
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకూ ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా రెండు దశల పోలింగ్ మిగిలివుంది. ఐదవ దశ ఓటింగ్‌లో జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదయ్యింది.
సోమవారం జరిగిన పోలింగ్‌లో బారాముల్లాలో 59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది 1984 తర్వాత అత్యధికం. కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారి పీకె పాల్ ఈ వివరాలను తెలిపారు. 1967లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు బారాముల్లా లోక్ సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందన్నారు. 1984లో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 58.90 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఇది 59శాతంగా ఉంది. ఈ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,37,865 మంది ఓటర్లు ఉన్నారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలోని 2,103 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరిగింది. 2019లో ఈ నియోజకవర్గంలో 34.6 శాతం ఓటింగ్ జరగగా, 1989లో అది 5.48 శాతం మాత్రమే ఉంది.
దీనికి ముందు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో శ్రీనగర్‌లో 38.49 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత అత్యధికం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇవే మొదటి సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడి ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు జమ్మూ కశ్మీర్ ఓటర్లకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.