proxy voting
-
ప్రవాస భారతీయులకు పరోక్షఓటింగ్
మహమ్మద్ హమీద్ ఖాన్, హైదరాబాద్, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో రక్షణ సిబ్బంది, భద్రతా దళాలకు వెసులుబాటు ఉన్న సర్వీస్ ఓటింగ్ తరహాలోనే ప్రవాస భారతీయులకు పరోక్షఓటింగ్ (తమ ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) సదుపాయం కల్పించే ప్రజా ప్రాతినిధ్య సవరణ బిల్లు– 2017ను కేంద్రమంత్రివర్గం అంగీకరించింది. దానికి గతనెలలో లోక్‌సభలో ఆమోద ముద్రపడింది. రాజ్యసభలో బిల్లు పాస్‌కావాల్సి ఉంది. తర్వాత రాష్ట్రప్రతి ఆమోదముద్రతో చట్టసవరణ అమల్లోకి వస్తుంది. దీనిని ‘ప్రాక్సీఓటింగ్’ అంటారు. 2010లోనే చట్ట సవరణ చేసినా..? వాస్తవానికి 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టసవరణ చేసింది. సెక్షన్ 20– ఏ ప్రకారం 18ఏళ్లు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో ‘ఓవర్సీస్ ఎలక్ట్రర్స్’గా తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుంది. ఆయితే అప్పట్లో ప్రవాస భారతీయులు ఇక్కడకు వచ్చి ఓటేయాల్సిం దేనని ఎన్నికల సంఘం తేల్చిచెప్పడంతో కనీసం 25వేల మంది తమ ఓటుహక్కును నమోదు చేసుకోలేదు. కాగా వివిధ దేశాల్లో సుమారు కోటి 25లక్షల మందిపైగానే ఎన్నారైలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అరబ్ గల్ఫ్ దేశాల్లోనే సుమారు పది లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఉన్నారు. సుమారు 25 అసెంబ్లీ, రెండులోకసభ నియోజకవర్గాల్లో వీరి కుటుంబాల ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనా. భిన్నాభిప్రాయాలు.. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ఫోరం ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన సదస్సులో పలువు రు ఎన్నారైలు తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. పరోక్ష ఓటింగ్ దుర్వినియోగమవుతోందని, దీనికి బదులు ప్రవాసీలంతా ఆయాదేశాల్లోని భారత రాయబార కార్యాలయంలో ఓటు వేసే ఏర్పాట్లు చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ ఇది కుదిరే పనికాదని స్పష్టం చేసిన విషయాన్ని మరి కొందరు గుర్తుచేశారు. అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇదే విధానం అనుసరిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈ– పోస్టల్ బ్యాలెట్ విధానాలపై కొందరు ఆసక్తి కనబర్చినా, లోపాలున్నాయన్న వాదన వినిపించింది. పరోక్ష ఓటింగ్‌లో సూచిం చిన వ్యక్తికే ఓటు వేస్తారనే నమ్మకం లేదన్న అభిప్రాయాన్ని పలువురు ఎన్నారై ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఓటుహక్కు అవసరం ఎన్నారైలు, వలస కార్మికులకు ఓటు హక్కు అవసరం.స్థానికంగా లేని కారణంగా ఓటు హక్కు తొలగిస్తున్నారు. దీంతో రాజకీయపక్షాలు వలస కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గతంలో ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణ జరిగినా ఇక్కడికి వచ్చి ఓటు వేయాలనే నిబంధన ఉండటంతో ప్రవాస భారతీయులు, కార్మికులు ఓటరు నమోదుపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. తాజాగా పరోక్ష ఓటింగ్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. – మంద భీంరెడ్డి, అధ్యక్షుడు ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓటుహక్కు కల్పించాల్సిందే.. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు అవసరం. విదేశాల నుంచి ఓటింగ్ కోసం ప్రత్యేకంగా రావడం సాధ్యం కాదు. ఉన్న చోట నుంచే ఓటు వేసే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేయాలి. నేరుగా ఓటు వేస్తేనే తమ హక్కు వినియోగించుకున్నట్లు సంతృప్తి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ప్రవాస భారతీయుల ఓటు హక్కు కల్పనపై పరిశీలించాలి.– శాంతిప్రియ, మలేషియా మన ఓటు మరొకరి ద్వారానా..? ఎన్నికల కోసం మనహక్కు ఇతరులకు అప్పజెప్పడమేమిటి..? దుర్వినియోగమయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు అవసరం. ఎన్నికల అవసరాలకు ఎన్నారైల ఫండ్ అవసరం కానీ, ఓటు హక్కు గురించి ఎందుకు ఆలోచించరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద విదేశాలకు వెళ్లిన వారి జాబితా ఉంటుంది. దాని ఆధారంగా ఓటు నమోదు ప్రక్రియ చేపట్టాలి. – హేమంత్‌కుమార్, మస్కట్ పరోక్ష ఓటుహక్కు దుర్వినియోగమే.. ఎన్నికల్లో పరోక్ష ఓటింగ్ విధానం దుర్వినియోగానికి దారితీస్తుంది. సూచించిన వ్యక్తికి ఓటు పడుతుందన్న నమ్మకం లేదు. ఉన్నచోట నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించాలి. ప్రవాస భారతీయుల కోసం ఎంబసీలో బ్యాలెట్ ఏర్పాటు చేసి ఎర్లీ పోలింగ్ నిర్వహించాలి. ముందుగా ప్రవాస భారతీయులకు గుర్తింపు ఇవ్వాలి. రాజకీయాల్లో సైతం ప్రాధాన్యం కల్పించాలి. – భవానీరెడ్డి, ప్రవాస భారతీయురాలు, ఆస్ట్రేలియా ఈ– ఓటింగ్ విధానం అనుసరించాలి విదేశాల్లో మాదిరిగా ప్రవాస భారతీయులకు ఈ– ఓటింగ్ విధానం వర్తింపజేయాలి. పరోక్ష ఓటింగ్ సరైనది కాదు. విదేశాల్లో ఉండి నేరుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయాలి. ఎన్నారైలకు సరైన గుర్తింపు ఇస్తే అభివృద్ధిలో మరింత భాగస్వాములయ్యే అవకాశం ఉంది. – సురేశ్‌రెడ్డి, అమెరికా పరోక్ష ఓటింగ్‌కు వ్యతిరేకం ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ విధానం వర్తింపజేయడానికి వ్యతిరేకం. ఎవరి ఓటు హక్కు వారే వినియోగించుకోవాలి. ప్రవాస భారతీయుల ప్రతినిధి రాజకీయ ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. రాజకీయపక్షాలు ఎన్నారైలను గుర్తించడం లేదు. కేవలం పార్టీఫండ్స్కు మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి.– దేవేందర్‌రెడ్డి ద్వినియోగం చేసుకోవాలి.. ఎన్నారైలు, వలస కార్మికులకు ప్రజాస్వామ్య బద్ధంగా ఓటుహక్కు అవసరం. పరోక్ష ఓటింగ్ విధానం కన్నా పోస్టల్, లేదా బ్యాలెట్ వెసులు బాటు కల్పించాలి. ఓటు హక్కు వినియోగించకున్నప్పుడే సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ కల్పించిన అవకాశాన్ని ఎన్నారైలు, వలస కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. – సునీల్‌కుమార్, గల్ఫ్ సినిమా డైరెక్టర్ ఎన్నారైలు ఓటర్లుగా నమోదు కావచ్చు ప్రవాస భారతీయులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్‌పోర్టులో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం–6ఏలో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. తరువాత భారత్‌లోని తమ చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఏడు రోజులవరకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. ‘‘ఓవర్సీస్ ఎలక్టర్స్ (ప్రవాసీఓటర్లు)గా నమోదు అయినవారు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్ కు వచ్చి, ఒరిజినల్ పాస్‌పోర్ట్ చూపించి ఓటుహక్కును వినియోగించుకోవాలి. వీరికి ఎన్నికలలో పోటీ చేసే హక్కుతో పాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులు సమానంగా ఉంటాయి. ఇలా నమోదు చేసుకోవాలి... https://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GB ను క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఫాం– 6ఏ కనిపిస్తుంది. ఓటరు నమోదు అధికారి రాష్ట్రం: తెలంగాణ, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ (పాస్‌పోర్ట్ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు నమోదు చేయాలి. పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగము (స్త్రీ, పురుష, ఇతర), ఇమెయిల్, ఇండియా మొబైల్నంబర్ పేర్కొనాలి. పాస్‌పోర్టు నంబర్, అది జారీ చేసిన ప్రదేశం, జారీచేసిన తేదీ, గడువు తేదీ, వీసానంబర్, వీసా క్యాటగిరీ (సింగిల్ఎంట్రీ / మల్టిపుల్ఎంట్రీ / టూరిస్ట్ / వర్క్ వీసా), వీసా జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియాజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణాలు వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరైన తేదీ పేర్కొనాలి. విదేశంలో నివసిస్తున్న ప్రదేశం యొక్క పూర్తి పోస్టల్ అడ్రస్ నమోదు చేయాలి. స్వదేశంలోని అడ్రస్, పూర్తి వివరాలు, పిన్‌కోడ్ నంబర్ సరిగా నమోదు చేయాలి. పాస్‌పోర్టుసైజ్ కలర్ ఫొటో, చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టు, వీసా పేజీలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వాగ్మూలం ఇలా ఇవ్వాలి.. ‘‘నాకు తెలిసినంతవరకు ఈ దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిజమైనవి. నేను భారత పౌరుడిని. నేను ఇతర దేశము యొక్క పౌరసత్వము కలిగిలేను. ఒకవేళ నేను విదేశీ పౌరసత్వం పొందినట్లయితే వెంటనే భారత రాయబార కార్యాలయానికి తెలియజేస్తాను. ఓటరు నమోదు కొరకు ఇతర నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకోలేదు.తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టం1950 సెక్షన్ 31 ప్రకారం నేను శిక్షార్హుడిని అని నాకు తెలుసు.’’ ఒమన్ రాయబారిగా మును మహావర్ ‘‘ఒమన్ దేశపు భారతరాయబారిగా మును మహావర్ 21ఆగస్టు 2018న బాధ్యతలు స్వీకరించారు. 1996 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన మును మహావర్ గతంలో మాస్కో, జెనీవాలో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఐఐటీ ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులైన మునుమహావర్ చత్తీస్‌గఢ్‌కు చెందినవారు.’’ -
పరోక్ష ఓటింగ్ బిల్లుకు పూర్తి మద్దతు : కుంతియా
సాక్షి, సిటీబ్యూరో : సర్వీస్ ఓటరు తరహాలోనే ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ సదుపాయం కల్పించే బిల్లుకు రాజ్యసభలో పూర్తి మద్దతు ఇస్తామని ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామ్ చంద్ర కుంతియా ప్రకటించారు. హైదరాబాద్‌లో ఎమిగ్రంట్స్ వెల్పేర్ ఫోరం ఆధ్వర్యంలో ‘ఎన్నారైలకు ప్రాక్సీ ఓటింగ్– ఎన్నికల్లో గల్ఫ్ ప్రవాసుల ప్రభావం’ అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రాతినిధ్యం సవరణ బిల్లు–2017ను పార్లమెంట్ ఆమోదించగా, రాజ్యసభలో ఆమోదించాల్సి ఉందన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే సుమారు కోటిన్నర మంది ప్రవాస భారతీయలు ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుదని చెప్పారు. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు గుర్తింపుతోపాటు సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎమిగ్రంట్స్ వెల్పేర్ ఫోరం అధ్యక్షుడు ఎం బీమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు మాసాలు స్థానికంగా లేకుంటే ఓటు హక్కు తొలగిస్తున్నారని, ప్రవాస భారతీయులకు ఓటు హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం కోటిన్నర మంది ప్రవాస భారతీయులుంటే 25 వేలమంది కూడా ఓటర్లుగా నమోదు కాలేదని, తెలంగాణకు చెందిన 15 లక్షల మందికి గాను 1500 మంది కూడా ఓటరుగా నమోదు కాలేదని గుర్తు చేశారు. ఓటరు నమోదుపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓటరుగా నమోదైతే తెలంగాణలోని 25 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రవాస భారతీయులు గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదన్నారు. రాజకీయ పార్టీలు ప్రవాస భారతీయులకు సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సదస్సులో ప్రవాస భారతీయుల ప్రతినిధులు డాక్టర్ వినోద్ కుమార్, దేవేందర్‌రెడ్డి, అసీమ్ రాయ్, అజీజ్ , లిస్సీ డాక్టర్ రఘు, ప్రొఫెసర్ అడప సత్యనారాయణ, సురేష్ రెడ్డి, బసంత్‌రెడ్డి ఉపాస, హేమంత్, కేఎస్ రామ్, రేణుక శాంతిప్రియ, డీపీ రెడ్డి, భవానిరెడ్డి, బండ సురేందర్ తదితర సదస్సులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. -
ప్రవాసులకు ప్రాగ్జీ ఓటింగ్!
సాక్షి, నెట్వర్క్: సర్వీస్ ఓటర్ల (రక్షణ సిబ్బంది, భద్రతా దళాల) తరహాలోనే ప్రవాస భారతీయులకు ‘ప్రాగ్జీ ఓటింగ్’ (పరోక్ష ఓటింగ్.. అంటే ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రజా ప్రాతినిధ్య (సవరణ) బిల్లు–2017ను లోక్‌సభ గత వారం ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్ట సవరణ అమలులోకి వస్తుంది. 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణ సెక్షన్ 20–ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో ‘ఓవర్సీస్ ఎల క్టర్స్’గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొత్త బిల్లు ఆమోదం పొందితే ఎంతో మంది ప్రవాస భారతీయులకు మన దేశంలో నిర్వహించే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన మన దేశ పౌరులకు ఈ ‘ప్రాగ్జీ’ ఓటింగ్ విధానం ప్రయోజనం కల్పిస్తుంది. గల్ఫ్ మినహా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఇతర విదేశాల్లో ఉపాధి పొందుతున్న వారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఆ దేశ పౌరసత్వం లభించే అవకాశం ఉంది. ఒక్క గల్ఫ్ దేశాల్లో మాత్రం విదేశీయులకు పౌరసత్వాన్ని ఆ దేశాలు ఇచ్చే అవకాశం లేదు. గల్ఫ్ ఓటర్లు కీలకం ’ప్రాగ్జీ ఓటింగ్’ సౌకర్యం ద్వారా సుమారు కోటీ 50 లక్షల మంది ఎన్నారైలు భారత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నారైలను పట్టించుకోవాల్సిన అవసరం అనివార్యమైంది. అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న సుమారు 10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు 25 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలరు. ఒక్కో గల్ఫ్ ఎన్నారైకి కుటుంబ సభ్యులందరు కలిపి కనీసం ఐదుగురు ఉంటారు. అంటే గల్ఫ్ ప్రవాసులు వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 60 లక్షల మందితో ‘గల్ఫ్ ఓటు బ్యాంకు’ రూపు దిద్దుకుంటుంది. వీరు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ప్రవాస భారతీయులకు హక్కులు కల్పించేందుకు, సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ పార్టీలు తమ మెనిఫెస్టోలో పేర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రవాస భారతీయుల పేరిట ఉన్న భూములకు పెట్టుబడి సహాయం అందించలేదు. కానీ పరోక్ష పద్ధతిలో ఎన్నారైలకు ఓటు హక్కు లభించడం వల్ల ప్రభుత్వం తన ఆలోచన తీరును మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఎన్నారైలు ఆన్లైన్లో ఓటు నమోదు ఇలా చేసుకోవచ్చు.. భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ లింకు http:// www. nvsp. in/ Forms/ Forms/ form6 a? lang= en-GB ను క్లిక్ చేయగానే స్క్రీన్‌పై ఫామ్ 6ఎ కనిపిస్తుంది. ముందుగా ఓటరు నమోదు అధికారి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ (పాస్‌పోర్ట్ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు, బంధుత్వం నమోదు చేయాలి. పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగం(స్త్రీ, పురుష, ఇతర), ఈ–మెయిల్, ఇండియా మొబైల్ నంబర్‌ను పేర్కొనాలి. ఇండియాలోని చిరునామా (పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా) ఇంటి నంబర్, వీధి పేరు, పోస్టాఫీసు పేరు, గ్రామం/పట్టణం, జిల్లా, పిన్‌కోడ్ తెలియజేయాలి. పాస్‌పోర్ట్ నంబరు, పాస్‌పోర్ట్ జారీ చేసిన ప్రదేశం పేరు, పాస్‌పోర్ట్ జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా నంబర్, వీసా కేటగిరీ (సింగిల్ ఎంట్రీ / మల్టిపుల్ ఎంట్రీ /టూరిస్ట్ /వర్క్ వీసా), వీసా జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణం ఉద్యోగం కోసమా, విద్య కోసమా, లేదా ఇతర కారణాలా వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు అయిన తేదీ పేర్కొనాలి. దరఖాస్తుదారు ఈ విధంగా డిక్లరేషన్ (వాంగ్మూలం) ఇవ్వాలి ‘నాకు తెలిసినంతవరకు ఈ దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిజమైనవి. నేను భారత పౌరుడిని. నేను ఇతర దేశం పౌరసత్వాన్ని కలిగిలేను. ఒకవేళ నేను విదేశీ పౌరసత్వం పొందినట్లయితే వెంటనే భారత రాయబార కార్యాలయానికి తెలియజేస్తాను. ఒకవేళ నేను భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి సాధారణ నివాసిగా మారినట్లయితే మీకు వెంటనే తెలియజేయగలను. ఓటరు నమోదు కోసం ఇతర నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకోలేదు. ఇది వరకు నాకు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నట్లయితే దానిని మీకు వాపస్ చేస్తాను. తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 సెక్షన్ 31 ప్రకారం నేను శిక్షార్హుడిని’. బీఎల్ఓ విచారణ దరఖాస్తు చేసిన తర్వాత బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ) భారతదేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఎలాంటి అభ్యంతరాలూ లేకపోతే ఏడు రోజుల్లో ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించారు ప్రవాస భారతీయులను ఓటర్లుగా ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది. మేము మా కోసమే కాదు దేశం కోసం కష్టపడుతున్నాం. మా వల్ల ఎంతో విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి వచ్చి చేరుతుంది. ప్రవాస భారతీయులు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పార్లమెంట్ ఆమోదించడం ఎంతో సంతోషం కలిగించింది. – గద్దె శ్రీనివాస్, ఖతార్ (డిచ్పల్లి వాసి) ఓటు హక్కు కల్పించడం సంతోషం విదేశాల్లో ఉన్న ప్రవాసులందరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆలోచన మంచిది. అయితే ఓటును ఎలా వేయాలన్నదానిపై కూడా స్పష్టత అవసరం. టెక్నాలజీ ఎంతో అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ ద్వారానైనా, ఇతర పద్ధతుల ద్వారానైనా ఓటును ప్రతీ ఒక్కరూ వినియోగించుకునే అవకాశం కల్పించాలి. –సిరికొండ నర్సింలు, మస్కట్ (గన్పూర్– ఎం. మాచారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా) 16 ఏళ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకో లేదు నేను 16 ఏళ్ల నుంచి గల్ఫ్‌కు వెళుతున్నాను అప్పటి నుంచి ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నాను. రెండేళ్లకు ఒకసారి ఇంటికి వచ్చి వెళుతున్నా మేము వచ్చిన సమయంలో ఎన్నికలు లేక పోవడంతో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదు. పరోక్ష పద్ధతిలోనైనా మేము ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం దక్కనుంది. – శ్రీనివాస్ గుప్తా, బహ్రెయిన్ (నిజామాబాద్ జిల్లా) హక్కులు సాధించుకోవడానికి మంచి అవకాశం ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ వల్ల తమ హక్కులను సాధించుకోవడానికి అవకాశం లభించింది. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మాకు ఓటు హక్కు లభించడంతో మా హక్కులను రాజకీయ పార్టీలు గుర్తించే అవకాశం ఉంది. ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ ఆహ్వానించదగిన పరిణామం. – మహ్మద్ యూసుఫ్ అలీ, అధ్యక్షుడు తెలుగు అసోషియేషన్ ఆఫ్ జిద్దా, సౌదీ అరేబియా (కరీంనగర్ జిల్లా వాసి) ఓటింగ్‌లో పాల్గొనాలనే కల నిజమవుతున్నది స్వదేశంలో లేకున్నా ప్రతినిధి ద్వారా ఓటు వేసే అరుదైన అవకాశం రావడం సంతృప్తినిస్తుంది. ‘ప్రాగ్జీ ఓటింగ్’ అనే ప్రక్రియ ఒక వైవిధ్యమైన వర్ణమాల లాంటిది. మనం భారతీయులమైనందుకు గర్వించాలి. –అమ్రీనా ఖైసర్, జిద్దా, సౌదీ అరేబియా (హైదరాబాద్) రాజకీయాలను ప్రభావితం చేస్తారు పరాయి దేశంలో ఉన్న వారికి మన దేశంలో ఓటు వేసే అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో ఉంటూ మన దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రవాసీయులకు రాజకీయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లభిస్తుంది. ప్రవాసీయులు అభ్యర్థుల కంటే.. పార్టీ మేనిఫెస్టోకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. – జువ్వాడి శ్రీనివాస్‌రావు, ఉమల్కోయిల్ (నర్సింగాపూర్, సిరిసిల్ల జిల్లా) ఓటర్లలో చైతన్యం వస్తే మేలు.. తెలంగాణ జిల్లాల్లో చాలా మంది ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరి కాదు.. ఓటర్లలో చైతన్యం వస్తేనే సమాజానికి మేలు జరుగుతుంది. అబుదాబీలో ఉంటున్న ప్రవాసీ శంషీర్ సుప్రీంకోర్టులో చేసిన పోరాట ఫలితంగానే ప్రవాసీయులకు ఓటు హక్కు లభించిందని భావిస్తున్నాను. ఓటు హక్కు కల్పించడం మంచిదే. సంక్షేమ పథకాలు దూరమవుతాయనే భయంతో ఓటర్లుగా నమోదు కావడం లేదు. దీనిపై చైతన్య పరుస్తాం. – సలాఉద్దీన్, షార్జా (జగిత్యాల) ఓటింగ్‌కు అవకాశం వల్ల గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం ప్రవాస భారతీయులకు ఓటింగ్‌కు అవకాశం కల్పించడం వల్ల గల్ఫ్ కార్మికులకే ఎక్కువ ప్రయోజనం కలుగనుంది. గల్ఫ్ మినహా ఇతర దేశాల్లో ఉంటున్న వారికి ఆ దేశ పౌరసత్వం లభించే అవకాశం ఉంది. గల్ఫ్ కార్మికులకు మాత్రం గల్ఫ్ పౌరసత్వం ఎప్పటికీ లభించదు. బిల్లు ఆమోదం వల్ల గల్ఫ్ కార్మికులకు లాభమే. – ముత్యాల వినయ్‌కుమార్, కువైట్ (హైదరాబాద్ వాసి) ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం.. గల్ఫ్ దేశాల్లో ఉండే వారికి ఇది మంచి అవకాశం. ఎన్నో ఏళ్లుగా వివిధ దేశాల్లో ఉన్న వారు ఓటు హక్కుకు దూరమయ్యారు. ఇప్పుడు తొలిసారిగా అవకాశం రావడం స్వాగతించాల్సిన విషయం. దీనిపై వలస జీవులను చైతన్య పరిచి ఎక్కువ మంది ఓటు వేసే విధంగా చూస్తాం. – వంశీగౌడ్, గల్ఫ్ కార్మికుల ఆహ్వాన వేదిక ఉపాధ్యక్షుడు, దుబాయి (ఆర్మూర్) మార్గదర్శకాలు రాగానే అమలు చేస్తాం... భారతీయులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంపై పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలుసు. కానీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు. ప్రవాస భారతీయులు ఎవరైనా ఓటు హక్కు కోసం వస్తే ఫాం 6(ఏ)ని పూరించి హక్కును కల్పిస్తున్నాం. మార్గదర్శకాలు రాగానే వాటిని అమలు చేస్తాం. – వినోద్‌కుమార్, ఆర్డీఓ నిజామాబాద్ -
ఓవర్సీస్ ఓటర్లు రెట్టింపు
సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్లుగా నమోదైన ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ) సంఖ్య గత మూడేళ్లలో రెట్టింపైనట్టు ఈసీ, ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.విదేశాల్లో నివసించే భారతీయుల సంఖ్యాపరంగా చూస్తే ఈ గణాంకాలు ఇప్పటికీ అతి తక్కువ గమనార్హం. ఓవర్సీస్ ఓటరు ఎన్నికల సమయంలో విధిగా భారత్‌కు రాకుండానే తమ ప్రతినిధి ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజా ప్రాతినిథ్య చట్టంలో మార్పులు చేపడుతున్న క్రమంలో ఎన్ఆర్ఐలు భారత్‌లో ఓటరుగా నమోదయ్యేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. గతంలో ఓటరుగా నమోదు చేసుకున్న ఎన్ఆర్ఐలు ఓటు వేయాలంటే విధిగా దేశానికి వచ్చి తమ నియోజకవర్గాల్లో స్వయంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి. ఇది తీవ్ర వ్యయప్రయాసలకు లోనుచేస్తుండటంతో ఎన్ఆర్ఐలు ఓటింగ్ ప్రక్రియపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మే, 2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోటి మందికి పైగా ప్రవాసులుంటే వారిలో కేవలం 11,846 మందే ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు. 2015 నాటికి వీరి సంఖ్య రెండింతలై 24,348కి చేరిందని పార్లమెంట్లో ప్రభుత్వం పేర్కొంది.కాగా వీరిలో 23,556 మంది కేరళకు చెందిన వారే. -
ఓట్లు.. పలు రకాలు..
పోల్ చిట్టీ తీసుకెళ్లడం.. అక్కడి అధికారులు దాన్ని పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే అనుమతించడం.. ఆ తర్వాత ఓటు వేసి ఇంటికి రావడం. ఇదే చాలా మందికి తెలిసిన విషయం. కానీ.. ఓట్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితులు, వ్యక్తులకు మాత్రమే ఈ ఓట్లు వేసే అవకాశముంది. అలాంటి వాటిపై ప్రత్యేక కథనం. - న్యూస్‌లైన్, కలెక్టరేట్ ఫ్రాక్సీ ఓటింగ్ కొన్ని రకాల సర్వీసు ఓటర్లనే ఫ్రాక్సీ ఓటర్లు అని అంటారు. భద్రతా బలగాలు, రక్షణ రంగాల్లో పనిచేసే వారికి ఫ్రాక్సీ విధానం ద్వారా ఓటు వేసే అవకాశముంటుంది. వారు స్థానికంగా లేనందున ఓటు వేసేందుకు ఒక ప్రతినిధిని అధికారులు అనుమతిస్తారు. వీరిని క్లాసిఫైడ్ సర్వీసు ఓటరుగా గుర్తిస్తారు. నియోజకవర్గం, పోలింగ్ బూత్ పరిధిలోని ఫ్రాక్సీఓటరు వివరాలపై ఆర్ఓ ద్వారా ప్రిసైడింగ్ అధికారికి ముందే సమాచారం అందుతుంది. సర్వీసు ఓటరు తరఫున వచ్చే ఫ్రాక్సీ ఓటరు ఆ పోలింగ్ బూత్ పరిధిలోని మిగతా ఓటర్ల మాదిరిగానే ఓటు వేస్తారు. అయితే సాధారణ ఓటరుకు కుడి చేతికి సిరాచుక్క పెడితే.. ఫ్రాక్సీ ఓటరుకు మధ్య వేలికి చుక్క పెడతారు. ఏమంటే.. ఆయన తన సొంత ఓటు వేసినప్పుడు చూపుడు వేలికి సిరాచుక్క పెట్టాల్సి ఉంటుంది. కాగా, ఫ్రాక్సీ ఓటరు తన ఓటు కాక ఒకరికి మాత్రమే ఫ్రాక్సీగా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. టెండర్ ఓటు కొన్ని సందర్భాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతడి ఓటు ఇంకెవరో వేసి వెళ్లిన సందర్భాలు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రిసైడింగ్ అధికారి పరిశీలించి.. అతను, ఆమె వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే.. ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనినే టెండర్డ్ ఓటు అంటారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్‌కు పార్లమెంట్, శాసనసభకు సంబంధించి 20 చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచుతారు. ఇవి బీయూపై అమర్చే వాటిలాగే ఉంటాయి. ఆ బ్యాలెట్‌ను తీసుకుని ఓటరు కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఓటు వేశాక కవర్లో పెట్టి ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తే.. దాని వెనుక టెండర్ బ్యాలెట్ అని రాస్తారు. చాలెంజ్ ఓటు ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటరు తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతడి పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటరు, ఏజెంట్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పి ఏజెంట్ నుంచి రూ.2 చాలెంజ్ ఫీజు తీసుకుని ఓటరు వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే స్థానిక బీఎల్ఓను పిలిచి ఆరా తీస్తారు. అయితే అతడు, ఆమె స్థానిక ఓటరై జాబితాలో ఉన్న పేరు సరైందే అయితే.. వయసు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్, ఓటరును అక్కడే ఉండే పోలీసులకు అప్పగించొచ్చు. ఇక ఏజెంట్ పదేపదే చాలెంజ్ చేస్తే అతడిని బయటకు పంపించే అధికారం ప్రిసైడింగ్ అధికారికి ఉంటుంది.