
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా మంగళ, బుధవారాలు మాత్రమే మిగిలి ఉండటంతో నేతలు ప్రచారం స్పీడు పెంచారు. అలాగే ఎన్నికల అధికారులు కూడా పోలింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పెంచారు. గతంలో ఇది సాయంత్రం 5 గంటలకే ముగిసేది. దీంతో ఈసారి భారీగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
చదవండి: Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్..?
నియోజకవర్గంలో మొత్తం 305 పోలింగ్‌స్టేషన్లలో ఏర్పాట్లు దాదాపుగా చివరి దశకు వచ్చాయి. అన్ని చోట్లా ఓటర్లకు మౌలిక సదుపాయాలైన తాగునీరు, షామియానాలు, వికలాంగులకు ప్రత్యేక ర్యాంపులు, వైద్యసిబ్బంది, భౌతికదూరం, శానిటైజర్లు తదితరాలు సిద్ధం చేస్తున్నారు. ఈమొత్తం ఏర్పాట్లను కలెక్టర్ కర్ణన్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఓటరు స్లిప్పుల పంపిణీ, ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్/ డెత్) సర్వే కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు మొత్తం 2.36 లక్షలకు పైగా ఉన్న ఓటర్లలో దాదాపు 7,500 మరణిచారని తెలిసింది.
చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: పనికి రాను ప్రచారానికి పోవాలే..
కలిసిరానున్న సమయం!
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జరుగుతోంది. ఓటర్లు భౌతికదూరం, మాస్కు, శానిటైజర్ల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అందుకే, ఈసారి పోలింగ్ సమయాన్ని రెండు గంటలు అదనంగా కేటాయించారు. ఇదే రాజకీయ పార్టీలకు కలిసిరానుంది. ఈ సమయం నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి, హైదరాబాద్, ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారంతా సులువుగా చేరుకునేలా అనుకూలంగా ఉంది. ఉదాహరణకు హుజూరాబాద్‌లో ఓటు ఉన్న ఒక్క ఓటరు కనీసం 400 కి.మీ దూరంలో ఉన్నా సరే.. 30వ తేదీ ఉదయం బస్సు ఎక్కినా సాయంత్రం 4 గంటలకల్లా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.
రాత్రి వరకు పోలింగ్..!
పోలింగ్ నేపథ్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి చేరుకునే వీలుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఒక్కసారి కేంద్రంలోకి ప్రవేశించిన ఓటరు ఎంత ఆలస్యమైనా సరే.. ఓటు వేసేందుకు అర్హులు. అంటే రాత్రి 7 గంటల్లోపు కేంద్రంలోకి చేరుకునే వీలు ఉండటంతో ఈసారి పోలింగ్ అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము వరకు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. బహుశా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిన ఉప ఎన్నిక ఇటీవలి కాలంలో ఇదే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, అందుకు తగినట్లుగా ప్రభుత్వం 30వ తేదీ సెలవుదినంగా ప్రకటించింది. మరునాడు ఆదివారం కూడా సెలవు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ చర్యలతో ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment