lower
-
అలాంటి మరణాలకు కాఫీతో చెక్ : ఎగిరి గంతేసే విషయం!
కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని, ప్రాణానికే ముప్పు అని గతంలో అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే తాజా అధ్యయనం మాత్రం దీనికి ఒక పరిష్కారాన్ని సూచిస్తోంది. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. విషయమం ఏమిటంటే.కూర్చోవడం వల్ల మరణ ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుందట. నిశ్చల జీవనశైలి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా ఉంటుందని కొత్త అధ్యయనం సూచిస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ సేపు కూర్చుని రోజూ కాఫీ తాగే వారు వివిధ కారణాల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను కాఫీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశంపై 10 వేల మందిపై ఈ అధ్యయనం సాగింది. ఆసక్తికరంగా, ఎక్కువసేపు కూర్చొనే వ్యక్తుల్లో ఎంత కాఫీ తాగినా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తక్కువట. ఎక్కువసేపు కూర్చున్న కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ కాఫీ (రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ) తీసుకునే వారు కూడా మొత్తం మరణాల ప్రమాదాన్ని తగ్గిందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. ఇదే అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయమం ఏమిటంటే తీసుకోవాల్సిన లిమిట్ 3-5 కప్పులు. ఐదు కప్పులు దాటితే ప్రయోజనాలు తగ్గి పోతాయట. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని అయితే సరైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంత మోతాదు తీసుకోవాలనేదానిపై మరింత పరిశోధనఅవసరం అంటున్నారు పరిశోధకులు.ఈ అధ్యయనం బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడింది.గతంలో కూడా కాఫీ ద్వారా సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడవపచ్చని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కెఫీన్ ద్వారా టైప్ -2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి. కొలొరెక్టల్ కేన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతిరోజూ కనీసం ఐదు కప్పులు తాగేవారు తక్కువ తాగే వారితో పోలిస్తే పునరావృతమయ్యే అవకాశం గణనీయంగా తగ్గింది. కాఫీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి వాపును తగ్గిస్తాయి. కొన్ని కాఫీ భాగాలు మెదడును క్షీణించిన వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయని కూడా తెలిపాయి. -
ఓటింగ్ పెరిగినా.. లోక్‌సభలో తగ్గిన మహిళా ప్రాతినిధ్యం
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పలు చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం అందరినోళ్లలో నానుతోంది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం.ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది. దేశవ్యాప్తంగా దిగువ సభకు ఎన్నికైన మొత్తం మహిళా ఎంపీల్లో 11 మంది పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే కావడం విశేషం. ఈ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, బీజేపీ అత్యధికంగా 69 మంది మహిళా అభ్యర్థులను, కాంగ్రెస్ 41 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది.మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ చట్టంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేసే నిబంధన ఉంది. అయితే ఈ చట్టం ఇంకా అమలు కాలేదు. ఎన్నికల కమిషన్ డేటాలోని వివరాల ప్రకారం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 30 మంది మహిళా అభ్యర్థులు, కాంగ్రెస్‌కు చెందిన 14 మంది, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 11 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నలుగురు, డీఎంకేకు చెందిన ముగ్గురు, జనతాదళ్ (యునైటెడ్), ఎల్జేపీకి చెందిన ఒక్కో మహిళా అభ్యర్థి గెలుపొందారు. ఈలోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన హేమా మాలిని, తృణమూల్‌కు చెందిన మహువా మోయిత్రా, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్)కి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకోగా, కంగనా రనౌత్, మిసా భారతిల విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. -
ద్రవ్యలోటు మేనాటికి లక్ష్యంలో 11.8 శాతం,ఎన్ని లక్షల కోట్లంటే!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు-మే ముగిసే నాటికి లక్ష్యంలో 11.8 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.2,10,287 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజా గణాంకాలను విడుదల చేసింది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లకు కట్టడి చేయాలని బడ్జెట్ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి విలువ అంచనాలో ఇది 5.9 శాతం. అయితే 2023 మే నాటికి లక్ష్యంలో (రూ.17.86 లక్షల కోట్లు) రూ.2.10 లక్షల కోట్లకు చేరిందన్నమాట. 2022-23లో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతం. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) -
డిసెంబర్లో ‘సేవలు’ పేలవం
న్యూఢిల్లీ: భారత సేవల రంగానికి సంబంధించి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ డిసెంబర్లో 55.5కు పడిపోయింది. నవంబర్‌లో ఈ సూచీ 58.1 వద్ద ఉంది. సెప్టెంబర్ 2021 తర్వాత సూచీ ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన గడచిన ఐదు నెలల్లో సూచీ వృద్ధి బాటలోనే ఉంది. డిసెంబర్లో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయని, ధరల తీవ్రత ఉందని, మూడవ వేవ్ భయాందోళనలు పొంచిఉన్నాయని, ఆయా అంశాలు బిజినెస్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని నెలవారీ సర్వే పేర్కొంది. సేవల రంగంలో ఉపాధి అవకాశాలు కూడా డిసెంబర్లో నామమాత్రంగానే ఉన్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. భారత్‌లో నిరుద్యోగం డిసెంబర్లో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) ఇటీవలి గణాంకాలు వెల్లడించడం గమనార్హం. -
సెకెండ్ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదంట
ముంబై: కోవిడ్–19 ప్రతికూలతలతో తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయి, రుణ పునర్ వ్యవస్థీకరణ తప్పదని భావించిన పలు కంపెనీలు ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకుంటున్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంటున్నాయి.అదే సమయంలో మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం ఎకానమీలో రికవరీ జాడలు కనిపించడమే దీనికి కారణం. దీనితో ఆయా కంపెనీలపై వృద్ధి ధోరణిపై భరోసా ఏర్పడింది. దీనితో రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0కు కేవలం కొన్ని కంపెనీలే ముందుకు వస్తున్నాయి. తాను రేటింగ్ ఇచ్చిన 4,700 కంపెనీల్లో కేవలం ఒక శాతం అర్హత కలిగిన (రుణ పునర్వ్యవస్థీకరణకు) కంపెనీలు మాత్రమే రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0ను ఎంచుకున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ సుభోద్ రాయ్ నివేదికలో వివరించారు. మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. 2021 మే 5వ తేదీన ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వ్యక్తులు, చిన్న వ్యాపారులు, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల రుణ గ్రహీతలకు రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0ను ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ పరిమితిని రూ.25 కోట్లుగా నిర్ణయించింది. 2021 మార్చి 31న ప్రకటించిన తొలి ఫ్రేమ్‌వర్క్‌ను వినియోగించుకోని వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే జూన్ 4న రుణ పరిమితిని రూ.50 కోట్లకు పెంచింది. క్రిసిల్ రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 66 శాతం కంపెనీలు ఈ పరిధిలో ఉన్నాయి. అయితే అయితే కేవలం ఒకశాతం మాత్రమే పునర్వ్యవస్థీకరణను ఎంచుకుంటున్నల్లు క్రిసిల్ వివరించింది. వ్యాపార అవుట్‌లుక్ బాగుండడమే దీనికి కారణం. అయితే మూడవ వేవ్ వస్తే మాత్రం రుణ పునర్వ్యవస్థీకరణ 2.0ను ఎంచుకునే కంపెనీల సంఖ్య పెరుగుగుతుందని భావిస్తున్నట్లు క్రిసిల్ నివేదిక అభిప్రాయపడింది. చదవండి : జూలైలో జాబ్స్ పెరిగాయ్..రానున్న రోజుల్లో..! -
బ్యాంకులు, ఆటో దెబ్బ : 9 వేల దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆసియాలోనే మూడవ అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా ఉన్న దేశంలో లాక్ డౌన్ పొడిగింపు తప్పదన్న అంచనాల మధ్య కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఆరంభంలోనే బలహీనపడిన మార్కట్లు ఒక దశలో 600 పాయింట్లకు పైగా పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 470 పాయింట్లు నష్ఠం లేదా 1.51 శాతం పడి 30,690 వద్ద, నిఫ్టీ 1.3 శాతం క్షీణించి 8995 వద్ద ముగిసింది. ఫైనాన్షియల్, ఆటో, రియల్ ఎస్టేట్ రంగ నష్టాలను మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఫార్మ, మెటల్ రంగ షేర్లు లాభపడ్డాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ 10.3 శాతం, జీ 10 శాతం పతనంకాగా, ప్రైవేటు రంగ రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.95 శాతం క్షీణించి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.25 శాతం నష్టంతో టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇంకా ఎం అండ్ ఎం, టైటన్, విప్రో, హీరో మోటో, ఐసీఐసీఐ, బ్రిటానియా నష్టపోయాయి. మరోవైపు ఎల్ అండ్ టీ, హిందాల్కో, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియా, డా. రెడ్డీస్, గ్రాసిం, సిప్లా లాభపడ్డాయి. -
నష్టాలతో ప్రారంభం, మరింత పతనం
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. లాంగ్ వీకెండ్ అనంతరం కీలక సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ ఆరంభించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. నష్టాలనుంచి కోలుకున్నా, వెంటనే మరింత కీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం 600 పాయింట్ల నష్టంతో 30600 వద్ద, నిప్టీ 160 పాయింట్ల నష్టంతో 8942 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 31 వేల స్థాయి, నిఫ్టీ 9వేల దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లు నష్టపోతున్నాయి. మారుతి, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్ , టైటన్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర నష్టపోతుండగా, ఐఆర్ సీటీసీ, సిప్లా, భారతి ఎయిర్ టెల్ లాభపడుతున్నాయి. -
ఫెస్టివ్ బొనాంజా : ఎయిరిండియా కొత్త స్ట్రాటజీ
సాక్షి, న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకుని ప్రయివేటీకరణ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వినూత్న ప్రణాళికలను ప్రకటించింది. నవంబరు 30 నుంచి సాధారణ చార్జీల కంటే తక్కవ రేట్లలో దేశీయ సర్వీసులను ప్రకటించింది. గోవా, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని శనివారం (అక్టోబర్ 27) ఎయిరిండియా వెల్లడించింది. వచ్చే నెల చివరి నాటికి ఈ సర్వీసులను లాంచ్ చేస్తామని తెలిపింది.భారీ ట్రాఫిక్‌ను ఛేదించండి...హోటల్ ఖర్చుల భారం నుంచి బయటపడండి.. నమ్మనలేని తక్కువ ధరల్లో విమాన టికెట్లను ఆస్వాదించండి అంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఢిల్లీ-గోవా-ఢిల్లీ, ఢిల్లీ-కోయంబత్తూర్-ఢిల్లీ, బెంగుళూరు-అహ్మదాబాద్-బెంగుళూరులాంటి మార్గాల్లో సాధారణ విమాన ఛార్జీల కంటే తక్కువ రేట్లకే అందిస్తామని ప్రవేశపెడతామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా లేట్‌నైట్ బయలుదేరిన విమానాలు తెల్లవారేసరికి ఆయా గమ్యస్థానాలకు చేరేలా ఈ సర్వీసులను పరిచయం చేస్తున్నట్టు తెలిపింది. రెడ్‌ఐ విమానాలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్‌లో బాగా ప్రాచుర్యం పొందాయని, ఈ నేపథ్యంలో ఈ సర్వీసులను దేశీయంగా కూడా పరిచయం చేస్తున్నట్టు పేర్కొంది. #FlyAI : #airindia #redeyeflights #festivalbonanza Beat peak traffic, avoid hotel cost, enjoy cheapest fares on these latenight flights. Log on to https://t.co/T1SVjRD6o5 to grab fares you just can't believe. pic.twitter.com/VIO6sBj2xQ — Air India (@airindiain) October 27, 2018 -
జీడీపీ భయాలు : మిశ్రమంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచికోలుకుని 100పాయింట్లకుపైగా పుంజుకున్న కీలక సూచీలు , చివరకు ప్రధాన మద్దతు స్తాయిలను నిలబెట్టుకోలేకపోయాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు క్షీణించి 38,645 వద్ద,నిఫ్టీ 4 పాయింట్లు లాభంతో 11,680 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆయిల్, మెటల్ సెక్టార్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ, ఫార్మా రంగాలు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, టెక్ మహీంద్ర, భారతి ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ, ఎస్ బ్యాంక్ ,వేదాంత, ఐసీఐసీఐ, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, నష్టాలు మార్కెట్లు ప్రభావితం చేశాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రుపీ తొలిసారి డాలరు మారకంలో 71 రూపాయల స్థాయికి పతనమైంది. -
పని ఎక్కువ.. జీతం తక్కువ..
శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది. చెప్పుకునేందుకు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల హోదా అయినా.. సమయానికి వేతనాలు అందని దుస్థితి. ‘వారికేం.. వేలల్లో సంపాదిస్తారు..’ అనే పేరు తప్ప.. నెల గడిచినా.. జీతం ఎప్పుడొస్తుందోనని ఎదురుచూపులు తప్పడం లేదు. ఫీజు బకాయిల సాకుతో యాజమాన్యాలు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరికి ఇల్లు గడవడమే గగనమవుతోంది. ‘బాగా’నే ఇస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్న యాజమాన్యాలు.. ఇచ్చేది మాత్రం అందులో 25శాతానికి మించడం లేదు. పరీక్షల్లో ఇన్విజిలేషన్ చేసినందుకు అధ్యాపకులకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి పెండింగ్ జిల్లాలో మొత్తం 15 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఇందులో 13 ప్రైవేట్‌వే.. డిగ్రీ కళాశాలలు 129 ఉండగా 104 ప్రైవేట్‌వే.. వీటిలో మొత్తం 10వేలకుపైగా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్నిమాత్రమే క్రమం తప్పకుండా అధ్యాపకులకు వేతనాలు ఇస్తున్నాయి. మిగితా వాటిలో రెండు, మూడునెలలపాటు పెండింగ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. డిగ్రీలో 80 శాతం కళాశాలలు సమయానికి జీతాలివ్వడం లేదనే అపవాదు ఉంది. ఇంక్రిమెంట్ల విషయంలోనూ సరైన సమయానికి ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. రికార్డుల్లో నాలుగురెట్లు వేతనాలు సక్రమంగా చెల్లించని కొన్ని కళాశాలలు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. వేతనాలు తీసుకుంటున్నట్లు ఉద్యోగుల నుంచి సంతకాలు తీసుకుంటున్నాయి. సంతకం పెట్టకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో ఎదురుప్రశ్నించలేకపోతున్నారు. రికార్డుల్లో చూపించే వేతనాలు మాత్రం వాస్తవంగా వారికి చెల్లించే వేతనాలతో పొల్చితే మూడు, నాలుగు రెట్లు ఉంటున్నాయి. ఈ మేరకు వేతనాల రిజిస్టర్లు సాధరణరోజుల్లో, అ«ధికారుల తనిఖీలకు సంబంధించి వేరువేరుగా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్ని మూడు నుంచి ఆర్నెల్లకోమారు మాత్రమే జీతాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఒక కళాశాలకు చెందిన అధ్యాపకుడిని ఇంక్రిమెంట్లు వస్తాయా..? వేతనాలు నెలనెలా ఇస్తారా..? అని అడిగితే ‘ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు.. వేతనాలు నెలనెలా ఇస్తే అదే మహాభాగ్యం అంటూ నిట్టూర్చాడు. రెమ్యూనరేషన్‌కూ ఎసరు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించినప్పుడు.. ఇంటర్నల్ ప్రయోగపరీక్షలు నిర్వహించినప్పుడు అధ్యాపకులకు కొంత రెమ్యూనరేషన్ వస్తుంది. ఈ మొత్తాన్నీ ఇవ్వకుండా యాజమాన్యాలే మింగేస్తున్నాయని చర్చ అధ్యాపకుల్లో జరుగుతోంది. మరోవైపు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సంతకాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఏళ్ల తరబడి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న ప్రముఖ కళాశాలలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. తనిఖీ అధికారులు పరీక్షల విభాగం జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ సమయానికి రావడం లేదన్న సాకుతో ఉద్యోగులకు నెలనెలా జీతాలివ్వడం లేదని తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు –గోపాల్, లెక్చరర్ జిల్లా వ్యాప్తంగా పలు కళాశాలల్లో జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో బతుకు బండి నడపడం చాలా ఇబ్బందిగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా కళాశాల యాజమాన్యాలు జీతాలివ్వాలి. అలాగే ఇంటర్నల్, చివరి పరీక్షలకు సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలి. -
దిగి వస్తున్న వెండి, బంగారం ధరలు
సాక్షి, ముంబై: బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఇటీవల బలహీనంగా ఉన్న బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారుల లాభాల బుకింగ్ నేపథ్యంలో వెనకడుగువేశాయి. తాజాగా ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రా.29వేల దిగువన ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ. 176 పతనమై రూ. 28,791కు చేరింది. వెండి మార్చి ఫ్యూచర్స్ కేజీ రూ. 130 క్షీణించి రూ. 37,314ను తాకింది. అటు న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం ఔన్స్(31.1 గ్రాములు) 1260 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం 0.5 శాతం(6 డాలర్లకు పైగా) క్షీణించి 1259 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం 0.25 శాతం నష్టంతో 16 డాలర్ల దిగువన 15.92 డాలర్లను తాకింది. ఇది రెండు నెలల గరిష్టంగా నమోదైంది. నగలు, పరిశ్రమలు, రీటైల్ వర్తకుల నుంచి డిమాండ్ క్షీణించడంతో బంగార ధరలు కొద్దిగా నీరసించాయని నిపుణుల అంచనా. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిత 1.5 ట్రిలియన్ డాలర్ల పన్ను సంస్కరణల బిల్లుకు సెనేట్ ఆమోదం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో ఇతర కరెన్సీలతో డాలర్ విలువ పుంజుకుంది. ఇది పసిడిధరలను ప్రభావితం చేస్తోందని విశ్లేషించారు. ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్ ప్రకారం, బులియన్ కౌంటర్ ధరలు మరింత దిగిరానున్నాయి. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
ఆర్బీఐ రేటుకోత ఎఫెక్ట్: వీక్‌గా మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనాయి. ప్రతికూల ఆసియా మార్కెట్లు, ఆర్బీఐ వడ్డీరేటు కోత ప్రభావంతో మార్కెట్ నెగిటివ్‌గా ఓపెన్ అయింది. ఒక దశలో నిఫ్టీ 10వేల కిందికి దిగజారింది. అనంతరం కొద్దిగా తేరుకుని సెన్సెక్స్ 64 పాయింట్లు నష్టపోయి 32416, నిఫ్టీ19 పాయింట్లు కోల్పోయి 10062 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా నిన్నటి ఆర్బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లోని నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రభావం మంగళవారం నాటి మార్కెట్ ముగింపులో కనిపించింది. అది నేడు కూడా కొనసాగుతోంది. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లాభాల్లో ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో 4 శాతం ఎగిసి బాటా టాప్ విన్నర్‌గా ఉండగా, ఏఓసీ, హెచ్‌పీసీఎల్, సిప్లా, లుపిన్, వర్క్‌హార్డ్, అరబిందో లాభాల్లో కొనసాగుతున్నాయి. కెనరా, యూనియన్‌బ్యాంక్, బీఓబీ, కోటక్, ఎస్ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి. వీటితో పాటు బీహెచ్ఈఎల్, వపర్ గ్రిడ్, టాటా స్టీల్ బలహీనంగా కొనసాగుతున్నాయి. అటు డాలర్‌మారకంలో రుపీ బలంగా ఉంది. 0.39 పైసలు ఎగిసి రూ.63. 69వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.86లు ఎగిసి రూ. 28, 490వద్ద ఉంది. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆరంభంనుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య నడిచిన సూచీలు బలహీనమైన గ్లోబల్ మార్కెట్ల కారణంగా చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్ ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ, లుపిన్ బాగా లాభపడడంతో మిడ్ సెషన్లో మార్కెట్లు బలపడ్డాయి. నష్టాల నుంచి బయటపడి లాభాల్లోకి ప్రవేశించాయి. చివరికి సెన్సెక్స్9 పాయింట్ల నష్టంతో 31360 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 9665 వద్ద క్లోజ్ అయ్యాయి. ఫార్మా, రియల్టీ లాభపడగా, ఐటీ , మెటల్ ఇండెక్స్ బలహీనంగా ముగిసింది. అరబిందో, డాక్టర్ రెడ్డీస్, సిప్లా ఎయిర్టెల్, జీ ఎంటర్టైన్మెంట్, ఐషర్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్ లాభాల్లో, వేదాంతా, అంబుజా, ఏషియన్ ఫెయింట్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, యాక్సిస్, బజాజ్ ఆటో, హీరోమోటో, ఐటీసీ, నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 0.12పైసలు ఎగిసి రూ. 64.65 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం పది గ్రా. 96 రూపాయలు బలహీనపడి రూ.28,020వద్ద ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలోనే నష్టాలను చవిసూచిన మార్కెట్లు చివరికి సెన్సెక్స్124 పాయింట్ల నష్టంతో 30, 834 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 9491 వద్ద ముగిశాయి. గడచిని మూడు సెషన్లుగా నెలకొన్ని సెల్లింగ్ ప్రెజర్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ సాంకేతిక స్థాయిలకు దిగువనే ముగిశాయి. ముఖ్యంగా 2017 లో మొదటిసారిగా నిఫ్టీ వరసగా ఆరవ సెషన్లో కూడా నష్టాలనే ఎదుర్కొంది. మెటల్ సెక్టార్లాభపడగా, ఎనర్జీ, మీడియా,బ్యాంకింగ్ సెక్టార్ నష్టపోయాయి. ఆర్ఐఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, జీ, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, స్టేట్‌బ్యాంక్, ఐటీసీ నష్టపోగా, టెక్‌మహీంద్రా, యస్‌బ్యాంక్, అంబుజా, టాటా స్టీల్, వేదాంతా, ఎయిర్టెల్, అల్ట్రాటెక్, ఐషర్, ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ లాభపడ్డాయి. అటు డాలర్ మారకంలో రుపాయి 0.07 పైసల నష్టంతో 64.61 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పదిగ్రా. రూ. 143 ఎగిసి రూ. 28, 696 వద్ద ఉంది. -
రూపాయి పతనం, పుత్తడి ధరలు ఢమాల్
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో మొదలుకాగా, దేశీయ కరెన్సీ, పసిడి బలహీనంగా మొదలైంది. దాదాపు15 పైసలు నష్టపోయి రెండు వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ మారకరంలో రుపీ రూ. 64.68 వద్ద కొనసాగుతోంది. అమెరికన్ ఆర్థిక డేటా అంచనాలను మించిన మోదు కావడంతో డాలర్ కు డిమాండ్ పుట్టింది. పై విదేశీ యూనిట్‌ను బలపరిచింది. దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడంతో విదేశీ కరెన్సీల నుంచి డాలర్‌కు లాభాల బాటలో నడిచింది. డాలర్ రెండువారాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. అటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంపునకే సంకేతాలివ్వడంతో దేశీయ కరెన్సీపై ఒత్తడి ప్రకటించింది. దీంతో గురువారం రూపాయి విలువ 23 పైసలు పడిపోయింది, రెండు వారాల కనిష్టం 64.53 డాలర్ల వద్ద ముగిసింది. అటు బంగారం , వెండి ధరలు బలహీనంగా ఉన్నాయి. శుక్రవారం కూడా పతనం దిశగానే పయనిస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి ధర పది గ్రా. 268 నష్టపోయి రూ. 28,762 వద్ద ముగియగా ఈ రోజు స్వల్పంగా పుంజుకుని రూ.28,784వద్ద ఉంది.. డాలర్ బలం, ఆయిల్ధరల క్షీణత ప్రభావాన్ని చూపిస్తున్నట్టు ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
అమ్మకాల తాకిడి: నష్టాల్లో మార్కెట్లు
బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో పాటు బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎమ్సీజీ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో గురువారం కూడా ఈక్విటీ బెంచ్మార్కులు పడిపోతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోతూ 26,104 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం తన కీలకమార్కు 8050 కిందకి దిగజారి 53.25 పాయింట్ల నష్టంలో 8,008గా ట్రేడ్ అవుతోంది. వరుసగా రాబోతున్న సెలవుల నేపథ్యంలో అటు ఆసియన్ మార్కెట్లూ బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో టాప్ నిఫ్టీ లూజర్‌గా నష్టాల గడిస్తోంది. ఈ కంపెనీ స్టాక్ 1.45 పడిపోయి రూ.166.35వద్ద నడుస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్జీసీ, గెయిల్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మారుతీ సుజుకీ, ఏసీసీ, కొటక్ మహింద్రా బ్యాంకులు ప్రారంభంలో నష్టాలు పాలయ్యాయి. మరోవైపు నోవర్టీస్ నుంచి ఓ బ్రాండెడ్ అంకాలజీ ప్రొడక్ట్ ను కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించగానే సన్ ఫార్మా షేర్ 1.3 శాతం జంప్ అయి టాప్ నిఫ్టీ గెయినర్‌గా ఉంది. అంతేకాక ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, అరబిందో ఫార్మాలు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్లు కొనసాగుతున్న ఈ నష్టాలకు మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం పడిపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ వరుసగా రెండో రోజు కూడా కోలుకుని 8 పైసలు లాభపడి 67.83గా ప్రారంభమైంది. -
ఫెడ్ ఎఫెక్ట్: నష్టాల్లో మార్కెట్లు
ఫెడరల్ రిజర్వు నుంచి వెలువడే ప్రకటనల భయాందోళనతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 94.98 పాయింట్ల నష్టంతో 26,602.84వద్ద, నిఫ్టీ 39.35 పాయింట్ల నష్టంతో 8182.45వద్ద ముగిసింది. రెండు రోజుల ఫెడరల్ రిజర్వు భేటీ నేడు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు ఎలాంటి ప్రకటన వెలువరుస్తుందో అని అంతర్జాతీయంగా, దేశీయంగా ఆందోళనలు నెలకొన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. 25 బేసిస్ పాయింట్లను పెంచుతారని ఇప్పటికే పలు అంచనాలు వెలువడ్డాయి. అయితే అమెరికా ఎకనామిక్ అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, మరోసారి రేట్లపెంపుపై ఫెడరల్ రిజర్వు ఎలాంటి కామెంట్లు చేస్తుందోననే దానిపై పెట్టుబడిదారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఒకవేళ వర్ధమాన దేశాలకు ప్రతికూలంగా కామెంట్లు వెలువడితే, మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు యూరోపియన్ స్టాక్స్ నష్టాల బాట పట్టాయి. దేశీయ మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 0.8 శాతం చొప్పున పడిపోయాయి. -
మహాపతనం నుంచి తెప్పరిల్లిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మహా పతనం నుంచి భారీగా తెప్పరిల్లాయి. కరెన్సీ నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం, ట్రంప్ ఆధిక్యంతో తొలుత కనిపించిన ఆందోళనలు చల్లారి, నష్టాలను పరిమితం చేసుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల్లో అనిశ్చితి తొలగిపోవడంతో దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా కోలుకుని సెన్సెక్స్ 339 నష్టంతో 27,252 వద్ద, నిఫ్టీ 112 నష్టంతో 8432 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో ఫార్మ రంగంలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రియల్టీ 11 శాతం కుప్పకూలగా, పీఎస్‌యూ దాదాపు 2 శాతం లాభపడింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలకూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు ఆకర్షణీయమైన ఫలితాలతో లుపిన్ భారీగా లాభపడింది. ఇదే బాటలో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, స్టేట్‌బ్యాంక్, జీ లాభపడగా, అంబుజా, హీరో మోటో, టెక్ మహీంద్రా, మారుతీ, అల్ట్రాటెక్, టీసీఎస్, ఏసీసీ, హిందాల్కో, టాటా పవర్, బెల్ నష్టపోయినవాటిల్లో ఉన్నాయి. అటు డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ కూడా భారీగా కోలుకుంది. 12 పైసల నష్టంతో 66.50 వద్ద వుంది. పసిడి పది గ్రా.లు 555 రూపాయల లాభంతో రూ. 30, 435వద్ద ఉంది. -
ఐటీసీ మెరుపులు, ఫార్మాపతనం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో మొదలైనా ప్రస్తుతం సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో 27394 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు క్షీణించి 8,464 వద్ద ట్రేడవుతున్నాయి.ప్రధాన సూచీలు కూడా ఇదే ఊగిసలాటల మధ్య ఉన్నాయి. మరోవైపు జీఎస్టీ ఎఫెక్ట్‌తో పొగాకు సంబంధ కంపెనీలు ముఖ్యంగా ఐటీసీ భారీ లాభాలను ఆర్జిస్తోంది. వస్తు, సేవల పన్ను బిల్లులో పొగాకు ఉత్పత్తులపై భారీ పన్ను అంచనాలకు తెరపడటంతో ఇండెక్స్ హెవీవెయిట్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ టాప్ గెయినర్ గా ఉంది. ఈ బాటలో వీఎస్టీ కూడా పయనిస్తోంది. అయితే ఫార్మా పతనం మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.అలాగే ఆటో, రియల్టీ రంగాలు నష్టాల్లోఉన్నాయి. సన్ ఫార్మా టాప్ లూజర్ గా నిలవగా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ, సిప్లా, మారుతీ, టాటా మోటార్స్ రెడ్ లోనే, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, గెయిల్, ఐసీఐసీఐ, బీవోబీ, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ గ్రీన్ లోనూ ట్రేడ్ అవుతున్నాయి. అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి 4 పైసల లాభంతో 66.71 వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా.37 రూపాయలనష్టంతో రూ.30,450 వద్ద ఉంది. -
మార్కెట్లకు టాటా గ్రూప్ దెబ్బ
ఓ వైపు టాటా గ్రూప్ దెబ్బ.. మరోవైపు ఎఫ్ఎమ్సీజీ, ఐటీ స్టాక్స్‌ల ఒత్తిడి మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 87.66 పాయింట్ల నష్టంతో 28,091.42 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 8700 దిగువన 8691.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పేయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాటా గెయినర్లుగా లాభాలు పండించగా, మహింద్రా అండ్ మహింద్రా, టాటా స్టీల్, గెయిల్, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీలు నష్టాలను గడించాయి. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పిస్తూ టాటా సన్స్ ఊహించని నిర్ణయం తీసుకోవడం, టాటా గ్రూప్ స్టాక్స్‌పై, స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. టాటా గ్రూప్ అన్ని కంపెనీల్లో టాటా స్టీల్ ఎక్కువగా నష్టాలను చవిచూసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీలో ఈ కంపెనీ షేర్లు దాదాపు 3 శాతం కిందకి దిగజారాయి. ఇతర కంపెనీలు టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసు, టాటా మోటార్స్ 1-2శాతం నష్టాల్లో ముగిశాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు టాటా స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని, దీర్ఘకాలికంగా ఈ పరిణామాలు చోటుచేసుకోవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. మూడో క్వార్టర్లో దక్షిణ కొరియా ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని డేటా వెలువడగానే, ఆ దేశ షేర్ మార్కెట్లు పడిపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.84గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.63 లాభంతో 29,826గా నమోదైంది. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
ముంబై: ఫెడ్ రేట్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టంతో వద్ద, నిఫ్టీ ఒక పాయింట్ లాభంతో 8777 వద్ద క్లోజ్ అయింది. ప్రారంభంలో వంద పాయింట్లకు పైగా లాభపడిన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. జపాన్ బ్యాంక్ ప్రకనటతో తిరిగి150 పాయింట్ల మేరకు లాభపడ్డాయి. ఇలా ఆరంభంనుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు ఉన్నట్టుండి పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ సెక్టార్ , ఎఫ్ఎంసీజీ సెక్టార్లు నష్టపోగా మెటల్స్, రియల్టీ, ఆటో రంగాలు మార్కెట్లను ఆదుకున్నాయి. , ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బీఐ టాప్ లూజర్స్ గా నిలిచాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : ఫ్లాట్‌గా ప్రారంభమైన సోమవారం నాటి స్టాక్ మార్కెట్లు.. మరింత నష్టాల పాలవుతున్నాయి. సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతో 27,945 వద్ద, నిఫ్టీ 43.25 పాయింట్ల నష్టంతో 8623 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఆర్బీఐకి కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పేరు ఖరారైన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించి లాభాల్లో ట్రేడ్ అవుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. కానీ ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్ తోపాటు ఆటో, మెటల్, బ్యాంకింగ్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు నష్టాలను చవిచూస్తున్నాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. టీసీఎస్, లుపిన్, టాటా స్టీల్ నష్టాల బాట పట్టాయి. భారత్‌లో అతిపెద్ద టెక్స్టైల్ తయారీదారి వెల్సపన్ ఇండియా 20 శాతం మేర పతనమవుతున్నాయి. వెల్సపన్ ఇండియాతో ఉన్న తన వ్యాపారాలన్నింటినీ టార్గెట్ కార్పొ మూసివేస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్టు వెలువడిన అనంతరం ఈ కంపెనీ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీ తన కీలక మార్కు 8600 కంటే పడిపోతే, ఊపందుకునే బుల్లిష్ ట్రెండ్‌ను మార్కెట్లు కోల్పోతాయని ఏంజెల్ బ్రోకింగ్ తన రీసెర్చ్ నోట్లో తెలిపింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.13 పైసలు బలహీనపడి 67.19గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం కూడా 167 రూపాయల నష్టంతో 31,237వద్ద ట్రేడ్ అవుతోంది. -
ఐటీ రంగానికి ఏమైంది?
ముంబై: విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా ఐటీ దిగ్గజాలు ఆర్థిక ఫలితాలను నమోదు చేయడంతో దేశీయస్టాక్ మార్కెట్ లో ఐటి రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కోంటోంది. టాప్ ఐటీ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం ఈ పరిణామానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో మార్కెట్ విశ్లేషకులు ఐటీ రంగం మరింత నెగిటివ్ గానే ఉండనుందనే అభప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీతత్వం ఐటీ కంపెనీలను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వివిధ ఎనలిస్టులు ఐటీ రంగ షేర్లకు దూరంగా ఉంటేనే మేలని సూచిస్తున్నారు. మరోవైపు అమెరికా ఎన్నికల ఫలితాలు ఐటీ రంగాన్ని భారీగా ప్రభావితం చేయనుంది. అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీనుంచి డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కావడం కూడా ఒక హెచ్చరిక లాంటిదని మార్కెట్ వర్గాల భావన. ఒక వేళ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే భారత ఐటీ కంపెనీలకు భారీ కష్టాలు తప్పవని పేర్కొంటున్నారు. బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో షార్ట్ పీరియడ్ లో టీసీఎస్ కు మరిన్ని కష్టాలు తప్పవని ఎనలిస్టులు అంటున్నారు. మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని రెలిగేర్, షేర్ ఖాన్ తదితర బ్రోకరేజ్ సంస్థలు సూచిస్తున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు ఐటి కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నాయని ఎనలిస్ట్ పశుపతి అద్వానీ పేర్కొన్నారు. మరోవైపు ఐటీ మేజర్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మైండ్ ట్రీ ఆర్థిక ఫలితాలు మదుపరులను నిరాశపర్చాయి. మార్కెట్లో భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో ఫలితాల తర్వాత ఇన్ఫోసిస్ 11 నెలల కనిష్టానికి, మైండ్ ట్రీ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. మంగళవారం ఫలితాలను ప్రకటించిన విప్రో బుధవారం ఉదయం ట్రేడింగ్ సమయానికి 7 శాతం పైగా నష్టపోగా, ఇన్ఫోసిస్, స్వల్ప నష్టాలతోనూ, మైండ్ ట్రీ టీసీఎస్ స్వల్ప లాభాలతోనూ కొనసాగుతున్నాయి. -
కప్పు టీతో గుండెజబ్బులు దూరం
ప్రతి రోజూ ఓ కప్పు టీ తాగితే గుండెపోటు.. స్ట్రోక్ లాంటి ప్రమాదాలను నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు టీ తాగనివారితో పోలిస్తే రోజుకు ఒక కప్పు టీ తాగేవారిలో గుండెపోటు లేదా ఇతర హృదయ సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం 35 శాతం తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. టీ తాగే అలవాటు ఉన్నవారిలో గుండెలోని ధమనుల్లో కాల్షియం తక్కువగా ఉన్నట్లు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రి శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ధమనుల్లో పేరుకునే కాల్షియం నిక్షేపాలు గుండెజబ్బులకు, స్ల్రోక్తో పాటు ఇతర ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించేదుకు టీ ప్రయోజనకరంగా ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తేలిందని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రి పరిశోధక బృందం సభ్యులు ఇలియట్ మిల్లర్ తెలిపారు. 2000 సంవత్సరంలో పరిశోధనలు ప్రారంభించినప్పుడు మొదట్లో సుమారు 6 వేల మందికి పైగా పురుషులు, మహిళలు పాల్గొన్నారని, వారెఎవ్వరికీ ఎలాంటి గుండెజబ్బులూ లేవని పరిశోధకులు తెలిపారు. తర్వాత 11 ఏళ్లలో గుండెనొప్పి, స్ల్రోక్, ఛాతీనొప్పితో బాధపడే వారితోపాటు కొందరు ఇతర గుండెజబ్బులతో మరణించిన వారి ట్రాక్ రికార్డును పరిశీలించగా... ముందుతో పోలిస్తే ఐదేళ్ల తర్వాత వారి రక్తనాళాల్లో కాల్షియం నిక్షేపాలు పేరుకున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసిందని పరిశోధకులు చెప్తున్నారు. పరిశోధన సమయంలో రోజూ ఓ కప్పు టీ తాగినవారిలో మాత్రం అస్సలు టీ తాగనివారి కంటే మూడింట ఒకవంతు గుండెనొప్పి వంటి ప్రమాదాలకు దూరంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేల్చారు. -
మరింత కళ తప్పిన పసిడి
ముంబై: పసిడి వెలవెలబోతోంది. రెండున్నర సంవత్సరాలుగా 25 వేలకు పైన స్థిరంగా ఉన్న పుత్తడి మొదటిసారి పాతికవేలకు దిగువకు దిగింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ నవంబరు నెలలో మరింత కళ తప్పాయని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిన పసిడి ధర ఈ నెలలో మరింత క్షీణించి స్వల్పంగా దిగువకు జారుకుంది. దీంతో బంగారం ధరలు మరింత పతనమ్యే సంకేతాలను అందిస్తోంది. కాగా సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 23,820, ఇక 24 క్యారెట్ల ధర రూ.25,480 దగ్గర ఉంది. గోల్డ్ ఎంసీఎక్స్ మార్కెట్ లో 10. గ్రాముల పసిడి విలువ 25 వేల మార్కుకు స్వల్ప దిగువన రూ.24,952 దగ్గర ట్రేడవుతోంది. దీంతో ఇన్టెస్లర్లలో కొత్త ఆశలు మరింత చిగురుస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధర క్షీణత నవంబరు నాటికి 7.5 శాతానికి చేరింది. ఇది 2013 జూన్ మాసంలోని ధరలతో పోలిస్తే మరింత కనిష్టం. ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో దాని తదుపరి ద్రవ్య సమీక్షలో వడ్డీ రేట్లు పెంచనుందనే అంచనాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఒక దశాబ్దం తర్వాత యూఎస్ వడ్డీ రేటు పెంపు వార్తలతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది నెలల గరిష్టానికి చేరుకున్న డాలర్ విలువ మరింత పెరిగితే బంగారం ధరలు ఇంకా దిగిరావడం ఖాయమని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలో బంగారు మైనర్లు, తమ కరెన్సీ బలహీనత భయాన్ని పోగొట్టేందుకు గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరల క్షీణతను నిరోధించేందుకు బంగారం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన గణాంకాలను ఆదివారం విడుదల చేశారు. అటు ఈ గురువారం జరగనున్న సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యసమీక్షా సమావేశం కూడా కరెన్సీ మార్కెట్ పై దృష్టి పెట్టనుంది. ద్రవ్యవిధానాన్ని మరింత సరళతరం చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నానికి హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విలువ 24, 960 రూపాయలుగా నమోదైంది. గోల్డ్ ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రాముల పుత్తడి విలువ 25 వేలకు దిగువకు స్వల్పంగా జారుకుని 24, 952 దగ్గర ఉంది. గత ఆరు సంవత్సరాల్లో బంగారం ధరల పట్టికను ఓ సారి గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.