లో ఉండే వారికి ఇది మంచి అవకాశం. ఎన్నో ఏళ్లుగా వివిధ దేశాల్లో ఉన్న వారు ఓటు హక్కుకు దూరమయ్యారు. ఇప్పుడు తొలిసారిగా అవకాశం రావడం స్వాగతించాల్సిన విషయం.  దీనిపై వలస జీవులను చైతన్య పరిచి ఎక్కువ మంది ఓటు వేసే విధంగా చూస్తాం.   – వంశీగౌడ్, గల్ఫ్‌ కార్మికుల ఆహ్వాన వేదిక ఉపాధ్యక్షుడు, దుబాయి (ఆర్మూర్‌) 

మార్గదర్శకాలు రాగానే అమలు చేస్తాం...
భారతీయులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంపై పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలుసు. కానీ, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు. ప్రవాస భారతీయులు ఎవరైనా ఓటు హక్కు కోసం వస్తే ఫాం 6(ఏ)ని పూరించి హక్కును కల్పిస్తున్నాం. మార్గదర్శకాలు రాగానే వాటిని అమలు చేస్తాం.  – వినోద్‌కుమార్, ఆర్‌డీఓ నిజామాబాద్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement