ఓట్లు.. పలు రకాలు..
పోల్ చిట్టీ తీసుకెళ్లడం..
అక్కడి అధికారులు దాన్ని పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే అనుమతించడం.. ఆ తర్వాత ఓటు వేసి ఇంటికి రావడం. ఇదే చాలా మందికి తెలిసిన విషయం. కానీ.. ఓట్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితులు, వ్యక్తులకు మాత్రమే ఈ ఓట్లు వేసే అవకాశముంది. అలాంటి వాటిపై ప్రత్యేక కథనం.
- న్యూస్‌లైన్, కలెక్టరేట్
ఫ్రాక్సీ ఓటింగ్
కొన్ని రకాల సర్వీసు ఓటర్లనే ఫ్రాక్సీ ఓటర్లు అని అంటారు. భద్రతా బలగాలు, రక్షణ రంగాల్లో పనిచేసే వారికి ఫ్రాక్సీ విధానం ద్వారా ఓటు వేసే అవకాశముంటుంది. వారు స్థానికంగా లేనందున ఓటు వేసేందుకు ఒక ప్రతినిధిని అధికారులు అనుమతిస్తారు. వీరిని క్లాసిఫైడ్ సర్వీసు ఓటరుగా గుర్తిస్తారు. నియోజకవర్గం, పోలింగ్ బూత్ పరిధిలోని ఫ్రాక్సీఓటరు వివరాలపై ఆర్‌ఓ ద్వారా ప్రిసైడింగ్ అధికారికి ముందే సమాచారం అందుతుంది.
సర్వీసు ఓటరు తరఫున వచ్చే ఫ్రాక్సీ ఓటరు ఆ పోలింగ్ బూత్ పరిధిలోని మిగతా ఓటర్ల మాదిరిగానే ఓటు వేస్తారు. అయితే సాధారణ ఓటరుకు కుడి చేతికి సిరాచుక్క పెడితే.. ఫ్రాక్సీ ఓటరుకు మధ్య వేలికి చుక్క పెడతారు. ఏమంటే.. ఆయన తన సొంత ఓటు వేసినప్పుడు చూపుడు వేలికి సిరాచుక్క పెట్టాల్సి ఉంటుంది. కాగా, ఫ్రాక్సీ ఓటరు తన ఓటు కాక ఒకరికి మాత్రమే ఫ్రాక్సీగా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.
టెండర్ ఓటు
కొన్ని సందర్భాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతడి ఓటు ఇంకెవరో వేసి వెళ్లిన సందర్భాలు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రిసైడింగ్ అధికారి పరిశీలించి.. అతను, ఆమె వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే.. ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనినే టెండర్డ్ ఓటు అంటారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్‌కు పార్లమెంట్, శాసనసభకు సంబంధించి 20 చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచుతారు. ఇవి బీయూపై అమర్చే వాటిలాగే ఉంటాయి. ఆ బ్యాలెట్‌ను తీసుకుని ఓటరు కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఓటు వేశాక కవర్‌లో పెట్టి ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తే.. దాని వెనుక టెండర్ బ్యాలెట్ అని రాస్తారు.
చాలెంజ్ ఓటు
ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటరు తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతడి పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటరు, ఏజెంట్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పి ఏజెంట్ నుంచి రూ.2 చాలెంజ్ ఫీజు తీసుకుని ఓటరు వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే స్థానిక బీఎల్‌ఓను పిలిచి ఆరా తీస్తారు. అయితే అతడు, ఆమె స్థానిక ఓటరై జాబితాలో ఉన్న పేరు సరైందే అయితే.. వయసు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్, ఓటరును అక్కడే ఉండే పోలీసులకు అప్పగించొచ్చు. ఇక ఏజెంట్ పదేపదే చాలెంజ్ చేస్తే అతడిని బయటకు పంపించే అధికారం ప్రిసైడింగ్ అధికారికి ఉంటుంది.