లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పలు చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం అందరినోళ్లలో నానుతోంది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది. దేశవ్యాప్తంగా దిగువ సభకు ఎన్నికైన మొత్తం మహిళా ఎంపీల్లో 11 మంది పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే కావడం విశేషం. ఈ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, బీజేపీ అత్యధికంగా 69 మంది మహిళా అభ్యర్థులను, కాంగ్రెస్ 41 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ చట్టంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేసే నిబంధన ఉంది. అయితే ఈ చట్టం ఇంకా అమలు కాలేదు.
ఎన్నికల కమిషన్ డేటాలోని వివరాల ప్రకారం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 30 మంది మహిళా అభ్యర్థులు, కాంగ్రెస్‌కు చెందిన 14 మంది, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 11 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నలుగురు, డీఎంకేకు చెందిన ముగ్గురు, జనతాదళ్ (యునైటెడ్), ఎల్‌జేపీకి చెందిన ఒక్కో మహిళా అభ్యర్థి గెలుపొందారు.
ఈలోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన హేమా మాలిని, తృణమూల్‌కు చెందిన మహువా మోయిత్రా, ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్)కి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకోగా, కంగనా రనౌత్, మిసా భారతిల విజయం అందరి దృష్టిని ఆకర్షించింది.
Comments
Please login to add a commentAdd a comment