సాక్షి, కరీంనగర్: ఈ నెల 30న(శనివారం) జరిగే హజూరాబాద్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేయించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజు ఉదయం ఓటింగ్ ప్రక్రియ మొదలుకాక ముందు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల్లోపు మాక్ పోలింగ్ పూర్తవుతుంది. తర్వాత సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కోవిడ్ కారణంగా ఈసారి రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసేది. ఈ నేపథ్యంలో మాక్ పోలింగ్ ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం.
చదవండి: ఓటరు ఎటువైపు?.. కీలకంగా చివరి 24 గంటలు
► ముందుగా పోలింగ్ జరిగే తేదీన సిబ్బంది ఉదయం 5.30 కల్లా రెడీగా ఉంటారు. పోలింగ్ ఏజెంట్లు కూడా హాజరవుతారు.
►పోలింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి ఫాం–10ని సిబ్బంది తీసుకుంటారు. వాటిపై ఏజెంట్ల సంతకాలు తీసుకొని, అడ్మిషన్ పాసులు ఇస్తారు. ఒక్కో అభ్యర్థి తరఫున ఒక్కరు మాత్రమే పోలింగ్ కేంద్రంలో ఉంటారు.
►పోలింగ్ ఏజెంట్ల వద్ద సెల్‌ఫోన్లు ఉండకూడదు. నిబంధనల ప్రకారం పోలింగ్ సమయంలో ఫొటోలు తీయకూడదు.
►పోలింగ్ ఏజెంట్ల పేరు ఆ ఓటరు లిస్టులో నమోదై ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. తర్వాత పోలింగ్ యంత్రాన్ని సిద్ధం చేసుకొని, ఉదయం 7గంటల్లోపు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.
►మాక్ పోలింగ్ అనేది ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. ఒకవేళ వారు లేకపోతే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల సమక్షంలో కనీసం 50 ఓట్లకు తగ్గకుండా నిర్వహిస్తారు.
►మాక్ పోలింగ్ నిర్వహించేటప్పుడు ముందుగా కంట్రోల్ యూనిట్‌లోని క్లియర్ బటన్‌ని ప్రెస్ చేయాలి. అక్కడ డిస్‌ప్లే సెక్షన్ “0’ని చూపిస్తుంది. అలాగే వీవీ ప్యాట్‌లోని డ్రాప్ బాక్స్ కూడా క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. ఏజెంట్లకు కూడా చూపించాలి. అనంతరం పోలింగ్ ఏజెంట్లను పిలిచి, వాళ్లకు ఇష్టమైన గుర్తును నొక్కమని చెప్పి, ఇలా సుమారుగా 50 ఓట్లకు పైగా వేయిస్తారు.
చదవండి: అసలీ పోలింగ్ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు వేయడమెలా?
►ఈ క్రమంలో ఆ ఏజెంట్ పేరు, వేసిన గుర్తు, ఎన్ని ఓట్లు వేశాడు? అనే విషయాన్ని ఒక పేపరు మీద రాసుకోవాలి. ఏజెంట్లు అందరూ ఓటింగ్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్‌లో క్లోజ్ బటన్ నొక్కాలి. ఒకసారి క్లోజ్ బటన్ నొక్కాక బ్యాలెట్ యూనిట్‌లో ఏ గుర్తుకు ఓటు వేసినా మనకు ఇన్‌వ్యాలిడ్ అని చూపిస్తుంది. అనంతరం టోటల్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఎన్ని ఓట్లు నమోదయ్యాయో చూపిస్తుంది. తర్వాత రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే అభ్యర్థి వారీగా ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో చూపిస్తుంది. అనంతరం వీవీ ప్యాట్‌లోని స్లిప్పులను ప్రింట్ తీసి, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లకు చూపిస్తారు.
►ఏజెంట్లు వేసిన ఓట్లు, వీవీ ప్యాట్‌లోని స్లిప్పుల్లో వచ్చిన ఫలితం లెక్క సరిపోయిందో లేదో సరిచూసుకుంటారు. తర్వాత కంట్రోల్ యూనిట్‌లో క్లియర్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీంతో అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్లీ “0’ నుంచి మొదలవుతుంది.
►అనంతరం స్లిప్పుల వెనకాల మాక్‌పోల్ అనే ముద్ర వేసి, ఒక కవర్‌లో వేసి, సీల్ చేస్తారు. ప్రిసైడింగ్ అధికారి సంతకం చేశాక అక్కడ ఉన్న ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత వాటిని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచి, పింక్ కలర్ ట్యాగ్‌తో సీల్ చేస్తారు. ఆ ట్యాగ్ మీద కూడా పీఓ (ప్రిసైడింగ్ అధికారి) సంతకంతోపాటు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.
►ప్లాస్టిక్ బాక్స్ మీద నియోజకవర్గం పేరు, నంబర్, పోలింగ్ స్టేషన్ పేరు, నంబర్ స్పష్టంగా రాయాలి. తర్వాత పీఓ అనుబంధం–14 ఫాంను నింపాలి. ఈ మాక్ పోల్ అయిపోయాక కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్‌లకు పటిష్ఠంగా సీలు వేయాలి. ఈ విధంగా మాక్ పోలింగ్‌ను ఉందయం 6 గం. నుంచి 7గంటల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఛాలెంజ్ ఓటు
ఓటు వేయడానికి వెళ్లిన వ్యక్తిని అతను నిజమైన ఓటరు కాదని బూత్‌లో ఉన్న ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఎన్నికల అధికారి అక్కడికక్కడే నిలిపివేస్తారు. ఆ సమయంలో ఛాలెంజ్ ఓటు అనుమతిస్తుంది. ప్రిసైడింగ్ అధికారి ఓటరుతోపాటు ఏజెంటు అభ్యంతరాలను విన్న తర్వాత అక్కడ క్యూలో ఉన్న ఓటర్లతో విచారణ చేపడతారు. అతను నిజమైన ఓటరు అని తేలితే ఓటు వేయడానికి అనుమతిస్తారు. కాదని తేలితే నిబంధనల ప్రకారం చర్యలుంటాయి. ఛాలెంజ్ ఓటరు వివరాలను అక్కడికక్కడే నమోదు చేస్తారు.
టెస్టింగ్ ఓటు
ఓటు వేశాక ఓటరు తన ఓటు వివరాలు సక్రమంగా రాకపోతే వెంటనే అధికారికి ఫిర్యాదు చేయాలి. ఈ విషయంలో అక్కడికక్కడే పోలింగ్‌ను నిలిపివేయడానికి అవకాశముంది. తన ఓటు తాను కోరుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి నమోదైనట్లుగా స్లిప్పులో వివరాలు వస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఏజెంట్ సమక్షంలో విచారణ చేపడతారు. ఓటరు చేసిన ఆరోపణ నిజమైతే పోలింగ్‌ను నిలిపివేస్తారు. తప్పని తేలితే అతనిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు.
టెండర్డ్ ఓటు
ఓటరు తాను ఓటు వేయడాని కంటే ముందుగానే మరో వ్యక్తి అతని ఓటు వేసిన నేపథ్యంలో బాధితుడి టెండర్డ్ పద్ధతిలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. వచ్చిన వ్యక్తి నిజమైన ఓటరు అని ఏజెంట్లతో విచారణ చేసినపుడు నిర్ధారణ అయితే అతడికి బ్యాలెట్ పత్రాన్ని అందజేసి, ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఆ విధంగా వేసిన ఓటును భద్రపరుస్తారు. అభ్యర్థుల మధ్య ఓట్లు సమానంగా వచ్చినపుడు టెండర్డ్ ఓటును పరిగణనలోకి తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment