కప్పు టీతో గుండెజబ్బులు దూరం
ప్రతి రోజూ ఓ కప్పు టీ తాగితే గుండెపోటు.. స్ట్రోక్ లాంటి ప్రమాదాలను నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు టీ తాగనివారితో పోలిస్తే రోజుకు ఒక కప్పు టీ తాగేవారిలో గుండెపోటు లేదా ఇతర హృదయ సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం 35 శాతం తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
టీ తాగే అలవాటు ఉన్నవారిలో గుండెలోని ధమనుల్లో కాల్షియం తక్కువగా ఉన్నట్లు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రి శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ధమనుల్లో పేరుకునే కాల్షియం నిక్షేపాలు గుండెజబ్బులకు, స్ల్రోక్‌తో పాటు ఇతర ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించేదుకు టీ ప్రయోజనకరంగా ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తేలిందని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రి పరిశోధక బృందం సభ్యులు ఇలియట్ మిల్లర్ తెలిపారు.
2000 సంవత్సరంలో పరిశోధనలు ప్రారంభించినప్పుడు మొదట్లో సుమారు 6 వేల మందికి పైగా పురుషులు, మహిళలు పాల్గొన్నారని, వారెఎవ్వరికీ ఎలాంటి గుండెజబ్బులూ లేవని పరిశోధకులు తెలిపారు. తర్వాత 11 ఏళ్లలో గుండెనొప్పి, స్ల్రోక్, ఛాతీనొప్పితో బాధపడే వారితోపాటు కొందరు ఇతర గుండెజబ్బులతో మరణించిన వారి ట్రాక్ రికార్డును పరిశీలించగా... ముందుతో పోలిస్తే ఐదేళ్ల తర్వాత వారి రక్తనాళాల్లో కాల్షియం నిక్షేపాలు పేరుకున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసిందని పరిశోధకులు చెప్తున్నారు. పరిశోధన సమయంలో రోజూ ఓ కప్పు టీ తాగినవారిలో మాత్రం అస్సలు టీ తాగనివారి కంటే మూడింట ఒకవంతు గుండెనొప్పి వంటి ప్రమాదాలకు దూరంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేల్చారు.