సాక్షి, ముంబై: బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఇటీవల బలహీనంగా ఉన్న బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారుల లాభాల బుకింగ్ నేపథ్యంలో వెనకడుగువేశాయి. తాజాగా ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రా.29వేల దిగువన ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ. 176 పతనమై రూ. 28,791కు చేరింది. వెండి మార్చి ఫ్యూచర్స్ కేజీ రూ. 130 క్షీణించి రూ. 37,314ను తాకింది.
అటు న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం ఔన్స్(31.1 గ్రాములు) 1260 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం 0.5 శాతం(6 డాలర్లకు పైగా) క్షీణించి 1259 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం 0.25 శాతం నష్టంతో 16 డాలర్ల దిగువన 15.92 డాలర్లను తాకింది. ఇది రెండు నెలల గరిష్టంగా నమోదైంది.
నగలు, పరిశ్రమలు, రీటైల్ వర్తకుల నుంచి డిమాండ్ క్షీణించడంతో బంగార ధరలు కొద్దిగా నీరసించాయని నిపుణుల అంచనా. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిత 1.5 ట్రిలియన్ డాలర్ల పన్ను సంస్కరణల బిల్లుకు సెనేట్ ఆమోదం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో ఇతర కరెన్సీలతో డాలర్ విలువ పుంజుకుంది. ఇది పసిడిధరలను ప్రభావితం చేస్తోందని విశ్లేషించారు. ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ అడ్వైజర్స్ ప్రకారం, బులియన్ కౌంటర్ ధరలు మరింత దిగిరానున్నాయి. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment